Wednesday, January 15, 2025

 _*🕉️🪷---"శ్రీ విష్ణు పురాణం"---🪷🕉️*_

_*శ్రీ గణేశాయ నమః శ్రీ సరస్వత్యై నమః*_ 
_*శ్రీ గురుభ్యోనమః*_

🕉️🌷🕉️🌷🕉️🌷🕉️🌷🕉️

_*👉 43వ భాగం:-*_

క్షేత్రం తెలిసి విత్తు వెయ్యాలి. పాత్రమెరిగి దానమియ్యాలి...

అని అనగా మాంధాత మునీంద్రా! అనుమానమా? నీ మనసులోని కోరిక ఏమో సెలవిస్తే తప్పక ఇస్తాను.

'రాజా! ఔచిత్యం అనౌచిత్యం తెలిసిన వాడవు - సత్య వచనుడవు. అని నమ్మి అడుగుతున్నాను. విను. నీ పుత్రికల్లో ఒకతెను ఇల్లాలిగా నాకు ఇవ్వాలని కోరిక. ఆ విధంగా నీ పేరుతో నేను గృహస్థునౌతాను.

ఆ సమయంలో సౌభరి తీరు, నడక బడలిక, మాసి తెలుపెక్కిన గడ్డం, పట్టుతప్పి నిడుపై సన్ననై ఉన్న శరీరం.

మాంధాత తనలో అనుకున్నాడు. ఏమి చెయ్యడం? ఆలోచించాడు. సన్న సన్నగా అన్నాడు. మా పూర్వులు కన్యలు మెచ్చిన వారికే యిల్లాండ్రుగా ఇచ్చారు. అంతేగాని ఎంత ఐశ్వర్యం ఉన్నా అందచందాలున్నా ఇచ్చేది లేదు. నేను ఆ త్రోవనే వెళ్లదలచి ఉన్నాను. మునీంద్రా! నా మనవి విను.

వయసు మళ్లి శరీరం దిగజారి చిక్కి ఉన్న నిన్ను మోహనరూపు రేఖలున్న నా కూతుళ్లలో ఏ ఒక్కతైనా ఒప్పుకుంటుందా?

మాంధాత మాటలు విని సౌభరి నవ్వుతూ అన్నాడు. రాజా! మంచిమాట అన్నావు. నిజమే. నేను అలా ఉన్నాను. కాని నామాట విను. నన్ను నీకూతుళ్లు ఉన్నచోటికి తీసుకువెళ్లు. వారు నన్నుచూసి ఇష్టపడితే ఏ కూతురినైనా యిచ్చి పెండ్లిచెయ్యి. ఇష్టపడకపోతే నా వచ్చిన దారినే తిరిగిపోతాను.

రాజు మరి మాటాడలేక సరే అని అంతఃపురం కాపరిగా ఉన్న వానిని రప్పించాడు. ఈ మునీందుణ్ణి కన్యకలున్న చోటుకు తీసుకువెళ్లు. వారిలో ఏ ఒకర్తె అయినా ఇతనిని చూసి అంగీకరిస్తే ఇద్దరికీ పెండ్లి జరిపిస్తాను. అని అనగా వాడు కన్యకలున్న అంతఃపురానికి సౌభరిని తీసుకువెళ్లాడు. అక్కడికి వెళ్లగానే సౌభరి నరసురగణాలలో ఏ ఒకరికీ లేని అందచందాల రూపుతో మారిపోయాడు. 

అంతఃపుర రక్షకుడు కన్యలను రావించి చూడండి యీ ముసలి తాపసుణ్ణి. మీవద్దకు మీతండ్రి పంపగా తీసుకువచ్చాను. మీలో ఒకరిని భార్యగా ఇమ్మన్నాడాయన - మీలో ఎవరు ఇతనిని చూసి ఇష్టపడతారో చెప్పితే మీనాయన మీయిద్దరికీ పెండ్లి చేస్తాడు. చూడండి.

ఆ సుందరాంగులు సౌభరి రూపురేఖలు చూసి మురిసిపోయారు. నన్నంటే నన్ను - నేనంటే నేను - అని ఒకరికి మించి ఒకరు వాదాడసాగారు

కాపరి రాజువద్దకు వచ్చి ప్రభూ! నీకూతుళ్లు అందరూ ఆ మునిని చూసి ఒకరితో ఒకరు వాదిస్తున్నారు. నేనంటే నేను, అని - అని చెప్పగా మాంధాత ముని తపోమహిమకి అబ్బురపడి శుభముహూర్తాన యాభైమందినీ సౌభరికి ఇచ్చి పెండ్లిచేసి సమృద్ధిగా వస్త్రాదులిచ్చి ముని వెంట పంపించాడు.

