*బుల్లి కథలు!!*
ఇవిగో పది అద్భుతమైన బుల్లి కథలు..పరిమాణం తక్కువ..సారం ఎక్కువ..
నాలుగంటే నాలుగు ముక్కల్లో అర్థవంతమైన కథలు..బాధలు!
1)ఆ రోజు నుంచి
మళ్లీ బడులు మొదలుకానున్నాయి..
ఆమె చాలా ఆసక్తిగా ఎదురుచూస్తోంది..బడికి తను వెళ్ళడానికో లేక పిల్లల్ని పంపడానికో కాదు..ఆరోజు నుంచి నోటు పుస్తకాలు,
పెన్సిళ్లు..ఠావు కాగితాలు అమ్ముకుంటే మళ్లీ ఇల్లు గడుస్తుందని..!
2)అతను ఓ పేరొందిన ఆర్టిస్ట్..తనలా తన కొడుకు కూడా పెద్ద ఆర్టిస్ట్ కావాలని కలలు కంటుంటేవాడు.
కనీసం ఓ గీత కూడా వంకరలు లేకుండా తిన్నగా గియ్యడం లేదని ఎన్నిసార్లు కసురుకున్నాడో..
పెద్దయ్యాక అదే కొడుకు
పెద్ద డాక్టర్ అయిన తర్వాత తను అతగాడి ఆస్పత్రిలో గుండె సమస్యతో చేరాక కొడుకే ఈసీజీ తీస్తుంటే ఈసీజీ లో మాత్రం వంకర టింకర గీతలు వచ్చేట్టు చెయ్యరా అని మనసులోనే కోరుకున్నాడు...
బయటికి అనలేకపోయాడు.
ఎందుకంటే అప్పటికే ఆ తండ్రి
కోమాలో ఉన్నాడు..!
3) టూ వీలర్ మీద
మామూలు జనం
వెళ్లే దారిలో వెళ్తే
నా ప్రత్యేకత ఏముంది.
భిన్నంగా వెళ్తేనే కదా గుర్తింపు అనుకున్నాడో ప్రబుద్ధుడు..
అలా వెళ్తుంటే అడ్డగించిన వ్యక్తికి అందుకు గల కారణాన్ని వివరించేలోగా అవతలి మనిషి అపరాధ రుసుం చలానా రాసిచ్చేసాడు..
ఎందుకంటే ఆపింది
ట్రాఫిక్ పోలీస్..!
4)ఆ దంపతుల అనుబంధం చిత్రమైనది.భర్త తన ఉదరంపై తన్నిన ప్రతిసారి ఆమెకు
అదోలాంటి సంబరం.
అలా తన్నిన కొద్ది ఆమెకు పతిదేవుడిపై ప్రేమ ఇనుమడించేది.అలా భర్త
తన కడుపులో పెరుగుతున్న అతగాడి వంశాంకురాన్నే తంతున్నానని తెలుసుకునే రోజు కోసం ఆత్రంగా ఎదురుచూస్తూ తన్నులు తింటూనే ఉంది.
5)నా బొమ్మలన్నీ నీవే..
పట్టరాని సంతోషం కలగించాల్సిన ఆ నాలుగు ముక్కలూ ఆ చెల్లి కళ్ళల్లో ఆగని కన్నీటికి కారణమయ్యాయి..
ఎందుకంటే
అలా అని తన అన్న ఆత్మహత్య లేఖలో రాశాడు..
6)తండ్రిని తీసుకువెళ్ళి పోయిన సహచర జవానులు జెండాని మాత్రం తిరిగి ఇచ్చారు.అప్పుడు తెలిసింది ఆ చిన్నారికి.. సైనికుడైన
తన తండ్రి ఇక తిరిగి రాడని..సహచరులు తీసుకువెళ్ళింది ఆయన మృతదేహాన్నని..!
7)ఇరవై అయిదేళ్ళ వయసులో ఒక బిడ్డకు తల్లినయ్యాను.
27 సంవత్సరాలప్పుడు
మరో బిడ్డకు అమ్మయ్యా.
55 ఏళ్ల వయసులో మళ్లీ అమ్మనయ్యాను..
నా కొడుకు పెళ్లి చేసుకుని కోడల్ని ఇంటికి తెచ్చాడు..
అందరు తల్లులూ ఇలాగే అనుకుంటే గృహమే కదా స్వర్గసీమ..!
8)ఒక సంపన్నుల ఇంట మగపిల్లాడు పుట్టాడు.
చూడ్డానికి వచ్చిన అమ్మలక్కలు పిల్లవాడు
ఎంత అదృష్టవంతుడో అనుకున్నారు.
అప్పటికే ఆ తల్లిదండ్రులు
అబార్షన్ల ద్వారా
ఈ భూమ్మీదకు రాకుండా గొంతు నొక్కేసిన ఇద్దరు
ఆడ శిశువులూ దివి నుంచి నోట్లో గుడ్డలు కుక్కుకుని మరీ మౌనంగా రోదించారు.
9)పురిటి మంచంపై పక్కనే ఉన్న ఆడపిల్లని చూసి
ఆ బాలింత ఇలా వాపోయింది..
నీ వల్ల నా కెరీర్ నాశనమైపోయిందని..
లేదంటే ఈపాటికి
పెద్ద కార్పొరేట్ సంస్థకు సీఈఓ అయ్యేదాన్నని..
ఇంతలో ఆ పసికందు అప్రయత్నంగా అమ్మ వేలు పట్టుకుంది..అంతే..
ఆమె అంతవరకు అనుకున్న మాటలు మరచి బిడ్డను మురిపెంగా పొత్తిళ్ళలోకి
తీసుకుంది..అంతకు కొంచెం ముందు బిడ్డ పుడితే
ఆ క్షణంలో అక్కడో
అమ్మ పుట్టింది..
10)ఓ పిల్లాడు సముద్రం ఒడ్డున నిల్చుని తన కాళ్ళను పదే పదే తడుపుతున్న అలలను తిట్టుకుంటున్నాడు.
"నా కాళ్ళు ఇలాగే
వెయ్యిసార్లు తడిపినా
మా అమ్మానాన్నలను
మొన్ననే మీలో కలిపేసుకున్న పాపానికి ఈ జన్మలో మిమ్మల్ని
క్షమించేది లేదని..!"
*ఎలిశెట్టి సురేష్ కుమార్*
9948546286
9030296286
No comments:
Post a Comment