Tuesday, January 14, 2025

 


దేవ రహస్యాలు: ఎండపల్లి భారతి కథలు : ఛాయ ప్రచురణలు

చాలాకాలం క్రితం ఓ జోక్ చదివాను. ఆఫీసులో ఒక స్త్రీ చనువున్న తోటి మగ ఉద్యోగితో "మీ మగాళ్ళ కబుర్లలో ఏం ఉంటాయి?" అని అడగ్గానే అతడు " ఆ! ఏం ఉంటాయి? మీరు మాట్లాడుకునేవే మేమూ మాట్లాడుకుంటాం" అనగానే ఆమె "ఔనా! ఛీ" అని వెంటనే లేచి వెళ్ళిపోయిందట. 

ఈ జోక్ నగరవాసులకే పరిమితం. కానీ 'దేవ రహస్యాలు'  కథలు చాలా చిన్న పల్లెటూర్లలో నలుగురు ఆడవాళ్ళు కలుసుకున్నప్పుడు మాట్లాడుకునే మాటలు. నిజానికి అవి ఉబుసుపోక మాట్లాడుకునేవి కానేకావు. వారి సంసారిక జీవితానికి, లైంగిక సమస్యలకి సంబంధించిన అత్యంత బాధాకరమైన గుప్త విషయాలు. ఈ కథలు, నిజానికి ఇవి కథలు కావు ఒళ్ళు గగుర్పొడిచేంత కఠిన సత్యాలు. ప్రారంభించాక ఇదేదో బూతు కథలా ఉందే అని ఉత్సాహంగా మొదలెట్టారా ఓ యాభై శాతం కథని చదవగానే నడుం కింద నుంచి సన్నని వణుకు మొదలౌతుంది. మొదటి కథ పూర్తయ్యే సరికి తల దిమ్మెక్కిపోతుంది. కథ కలిగించిన నిర్వేదాన్ని  మాటల్లో రాయడం సంగతి అటుంచి ఎవరితోనైనా చెప్పడానికే ధైర్యం చాలదు. మిగిలిన కథలు చదివితే ఏం నగ్న సత్యాలు తెలుస్తాయో అని భయం వేస్తుంది.

ఈ విషయాలన్నీ ప్రపంచానికి తెలియాలని ఎంత ధైర్యం కూడగట్టుకుని భారతి గారు ఈ వాస్తవాలన్నీ కథలుగా రాసారా? అని ఆశ్చర్యం కల్గక మానదు. 

ఏ ఒక్క కథలోని విషయాన్నైనా వివరించి ఈ నాలుగు మాటల్లో అంతర్భాగం చేసే ధైర్యం నాకు లేదు కానీ ప్రతీ మగాడు చదవాల్సిన కథలని మాత్రం ఘంటాపథంగా చెప్పగలను. 

ఈ భయంకరమైన వాస్తవాలని కథలుగా రాయడానికి రచయిత్రి భారతి ఎంత ధైర్యం చేసిందో ప్రచురించడానికి 'ఛాయ' ప్రచురణ సంస్థ కూడా అంతే ధైర్యం చేసింది. మనసు పెట్టి చదివితే నేను రాసిన ఈ నాల్గు మాటల్లో పిసరంతైనా అతిశయోక్తి లేదని నాతో ఏకీభవిస్తారు. 

స్వర్గం అంటూ ఒకటి నిఝంగా ఉంటే అక్కడున్న చలం ఈ కథల విషయం తెలిసి చాలా సంతోషిస్తాడు.

- ఆర్. ఎస్. వేంకటేశ్వరన్

No comments:

Post a Comment