Tuesday, January 14, 2025

 @ మతం - సైన్సు @

మతమూ 
మత విశ్వాసాలూ నమ్మకాలూ
తరచుగా గాయపరిచేసుకుంటాయి
మనోభావాలను

శాస్త్రమూ 
శాస్త్ర జ్ఞానమూ విజ్ఞానమూ
గాయపరచుకోవు ఎప్పుడూ  
తమ మనోభావాలను

**********

భిన్నమైన 
అభిప్రాయాలనూ 
వ్యతిరేకమైన వ్యాఖ్యానాలనూ 
ఎంతమాత్రం సహించదు మతం 

పరస్పరమూ 
భిన్నమైన అభిప్రాయాలను
పూర్తిగా వ్యతిరేకమైన వ్యాఖ్యానాలనూ
సహృదయంతో స్వీకరిస్తుంది సైన్సు

***********

మార్పును అంగీకరించదు 
తనని తాను సంస్కరించుకోదు
తను ప్రతిపాదించిన విలువలే శాశ్వతమూ నిత్యనూతనమూ
అంటుంది మతం 

మార్పును అంగీకరిస్తుంది 
తనని తాను సంస్కరించుకుంటుంది
తన ప్రతిపాదనలే సత్యమని శాశ్వతమనీ
మంకుపట్టు పట్టదు సైన్స్ 

************

గుడ్డి నమ్మకాలూ
అంధ విశ్వాసాలూ 
ఇవే పునాది మతానికి

ప్రశ్నలూ తర్కమూ హేతువూ 
కుతూహలమూ పరిశీలనా పరిశోధనా
ఇవే ఇవే.... ఆధారం సైన్సుకు

*********

మతమూ
మత నమ్మకాలూ విశ్వాసాలూ 
అణచేయాలనీ తుడిచిపెట్టేయాలని చూసినా
పురోగమిస్తూనే ఉంటుంది సైన్సు 

శాస్త్రీయతా....
తార్కికమైన ఆలోచనా 
హేతుబద్ధమైన పరిశీలనా శోధనా వికశించేకొద్దీ 
అనివార్యంగానే సమసిపోతుంది మతం

********

మతములన్నియూ 
మాసిపోవును 

జ్ఞానమొక్కటే నిలచీ 
వెలుగులు విరజిమ్మును

- రత్నాజేయ్ (పెద్దాపురం)
-

No comments:

Post a Comment