*_అతడే ఒక సైన్యం!_*
*********************
_నెల్సన్ మండేలా జయంతి_
18.07.1918
🔥🔥🔥🔥🔥🔥🔥
_(సురేష్ కుమార్ ఎలిశెట్టి_)
9948546286
9030296286
✍🏽✍🏽✍🏽✍🏽✍🏽✍🏽✍🏽
ఒళ్లంతా వాచిపోయేలా దెబ్బలు తిన్న
మండేలా బాధతో
చేసిన ఆక్రందన..
నల్ల జాతి ఆవేదన
ఒక దేశం రోదన...
ఆయనపై పాలకుల కక్ష..
27 సంవత్సరాల శిక్ష..
నల్ల సూరీది రుధిరంతో
తడిసి ముద్దయిన
జైలు గోడలు..
ప్రపంచానికి తెలియని
ఒక భయంకర అనుభవం..
రోబెన్ ద్వీపం..
అదెంత చేసుకుందో పాపం..
కళ్ళారా చూసింది
ఓ మహావీరుని పరితాపం..
దుష్టాలకుల ప్రకోపం..
వీటితో పాటు గాంచింది
వెన్ను చూపని
ఆ మహావీరుని ప్రతాపం..!
స్వేచ్ఛ ప్రతి మనిషి ఇచ్చ..
రంగుల తేడాలేంటి..
వర్ణాల వివక్షలెందుకని
ఉరిమిన నల్ల వీరుడు..
నల్లజాతి హక్కుల కోసం
ప్రశ్నించడమే పాపమై..
అదే శాపమై..
జైలుకు పంపితే
ఆగేదా ఆవేశం..
మూగపోయేదా
నిలదీయడమే నేర్చిన
ఆ గళం..!
అటు తెలుపు..ఇటు నలుపు
ఆ వైపు అధికారం
ఇచ్చిన బలుపు..
ఈవైపు అణచివేతకు
నలిగిన జనం
కంటి ఎరుపు..
ఆ మధ్యలో దిక్కులు పిక్కటిల్లేలా
మండేలా పిలుపు...
దశాబ్దాల పోరాటంతో
సాధించిన మలుపు..
నల్లసూర్యుడి గెలుపు..!
అమ్మ క్షీరం కంటే
సెంట్రీ మూత్రమే
ఎక్కువగా తాగానన్న
ఒకనాటి ఖైదీ...
బాపూ సిద్ధాంతాలే స్ఫూర్తిగా
చరిత్ర మరవని అపారకీర్తిగా
తెలుపునలుపుల నడుమ
హద్దులు చెరపగా..
సరిహద్దుల్లో పొడిచింది తొలిపొద్దు..
ఆ ఉదయం..
నల్లజాతికి తొలి ఉషోదయం
మండేలా తానుగా సృష్టించిన మహోదయం..!
దక్షిణాఫ్రికా పోరాట చరిత్రలో
ప్రతి పుట..ప్రతి సంపుటి..
మండేలా రుధిరమే సిరాగా
ఆయన ఆవేశమే అంశంగా..
అతడి వ్యధాంశమే కథాంశంగా..
అతగాడి విజయమే
ఇతివృత్తంగా..
ఆ వీరుడి జీవితమే మొత్తంగా..
ఒక ఇతిహాసమై..
ఆధునిక జగతి ఎప్పటికీ
మరచిపోని
గొప్ప సన్నివేశమై!
జైలు గోడలు చీల్చి..
మాటల తూటాలు పేల్చి..
చారిత్రక పోరాటానికి
మెట్లు పేర్చి..
నిరంకుశ పాలకుల
గుండెలు మండేలా
నెల్సన్ మండేలా
చేసిన సింహనాదం..
దక్షిణాఫ్రికా స్వేచ్ఛానినాదం!
కారాగారమే కాటిసీమగా
అంతమైపోవాల్సిన జీవితం
స్వేచ్ఛావాయువులు పీల్చి
ఒక జాతికి తానే రక్షకుడై..
దేశానికే అధ్యక్షుడై..
రణాలు చేసిన
గుణాలను వదిలి..
సంస్కరణలు చేపట్టి..
నోబుల్ శాంతి బహుమతి
సాధించాడు..
భారతరత్నమూ అయ్యాడు..
ఎల్లలెరుగని నల్లసూరీడు..!
************************
No comments:
Post a Comment