సొలోమోన్ విజయ్ కుమార్
"సన్ ఆఫ్ జోజప్ప"-The Passion of Pillodu.
"A man must partly give up being a man
With women-folk." --
Robert Frost
ఈ సృష్టిలో
అచ్చమైన మగోడు,
అచ్చమైన ఆడది ఒక హాంబగ్
అని నా ఫీలింగ్.
కించిత్ అయినా ఆడతనం లేని మగోడు, మగతనం లేని ఆడది ఉన్నారంటే నా అభిప్రాయంలో వాళ్ళు అసంపూర్ణులు అంటా.
ఈ నవలలో ప్రధాన పాత్ర
"పిల్లోడు" ఎదిగేకొద్ది అన్నీ ఆడ పిల్ల చేష్టలే చేస్తా ఉంటాడు.
మొగపిలకాయల ఆటలకన్నా ఆడపిలకయాల ఆటల మీదనే మక్కువ. బొమ్మలతోబాటు, ముగ్గులు ఏయడం ఇష్టం. అడోళ్లలా బింది సంకలో బెట్టుకొని నీళ్లు తేవాలన్నట్టు, అమ్మ, అవ్వలాగ పొయ్యికాడ కూర్చొని కత్తిపీట రెండు కాళ్లమధ్య పెట్టి కూరగాయలు కోసి, కూర వండాలని ఇష్టం.
"అవ్వా, అమ్మా చాలా సార్లు నువ్వు మొగబిడ్డవి, మొగబిడ్డ మాదిర్నే ఉండాల. అడపిలకాయల పన్లు జెయ్యిగూడదు" అంటే మొగబిడ్డ మాదిర్న వుండడవంటే యాందో, అదెట్టుండాలో, మొగ బిడ్డలాగకుండా ఇంకా ఏలా ఉన్నాడో పిల్లోడికి అర్థమయ్యేది కాదు.
దుర్గా బావని మరదలుకుమల్లే ఇష్టపడతాడు. దుర్గా బావ పులుసు అనే అమ్మాయికి సైట్ కొడుతుంటే అమ్మాయిలా జలస్ ఫీల్ అవుతాడు.ఆ తర్వాత గుణ, సుధ అనే మగ పిల్లల్ని ఇష్టపడతాడు.
సుధా-పిల్లోడిది ఒక రకమైన అమ్మాయి-అబ్బాయి భగ్న ప్రేమ. అచ్చం అమ్మాయిలా తన మనసు అర్థం చేసుకున్న మగాడికి తనను అర్పించుకోవాలన్నంత ఆశ.
"ఆడపిల్లని ముద్దు జేసినట్టు జెయ్యి బావా. నన్ను సల్లంగా అబ్బిలిచ్చుకోని మాటల్లో శాతల్లో కళ్లల్లో లవ్వరు మాదిర్న పేవ జూపిచ్చురా," అని సుధాగాడిని అడుగుతాడు.
ఇలాటి ఫీలింగ్స్ తోనే దుర్గా బావని, గుణాని ఇష్టపడతాడు. ట్యూషన్ చెప్పిన శ్యామ్ అన్న దగ్గర కూడా ఈ ప్రేమనే ఆశిస్తాడు.
ఈ చర్యలన్నింటిలో పిల్లోడు ఎదుటివాళ్ల నుండి తను ఒక ఆడపిల్ల అన్న యాక్సెప్టెన్స్ ని కోరుకుంటాడు.
కానీ అది జరిగేదేనా..
ఆడపిల్లగా పుట్టి ఆడ పిల్లగా ఎదిగేవోళ్లకే దిక్కు లేదిక్కడ.
పిల్లోడికి "మనసుకి ఊకిచ్చుకొనేదీ, అశిబడేదీ వొకటైతే జరిగేది ఇంకొకటి."
అన్నట్టు పిల్లోడు Eunach అనుకుంటున్నారేమో.
కాదు. అతను ఒక "అతనులో" చిక్కుకుపోయిన 'ఆమె' . ఇతని మగతనాన్ని చీల్చుకొని బయట పడాలని "ఆమె" ఆరాట పడుతుంది.
అలా బయటకు రాగలిగితే అదో సుఖప్రాప్తి.(దీన్నే Gender Euphoria అంటారు). అతనిలోని ఆమె వ్యక్తీకరణకు అవరోధం ఏర్పడినప్పుడు ప్రతిఫలం తీవ్రమైన ఆందోళన, వివిధ రకాల మానిసిక, శారీరక సంఘర్షణలకి గురవుతుంది. దీన్నే జండర్ డిస్ఫోరియా అంటారు.
మొదటికే తండ్రి లేని బిడ్డ. తల్లి నుండి రావాల్సినంత ఆదరణ రాకపోగా పిరికోడిలా పెంచుతుంది. అమ్మ దగ్గరికొచ్చే 'బాబు' అయితే రాక్షసుడే. బంధువుల నుండీ కావాల్సినంత ఆదరణ రాదు. చదువు రాదు. చదువు రాదు కాబట్టి టీచర్స్ నుండి మద్దత్తు ఎలా ఉంటాదో ఇక ఊహించుకోవచ్చు. తోటి పిల్లలు ఎగతాళి ఉండనే వుంటాది.
