దేవుడు లేడన్న నగరంలో
దావానలం దడ పుట్టిస్తున్నది....
కనికరం లేని కాలం
కాలాగ్ని ధరించి చిందులు వేస్తున్నది....
ఇది విధి విలాసమా?
వికటాట్టహాసమా?
అగ్నికీలల పరిష్వంగంలో
కలల పంటలు కాలిపోతున్నవి....
ఎదురులేని సుందర స్వప్న సౌధాలు
నుసి గారుతూ మసి బొగ్గులై
కూలిపోతున్నవి....
ఇది ప్రకృతి ప్రకోపమా?
మానవ ప్రతాపమా?
ఏదీ దేవతల నగరం?
ఏదీ భూతల స్వర్గం?
ఏమీ భస్మి పటలం ??
శాసించిన ఆధిపత్యానికి
ఇది విఘాతమా?
మోయలేని విషాదమా?
ప్రమాదాలు ఖచ్చితంగా
లీలా విన్యాసాలు కాదు,
తాంత్రిక మాంత్రిక తాగాదాలు కాదు,
నాస్తికుల వాదనలు కానే కాదు
ఆస్తికుల ఆక్రోషాలు అంతకన్నా కాదు
ఇది ఎవ్వరి తప్పిదం?
ఎవరిదీ భీకర విలయ తాండవం?
నాగరికత నగీషీల సాక్షిగా ~
శాస్త్ర విజ్ఞానం సాక్షిగా....
మూఢత్వాల సాక్షిగా ~
రాళ్లను మొక్కిన తావులోనే కాదు,
అభివృద్ధి ఆకాశాన్ని అంటిన చోట కూడా
మరణం ఇప్పుడు పరిశీలనలో ఉన్న వార్త !
కాదంటావా మిత్రమా!?

No comments:
Post a Comment