Wednesday, January 15, 2025

 *🙏కనుమ రోజు ఎందుకు ప్రయాణం చేయకూడదు...!!*


🌿సంక్రాంతి అంటే పంటల పండుగే అని అందరికీ తెలిసిందే. కానీ ఆ పంటలు బాగా పండాలంటే, పశువుల సాయం కూడా కావాలిగా! అందుకే సంక్రాంతి మర్నాడు కనుమని పశువుల పండుగగా పిలుస్తారు. 

🌸పశువులు ఉన్నవారు ఆ రోజు వాటిని శుభ్రంగా అలంకరించి మంచి ఆహారం పెడతారు. పక్షులకి కూడా ఆహారం అందేలా ఇంటిచూరుకి ధాన్యపుకంకులు వేలాడదీస్తారు.

🌿ఇదంతా రైతుల సంగతి. కానీ మిగతావారు పాటించే ఆచారాలు కూడా చాలా ఉన్నాయి. సంక్రాంతితో ఉత్తరాయణం మొదలవుతుంది. ఈ ఉత్తరాయణంతోనే భూమి తిరిగే దిశ మారుతుంది. 

🌸దేవతలకు ఉత్తరాయణం పగటికాలం అనీ, ఇది వారికి చాలా ఇష్టమైన సమయమనీ చెబుతారు. అందుకే దీన్ని ఉత్తరాయణ పుణ్యకాలం అని పిలుస్తారు. 

🌿ఈ రోజున చనిపోయిన పెద్దలు బయటకు వస్తారనీ, వారిని తల్చుకుంటూ ప్రసాదాలు పెట్టాలనీ ఓ ఆచారం.

🌸కనుమ రోజు అటు పెద్దలకి ప్రసాదం పెట్టేందుకు, ఇటు ఇంట్లోవారు కడుపు నిండా తినేందుకు... మాంసాహారాన్ని మించి ఏముంటుంది. మాంసం తినని వారికి, దాంతో సమానమైన పోషకాలని ఇచ్చేవి మినుములు. అందుకనే గారెలు, మాంసంతో... ఈ రోజు పెద్దలకి ప్రసాదం పెడతారు. 

🌿అందుకే ‘కనుమ రోజు మినుములు తినాలి’ అనే సామెత మొదలైంది. మినుములు ఈ చలికాలంలో ఒంట్లో తగినంత వేడిని పెంచేందుకు కూడా ఉపయోగపడతాయి.

🌸కనుమ రోజు పెద్దల కోసం విందుభోజనం తయారుచేయడమే కాదు... దాన్ని అందరూ కలిసితినాలనే నియమం కూడా ఉంది. అందుకే అక్కాచెల్లెళ్లు, అల్లుళ్లతో కలిసి ఈ కనుమ వేడుకని చేసుకుంటారు.

🌿 పొద్దున్నే పశువులని పూజించుకోవడం, మధ్యాహ్నం పితృదేవతలకి ప్రసాదాలు పెట్టి సుష్టుగా భోజనం చేయడం... అంతా కలిసే చేస్తారు. 

🌸కొన్ని పల్లెటూర్లలో కనుమ రోజు పొంగళ్లు వండటం, బలి ఇవ్వడం లాంటి కార్యక్రమాలు కూడా జరిగుతాయి.

🌿అందుకే తెలుగువారికి సంక్రాంతి అంటే కేవలం ఒక్కరోజు పండుగ కాదు... భోగి, సంక్రాంతి, కనుమలు కలిసిన మూడు రోజుల పండుగ. 

కనుమ రోజు ఇంత హడావుడి ఉంటుంది కాబట్టి, ఆ రోజు కూడా ఆగి... పెద్దలను తల్చుకుని, బంధువులతో కాస్త సమయం గడిపి, విశ్రాంతి తీసుకుని... మర్నాడు ప్రయాణించమని చెబుతారు. 

🌸అందుకే ‘కనుమ రోజు కాకి కూడా కదలదు’ అన్న సామెత పుట్టి ఉండవచ్చు. 

🌿కనుమ రోజు ప్రయాణం చేయకూడదని పెద్దలు చెప్పిన మాట వెనుక ఇంత కథ ఉంది. 

🌸అత్యవసరం అయితే తప్ప.. ఆ మాట దాటకూడదనీ... ఒకవేళ కాదూకూడదంటూ కనుమ రోజు ప్రయాణం చేస్తే ఆటంకాలు తప్పవని అంటారు...స్వస్తి...🚩🌞🙏

No comments:

Post a Comment