Sunday, July 20, 2025

 *_మా బడికి (హైస్కూలు) నేను రాసిన ఉత్తరం_* 

_వాశిలి హైస్కూల్లో నేను పనిచేస్తున్నప్పుడు [2009 - 2018 వరకు] 10వ తరగతి చదువుతున్న నా స్టూడెంట్ *--Sk. Myfeeja* _(తాను Sr. Inter లో ఉన్నట్టు ఊహించుకుని రాసినది)_
*=======((🙏))=======*

*నన్ను క్షమించు. నేను జీవితంలో ఎదుగుతూ నిన్ను మరచిపోయాను.  నేను నీదగ్గర నుండే ఎదిగానని తెలుసు, నీవు రాసిన ఉత్తరం చూశాక... ఒకప్పటి అనుభవాలు నా మదిలో తలపించాయి. అమ్మ ఒడిలో పిల్లలకు రక్షణ దొరుకుతుంది. అలాంటి రక్షణ నీ ఒడిలోనూ మాకు దొరుకుతుంది. నన్ను నువ్వు గుర్తుపట్టావా? నీ ఒడిలోకి నేను 6వ తరగతిలో  మొదటిసారి వచ్చినపుడు ప్రాణ స్నేహితులను దగ్గరకు చేర్చావు. ఇంట్లోంచి అమ్మ కొట్టిందని మేము ఏడుస్తూవస్తే నవ్విస్తావు. జ్ఞానం లేని వారు నీ ఒడిలోకి వస్తే... విజ్ఞానంతో నింపి బయటికి పంపుతావు. మేము నీ మిద్దె పైకెక్కి ఎగురుతుంటే నువ్వు ఎంత బాధపడ్డావో! అయినా సహించావు. నీమీద మేము దూకుతూ, గెంతుతూ ఎంత హాయిగా ఆడుకునే వాళ్ళమో! అన్నింటి కన్నా ఈ లోకంలో గొప్పది అమ్మ అంటారు. అలాంటి అమ్మనే మరపించే గొప్పది బడి. నీ  ఒడిలో వచ్చి పడిపోయినపుడు నన్ను ఓదార్చావు.  _అడిగితేనే అమ్మ అన్నం పెడుతుంది,_ కానీ మేము అడగకపోయినా నువ్వే అడిగి అన్నం పెడతావు.*

*నువ్వు మాకు అన్నం, బట్టలు, చదువు మొత్తం ఇస్తావు. ఒక పేదవాడికి కావలసింది ఏముంది! అమ్మ, నాన్న లాంటి గురువులను ఇస్తావు. ఒక అనాథకి ఇంతకన్నా కావలసింది ఇంక ఏముంది! నీ ఒడిలోకి రావడమే... ఒక స్వర్గంలోకి వచ్చినట్టు ఉంటుంది. నీ కన్నా మాకు ఆప్తులు ఎవరూ లేరు. కానీ, నీకు ఎవరున్నారు. మేము జీవితంలో అన్నింటా ఎదుగుతూ ఉండాలని ప్రతీ సంవత్సరం సరస్వతీ పూజ చేపిస్తావు.* *నాయకులకు, మేథావులకు ఆదర్శం నువ్వే. దేశ అభివృద్ధికి కారణం నువ్వే. నీ ఒడిలో కులమత భేద భావం లేకుండా కలిసిమెలిసి ఉంటాము, కలిసి పండుగలు జరుపుకుంటాము. మనం గుడికి వెళితే దేవుడినే చూస్తాం. ఆయననే ప్రాధాన్యంగా చూస్తాం. కానీ, ఇక్కడ మాకు నువ్వే ఒక దేవుడివి. మన మా ఆర్ధిక పరిస్థితి వల్ల మేము కనీస పౌష్టిక ఆహారం కూడా తినలేము. కానీ నువ్వు కమ్మగా వండి పెడతావు. మేము తినలేని ఆహారాన్ని కూడా అందిస్తావు. మా మంచి, చెడూ అన్నీ నీవే చూసుకొంటావు. నీ ఒడి లోకి వస్తే... ప్రేమ, అనురాగం, అప్యాయతా, బంధాలు... అన్నింటితో కట్టి పడేస్తావు. నిన్ను వదిలి వెళుతుంటే కళ్లు చెమ్మగిల్లుతాయి. మొదట మేము అమాయకులుగా నీ లోపలికి  వస్తాము. మాకు అన్నీ నేర్పించి, ప్రయోజకులుగా తీర్చిదిద్ది బయటకు పంపుతావు. నిన్ను వదిలి వెళ్ళుతుంటే.... నిన్ను వదిలి మేము ఎలా ఉండగలము.. అనిపిస్తుంది!  అయినా, బయట ప్రపంచాన్ని ఎదుర్కొనేలా ధైర్యం చెప్పి బయటకు పంపుతావు. నిన్ను వీడి ఎన్ని  సంవత్సరాల తరువాత తిరిగి వచ్చినా అదే అప్యాయత చూపిస్తావు. మేము చూడలేని ప్రాంతాలన్నీ నీ ద్వారానే అన్నీ చూస్తాము._* 

*_"అసలు 'బడి' అంటే నా దృష్టిలో అదొక పదం కాదు.. ఒక గుడి కూడా కాదు.. బడి అంటే  సమాజంలోని చెడును తొలగించడానికి ఉపయోగపడే ఆయుధాలను తయారుచేసే పరిశ్రమ."_*

*ఇక్కడ నుండి వచ్చిన విద్యావంతులైన పౌరులు అనే ఆయుధాలు దేశంలోనేకాదు.. ఈ లోకంలో ఉన్న చెడునంతా తుడవగలవు. అలాంటి _నీ ఒడిలో_ 5 సంవత్సరాలు ఉన్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. నా తప్పటడుగులను సరిదిద్ది నందుకు నీకు ధన్యవాదాలు. ఆరో తరగతి నుండి పదో తరగతి వరకూ... 5 ఏళ్ళ పాటు నా మంచి, చెడులు చూసుకున్నావుకదా! ఇప్పుడు నీ మంచి, చెడూ నేను చూసుకుంటాను. నీకు ప్రాణం లేదు అని అనుకొంటారు కొందరు. అసలు వాళ్ళకే జ్ఞానం లేదని అనుకోరు మరి. నేను ఎవరో ఇప్పుడైనా గుర్తుపట్టావా?*

 *ఇట్లు...* 
 *ఒకప్పుడు నీ ఒడిలో చదివి ఎదిగిన విద్యార్థినినే...* 

_-Shaik Myfeeja_
 _10th class_
 *(2014-15)*
 _ZPHS Vasili._ 
*~~~~{🌹🙏🌹}~~~~*
*_{ఇది నేను వాశిలి హైస్కూల్లో పనిచేస్తున్నప్పుడు విద్యార్థులను ప్రోత్సహించి ఇలాంటి అనేక అంశాలపై స్వీయ ఆలోచనలతో రాయించిన వాటిలో ఇదొకటి. మీ స్పందన, మీ ఆశీస్సులు ఆ విద్యార్థినికి తెలపాలని నా విన్నపం. ఇవి నచ్చితే మీరూ మీ పిల్లలతో ఇలాంటివి రాయించండి.... : --వెలిశెట్టి నారాయణరావు}_*

No comments:

Post a Comment