ఇవన్నీగాక తను ఒక ఆడపిల్ల అనుకోని మొగ పిల్లల్ని ఇష్టపడితే వాళ్ళు వీడిలో సుకుమారమైన ఆడ మనసుని గ్రహించకపోగా వాడుకొని వదిలేసేవాళ్లే.
ఇటువంటి పరిస్థితుల్లో పిల్లోడు జీవితం అనేక కుదువులకు గురవుతుంది. జండర్ డిస్ఫోరియా ఉన్న వ్యక్తుల్లో పూర్ సెల్ఫ్ ఎస్టీమ్, స్ట్రెస్, పర్సనల్ కేర్ లేకపోవడం, లోన్లీగా, ఐసోలాటెడ్ గా ఉండిపోవడం, డ్రగ్స్ కి బానిస అవడం , సెల్ఫ్ హేట్రెడ్, తనను తాను గాయ పరుచుకోవడం, చివరకు ఈ కథలో పిల్లోడిలా ఆత్మ హత్యకు కూడా పూనుకోవడం వంటి లక్షణాలు ఉంటాయి.
పిల్లోడు తనకి నచ్చినట్టు తాను ఉండలేక "మణుసులకి బాగా ఎడం" అవుతాడు. చిన్నప్పటి టెడ్డీ బేర్ తో మాట్లాడుకుంటాడు. రాత్రీ పగలు "వొంటిగా పుస్తకాలు సదవతుంటాడు."
యాడకి పోయినా అందరూ తననే చూస్తున్నారన్నట్టు భ్రమ పడతాడు. తన "లావోటి సళ్ళూ, కడుపూ, తొడలూ" చూసుకొని "ఎందుకు నేనిట్ఠా పుట్టాను? అనుకుంటాడు. వాడి మీద వాడికే చెప్పలేనంత "ఆసీకం" పుట్టిద్ది. అందరూ నన్ను చూసి నవ్వేటోళ్లే. బాధ పెట్టేతోళ్లే. అర్తం చేస్కునేటోళ్లు ఒక్కరు కూడా లేరని లింగకి చెప్పుకొని ఏడుస్తాడు.
"అయోమయపు పెపంచపు, ఏదీ సక్కరంగా అర్తంగాని వొంటిలోకపు" పిల్లోడు చివరివరకు కూడా తనెవ్వరో, తననెలా అర్తం చేసుకోవాలో చెప్పేందుకు ప్రయత్నించి ప్రయత్నించి అలసిపోయి ఈలోకంనుండి విశ్రాంతి తీసుకుంటాడు.
ఈ చివరి మజిలీకి ముందు తనని అనేక సార్లు చంపిందెవరో తలిచుకొని నవ్వుకుంటాడు. ఈలోకంలోకి తన రాకను తెలిపే అమాయకపు ఏడుపుతో మొదలైన జీవితం తనకు ఎలాంటి బ్రతుకునిచ్చిందో గుర్తు తెచ్చుకొని ఈలోకం తనలాంటివాళ్ళది కాదని గుర్తెరిగిఒక నిస్సహాయాపునవ్వుతో తన ఈ లోకంతో పడిన ఆపసోపాలను ముగిస్తాడు పిల్లోడు.
ఇలాంటి సమస్యతో మన చుట్టూ ఎవరో ఒకరు కనబడకుండా వుండరు. మనమధ్య కూడా ఎవరో ఒకరు ఉండకుండా వుండరు. మనలో ఒకడిగా, మనతో కలిసి తిరిగిన మనిషిని చూస్తూ చూస్తూ ఇంత టార్చర్ అనుభవించనిద్దామా?
ఇలాంటి మనుషుల పట్ల మనం ఎలా ప్రవర్తించాలి? వీటికి సమాధానం చర్చీలో విగ్రహ రూపంలో ఉండి కథ ఆసాంతం పిల్లోడికి భరోసాగా ఉన్న జోజప్పలా, పిల్లోడి అవ్వలా, పిల్లోడిలో ఆడ పిల్లని అర్థం చేసుకొని "నేస్తురాళ్ళైన ఇద్దరు ఆడపిలకాయిల మాదిర్న" పిల్లోడితో కలిసిపోయే లింగలా ఉండాల్సిన అవసరం సోషల్ యానిమల్స్ అయిన మనందరి మీద ఉంది.
ఈ నవల అందరూ చడవాల్సినది. మరి ముఖ్యంగా నిత్యం వందలమంది పిల్లల మధ్య గడిపే టీచర్లు తప్పనిసరిగా చదవాలనే అభిప్రాయంతో తాత్కాలిక విరామం.
(..... చెప్పాల్సినవి చాలా ఉన్నాయ్).
©®SB

No comments:
Post a Comment