సౌభరి భార్యలతో ఆశ్రమానికి వచ్చి దేవశిల్పియైన విశ్వకర్మను తల్చుకున్నాడు. అక్కడికక్కడ ఎదుట నిల్చున్నాడు అమరశిల్పి. అతనిని చూసి సౌభరి చెప్పాడు.

నేను గృహస్థునయ్యాను. నా భార్యలందరూ మహారాజ పుత్రికలు. దివ్యభోగాలను భవించినవారు. కావున వారికి నివసించదగిన రతనాలు పొదిగిన బంగారుగోడల మేడలు నిర్మించు.

'అలాగే' - అన్నాడు శిల్పి. ఉత్తరక్షణంలో దివ్యభవనాలు. వాటిలో హంసతూలికా తల్పాలూ, నిలువుటద్దాలూ, పెరళ్లలో పువ్వుల తోటలూ, నడబావులూ సర్వసమృద్ధిగా రూపొందించాడు. మునికి చెప్పాడు. సౌభరి చూసి సంతోషించి తన భార్యలను ఆ భవనాలలో ప్రవేశపెట్టాడు. మరి వారికి పనికత్తెలు ఉండాలిగా. ఒక్క క్షణం ఆలోచించాడు. 

తపశ్శక్తిచే అప్సరలను రావించి భార్యలకు సేవికలుగా నియమించాడు. వారికి తగిన అమూల్యాభరణాలు కానుకలుగా ఇచ్చాడు. షడ్రసోపేతమైన ఆహారపదార్థాలతో ఏపూటకాపూట కలిగిస్తూ భార్యలతో ఆరగిస్తూ ఆనందిస్తూ కాలం గడుపుతున్నాడు.

అక్కడ మాంధాత - కందమూలాలూ, కాయలూ, పళ్లూ తింటూ కడుపుచిచ్చుతో నలుగుతూ ఒడలు దిగజారి ఉన్న తబిసికి కుసుమ సుకుమారమూర్తులనూ ఇష్ట భోజనాలతో తుష్టిగా పుష్టిగా ఉన్నవారిని కూతుళ్లను ఇల్లాండ్రుగా ఇవ్వవలసివచ్చింది. వారి స్థితి ఎలా ఉందో చూడాలని భార్యతో కొందరు పెద్దలతో సౌభరి ఉన్న అడవికి వెళ్లాడు.

దివ్యరత్నస్థగిత కాంచనభవనాలూ, విరబూచిన పూదీగలతో ఆరపండిన పండ్లతో కోకిలల కలరావాలతో నెమళ్ల క్రేంకారాలతో కనుపండువుగా వీనులవిందుగా ఉన్న తోటలో నవవికసిత పద్మాలతో ఒయ్యారపు నడకల రాయంచలతో చూడ ముచ్చటగా నున్న జలాశయాలు, ధనధాన్య సమృద్ధితో పరమానందమూర్తులైన నాలుగు వర్ణాలవారి నివాసాలు, దివ్యమంగళ వాద్యాలతో అమర గీతాలూ కలదై త్రిభువనలక్ష్మికి కాపురమై యున్న సౌభరిపురం కనిపించింది. దానిని చూడగానే మాంధాతకు సందేహం కలిగింది.

ఇదివరకిక్కడ ఊరనేదే లేదే. ఇప్పుడోపురం ఇంద్రపురమును తలక్రిందులు చేసే వైభవముతో ఒప్పారుతూ ఉండడం - ఇదేదో దేవతా సృష్టిలా ఉన్నది. దాని ప్రభువు ఎవరో? అని లోనికి వెళ్లి పౌరులవల్ల తెలుసుకుని ఆశ్చర్యముతో ఆనందముతో అల్లుకుపోయాడు.

'సౌభరి తపశ్శక్తితో ఏర్పడిన పురం ఇది' అలా వెళ్లి వెళ్లి అల్లుణ్ణి చూసి నమస్కరించి అతని సూచననుసరించి సముచితాసనాసీనుడయ్యాడు.

_*రేపటి భాగంలో మళ్లీ కలుసుకుందాం...*_

_*జై శ్రీమన్నారాయణ*_
_*జై శ్రీమన్నారాయణ*_
_*జై శ్రీమన్నారాయణ*_

_*సర్వేజనా సుఖినోభవంతు...*_

🕉️🙏🕉️🙏🕉️🙏🕉️

No comments:

Post a Comment