Sunday, July 20, 2025

 శ్రీ కంచి పరమాచార్య వైభవమ్…
  నడిచే దేవుడు…పరమాచార్య పావన గాధలు…


*జానకిరామయ్యగారి*
                      *అనుభవాలు*
                   
```
కంచి కామాక్షి అమ్మవారి ఆలయ కుంభాభిషేకం 1944లో జరిగింది. ఈ సమయంలోనే జానకిరామయ్య గారు శ్రీమఠానికి బాగా దగ్గరయ్యారు. వారు తీర్థ - పురోహితులు అనే శాఖకు చెందినవారు. అప్పటికే వారు చాలా ప్రముఖులు. వారి తండ్రి గారి కాలంలో వాళ్ళ ఇంట్లోనే ముగ్గురు నలుగురు సహాయక పురోహితులు ఉండేవారు. వారు కాంచీపురం రైల్వే స్టేషనుకు వెళ్లి ఉత్తరభారతం నుండి వచ్చిన యాత్రికులను కలుసుకుని వారికి భోజన, వసతి ఏర్పాట్లు చేసేవారు. ఎన్నో రాచకుటుంబాల వారు ముఖ్యంగా రాజస్థానీయులు కాంచీపురానికి వచ్చేవారు. ఆ పురోహితులు సర్వతీర్థ దేవాలయ కొలనులో వారితో సంకల్ప సాహిత స్నానం చేయించేవారు. అక్కడే వారి పితరులకు శ్రాద్ధ విధులు కూడా చేయించేవారు.

“ఇప్పుడు ఇవన్నీ జరగడంలేదు. యాత్రికులు ఎవరూ పితృకార్యాలు చేయించడానికి సుముఖత చూపించడంలేదు. వాటి గురించి చెప్పి చేయించే పురోహితులూ లేరు” అని వాపోయేవారు జానకిరామయ్య గారు. వారు చాలా నిస్పృహతో గత రోజులను తలచుకొని బాధపడేవారు.

ఒకానొక సమయంలో కంచి కామాక్షి అమ్మవారి ఆలయ పారంపర్య ధర్మకర్తలుగా ఉన్న పరమాచార్య స్వామివారు వైదొలగారు. అప్పుడు అమ్మవారి దేవాలయం రిలీజియస్ ఎండోమెంట్స్ బోర్డ్ ఆధీనంలో ఉండేది. కాని యం.భక్తవత్సలం గారు పదే పదే అభ్యర్తించడంతో శ్రీమఠం తరుపున నుండి ధర్మకర్తను నియమించారు.

1953 - 1954లో కామాక్షి అమ్మవారి దేవాలయానికి జానకిరామయ్య గారు ట్రస్టిగా ఉన్నారు. కోర్టులో కేసు పూర్తైన తరువాత మరలా అమ్మవారి దేవాలయం శ్రీమఠం ఆధీనంలోకి వచ్చింది. జానకిరామయ్య గారు మదురై మీనాక్షి అమ్మవారి దేవాలయ కుంభాభిషేకం కోసమని మదురైలో ఉన్నారు. పరమాచార్య స్వామివారు కబురంపగా, వారు రాగానే కామాక్షి ఆలయానికి శ్రీకార్యంగా నియమించారు. 1984లో ఆరోగ్య సమస్యల దృష్ట్యా జానకిరామయ్య గారు శ్రీకార్యం నుండి వైదొలిగారు.

వారు చెప్పిన విషయాలు వారి మాటల్లోనే.

“నేను శ్రీకార్యం అయినప్పుడు ఆలయానికి ఏమాత్రం ఆదాయం లేదు. హుండి పెడితే వచ్చిన డబ్బుల్లో సగం పరిపాలకులకు వెళ్తుంది. అందుకని నిత్యపూజ ధర్మ హుండి పెట్టాము. అది సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే తెరుస్తాము. మొత్తంగా ముప్పై నలభై వేలదాకా ఉండేది. అప్పుడు పూల వారికి, సరుకులు ఇచ్చే వారికి డబ్బులు చెల్లించేవాళ్ళం. వారు కూడా ఎప్పుడూ సహనంతో సంవత్సరంపాటు వేచి ఉండేవారు. ఒకసారి నేను పరమాచార్య స్వామి వద్దకు వెళ్లి “మనకు నిధులు చాలా తక్కువ ఉన్నాయి. ప్రవేశ రుసుము పెడదామా?” అని అడిగాను. ఈ ఆలోచన స్వామివారికి కోపం తెప్పించింది.

