Sunday, July 20, 2025

 *హిందూ ధర్మం - 4*
----------------- 

*వేదం - 4*

వేదమంటే ఒక గ్రంధం కాదు, వేదమంటే విశ్వరహస్యాలు, విశ్వనియమాలు, తత్వాలు, ధర్మాల సమాహరం. 

వేదం సనాతనమైన జ్ఞానం. 

అంటే ఒకప్పుడు ఉండి, ఆ తర్వాత పోయేదికాదు. ఎప్పటికి ఉండేది అని. వేదం ఒకప్పుడు పుట్టింది అని చెప్పలేము, ఒక సమయం తర్వాత నశిస్తుందని కూడా చెప్పలేము. 

ఒక ఉదాహరణ చెప్పాలంటే గురుత్వాకర్షణ సిద్ధాంతమే (Law of Gravitation) తీసుకోండి. దాన్ని మొదట భారతీయులే చెప్పారు. కానీ ఆ విషయం కాసేపు పక్కనపెడదాం. 

న్యూటన్ ప్రపంచంలో గురుత్వాకర్షణ సిద్ధాంతం గురించి చెప్పిన మొదటివాడు అనుకుందాం. ఆయన గురుత్వాకర్షణ సిద్దాంతం చెప్పకముందు కూడా ఆ సిద్ధాంతం అలాగే ఉంది. 

ఒకవేళ ప్రపంచమంతా ఆ సిద్దాంతం మర్చిపోయినా కూడా ఆ సిద్దాంతం అట్లాగే ఉంటుంది. 

ఏదో న్యూటన్ చెప్పకముందు ఈ భూమిపై జీవరాశి గాలిలో తేలుతూ ఉందా? 

ఆయన చెప్పగానే ఒక్కసారే భూమి యొక్క అయస్కాంత ఆకర్షణకులోనై జనం అందరు నేలపై పడ్డారా? 

లేదు కదా. 

అప్పటివరకు అలా ఎవరు ఆలోచించలేదు, న్యూటన్ ప్రతిపాదించాడు, ఒక కొత్త విషయం తెలిసింది. కానీ అంతకముందు కూడా గురుత్వాకర్షణ ఉన్నట్లే వేదం కూడా ఉంది. 

అలాగే మొదట భారతీయులు తప్ప ప్రపంచమంతా సూర్యుడే భూమి చుట్టూ తిరుగుతాడని నమ్మింది, కానీ కాసేపు మనకూ, వాళ్ళు చెప్పేవరకు తెలియదనుకుందాం. 

ప్రపంచమంతా భూకేంద్రక సిద్ధాంతం (Geo-centric theory) నమ్మిందని సూర్యుడు నిజంగా భూమి చుట్టు తిరిగాడా? 

తర్వాత అది తప్పని తెలుసుకున్నాక, భూమి తిరగడం మొదలుపెట్టిందా? 

సూర్యుడి చుట్టూ భూమి, నక్షత్రాలు విశ్వారంభం నుంచి తిరుగుతూనే ఉన్నాయి. విశ్వమంతా సూర్యుడిలో కలిసి అంతమయ్యేవారకు తిరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే అది ప్రకృతి యొక్క ధర్మం, తత్వం, యధార్ధం కూడా. 

వేదం కూడా అటువంటిదే. ప్రాకృతిక సత్యాలు, నియమాల జ్ఞానమే వేదం. వేదం ఋషులకు తెలియబడకముందు ఉంది, మానవజాతి మర్చిపోయినా ఉంటుంది. ఒకవేళ ప్రళయం వచ్చి మొత్తం సృష్టి అంతమైనా వేదం నిలిచి ఉంటుంది, మళ్ళీ పునఃసృష్టి కూడా వేదం ఆధారంగానే జరుగుతుంది. 

అంటే వేదం సృష్టికి కూడా అతీతమైనది. దానికి దేశకాలాలతో సంబంధం లేదు. ప్రళయ సమయంలో అది పరమాత్మలో ఉంటుంది. అందుకే వేదం సనాతమైనది అన్నారు భారతీయులు.

చికాగో సర్వమత సభలో కూడా స్వామి వివేకానందులు వేదాల గురించి ఇలా చెప్పారు. 

*'తత్వావిష్కరణ మూలంగా - వేదాలమూలంగా - హిందువులు తమ ధర్మాన్ని పొందారు. వేదాలు ఆద్యంతరహితాలని విశ్వసిస్తారు. ఒక గ్రంధం ఎలా ఆద్యంతరహితమై ఉండగలదని ఈ సభాసదులు ఎంచవచ్చు. అది మీకు హాస్యాస్పదంగా తోచవచ్చు. కాని వేదాలనటంలో ఏ గ్రంధాలు సూచితాలు కావు. వేదాలంటే విభిన్న వ్యక్తులచే విభిన్న సమయాల్లో కనుగొనబడిన ఆధ్యాత్మిక నియమనిక్షేపని అభిప్రాయం. గురుత్వాకర్షణ నియమం, అది కనుగొనబడటానికి ముందు ఉండినట్లే, అంతేగాకా మానవాళి అంతా దాన్ని మరచినా ఆ నియమం ఉండేరీతినే, అధ్యాత్మిక ప్రపంచాన్ని పరిపాలించే నియమాలు శాశ్వతంగా ఉంటాయి. ఒక జీవికీ, మరొక జీవాత్మకు పరమాత్మకు విన్న నైతిక, ఆధ్యాత్మిక సంబంధబాంధవ్యాలు లోకంచే కనుగొనబడటానికి పూర్వమూ ఉన్నవే, మనం వాటిని మరిచినా అవి నిలిచే ఉంటాయి. ఈ తత్వాలను కనుగొన్నవారు ఋషులనబడతారు'*. 

(ఇంకా ఉంది)

No comments:

Post a Comment