సర్వసంగ పరిత్యాగులై ధనాన్ని తాకని సన్యాసులు ఎవరైనా అమ్మవారి దర్శనానికి వస్తే, వారు ఏం చెయ్యాలి? అయినా దేవీ దర్శనానికి ప్రవేశ రుసుమా? ఇది ఎక్కడి న్యాయం? ఇది సరైన పని కాదు. ఖచ్చితంగా ప్రవేశ రుసుము తీసుకోవడానికి వీలు లేదు!”

ఈ విషయంలో పరమాచార్య స్వామివారు చాలా ఖచ్చితంగా ఉన్నారు.
లలితా సహస్రనామాల కాసులతో చేయించిన బంగారు హారం ఉన్నది అమ్మవారికి. పరమాచార్య స్వామివారే దాన్ని తయారుచేయించి సమర్పించారు. ఎలాగో తెలుసా? ప్రతి ఒక్కరిని వారే అడిగి తయారుచేయించారు.

“జానకిరామా! ఆ కాసుమాల చాలా బరువుగా ఉంటుంది. అది కామాక్షికి చాలా బరువుగా ఉంటుంది కాబట్టి అమ్మవారికి ఇబ్బంది ఉంటుంది. కనుక వెనుక ఉన్న ప్రభావళికి కొక్కాలు చేయించి దానికి తగిలించు”. మనకు స్థూలంగా ఒక శిలగా కనిపించే అమ్మవారి విగ్రహం గురించి ఇంత ఆర్ద్రత కేవలం పరమాచార్య స్వామికే ఉంది. అయినా వారికి అక్కడ కనిపించేది విగ్రహం కాదు, సాకార రూపంలో ఉన్న సాక్షాత్ అమ్మవారే కదా!

చిన్న కాంచీపురంలోని అనైకట్టి వీధిలో పరమాచార్య స్వామివారికి కనకాభిషేకం జరిగింది. ఆ బంగారాన్ని కామాక్షి అమ్మవారికి ఆది శంకరాచార్యుల దివ్యపాదుకలకి స్వర్ణ కవచాలు చేయడానికి వినియోగించాలని ఆదేశించారు. మామూలుగా విగ్రహాలకి స్వర్ణ కవచాలు చేసేటప్పుడు, వాటిని రాగితో తయారుచేయించి దానిపై పలుచని బంగారు పూత వేస్తారు. అవి బంగారు కాంతులీనుతూ భక్తులకు ఆనందాన్ని కలుగజేస్తాయి. కాని స్వామివారు ఏం చేయ్యమన్నారో తెలుసా?

“జానకిరామా! బంగారం భవత్పాదుల పాదాలను తాకాలి. కనుక లోపలివైపు కూడా బంగారు పూత వేసేటట్లుగా జాగ్రత్త వహించు” అని అన్నారు. అదీ ఆచార్యులపై వారి గురుభక్తి. వారి ఆదేశానుసారమే కామాక్షి అమ్మవారి ఆలయంలో ఉన్న ఆదిశంకరులకు ఇరువైపులా బంగారు పూతతో స్వర్ణ పాదకవచాలు చేయించడం జరిగింది.

1953లో శ్రీమఠంలో ఉన్న ఒక రాగి శాసనాన్ని పరమాచార్య స్వామివారు చదవడం జరిగింది. కామాక్షి అమ్మవారి పైన ఉన్న విమాన గోపురం బంగారు పూతతో ఉండేదని, శ్రీమఠం ప్రవేశంలో త్రాగునీటి సదుపాయం ఉండేదని దాని సారాంశం. వెంటనే శ్రీమఠం ప్రవేశ ద్వారం వద్ద త్రాగునీటి సౌకర్యం ఏర్పాటు చేశారు. భక్తులకు నీరు ఇవ్వడం కోసం ఒక ముసలామెకు నేలకు పదిహేను రూపాయలు, రోజుకు కొద్ది బియ్యము ఇచ్చునట్లుగా ఏర్పాటు చేశారు. శ్రీవారి ఆదేశానుసారం పెద్దస్వామివారు (శ్రీ శ్రీ జయేంద్ర సరస్వతి స్వామి) కామాక్షి అమ్మవారి విమాన గోపురాన్ని బంగారుమయం చేశారు.✍️```
*అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం।*
*శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం॥*
```
#KanchiParamacharyaVaibhavam # “కంచిపరమాచార్యవైభవం”🙏
.     సర్వం శ్రీకృష్ణార్పణమస్తు

No comments:

Post a Comment