Saturday, July 19, 2025

 *తూగోజివారి స్పెషాల్టీ పచ్చావకాయ* 
     **********
    కాకినాడలోని కాశీభొట్లవారి  పెళ్ళియిల్లది.రాత్రే కాశీభొట్లవారమ్మాయిని, కర్నాటకలోని బళ్ళారి నుండి తరలివచ్చిన పేరివారబ్బాయికి ఇచ్చి పెళ్ళిచేసారు. ఈరోజు మధ్యాహ్నం పెళ్ళిభోజానాలైన తరువాత పెళ్ళికూతురుని తీసుకొని పెళ్ళివారు బయలువారి ఊరికి బయలుదేరతారు.

ఈరోజు మధ్యాహ్నభోజనాలలో నిన్నరాత్రి భోజనాలలో వడ్డించినన్ని ఆధరువులు లేవుకానీ, ఈరోజు భోజనంలో స్పెషల్ పచ్చళ్ళతోపాటు పచ్చావకాయవడ్డించారు. ప్రత్యేకంగా పెళ్ళికూతురు తల్లి భోజనపంక్తుల దగ్గరకు వచ్చి, "పచ్చావకాయ మా జిల్లాల స్పెషల్ .కలుపుకొని చూడండి వదినగారూ!" అంటూ పెళ్ళివారిని ఒక్కొక్కరినీ దగ్గరుండి తెల్లటి నెల్లూరి మొలకబియ్యంతో వండిన అన్నంలో, పచ్చటి ఆవకాయను కలిపించి, నిమ్మకాయకంటే పెద్దసైజు తెల్లటి, కమ్మటి తాజా వెన్నముద్దను స్వయంగా అందరికీ వడ్డించి,"పచ్చావకాయముద్ద నోట్లో పెట్టుకొని, వెన్నముద్దను నాలిక్కిరాసుకొని చూడండి మీ అంగిట్లోకి స్వర్గందిగివస్తుందంటూ ఊరించింది.

ఆమె మాటలకు ఆకుచివరనున్న పచ్చావకాయ ముందుకులాగి, సూదిమొలకలులా తెల్లగా మెరిసిపోతున్న అన్నంలో ఆవకాయ కలపగానే, పసుపుపచ్చగా మారిన అన్నంలో గానుగనూనెను ఒకతడు వడ్డించగా, గుండ్రాయంతముద్దలు చేసుకొని, నోటపెట్టుకొని, చిటికెడు వెన్నముద్ద నాలిక్కి రాసుకోగానే, లట్ లట్ మని భోజనంపంక్తులలోంచి లొట్టలు వినిపించసాగాయి.

     "ఆహా ఏమిరుచి,అననా మైమరచి!వదినగారూ! గతరెండుపూటలభోజనంలోనూఈ పచ్చావకాయ మాకు రుచిచూపించనందుకు మీకు పనిష్మెంటుగా, 
మీ పచ్చావకాయజాడీలని మాకారులో పెట్టించండి.మీ పిల్లకు మీరు వేరే సారీ గీరీ, మంచాలూ, కుంచాలూ ఏమీపెట్టొద్దు." అంటూ, అప్పటివరకూ బెట్టుబెట్టుగా మాట్లాడిన వియ్యపురాలు, అలా బెట్టువిడిచి మాట్లాడేసరికి, పెళ్ళికూతురు తల్లికి ప్రాణంలేచివచ్చినట్లైయ్యింది.
  "అలాగే వదినగారూ! అదేమంతభాగ్యం ! అలాగే పెట్టిస్తాను. పచ్చకారం, కొత్తపల్లికొబ్బరి మామిడికాయలు దొరికితే, పచ్చావకాయపెట్టి కొరియర్ లో మికుపంపిస్తానండీ!" సతోషంగా చెప్పింది పెళ్ళికూతురుతల్లి.

     "ఆంటీ! ఈ పచ్చావకాయను మా అత్తారింట్లో, మావాళ్ళందరికీ పరిచయంచేస్తాను, ఇదిపెట్టడానికి పాళ్ళేంటో చెప్పండాంటీ. "పెళ్ళికొడుకప్పగారిననే బింకంవదిలిపెట్టి అడగడంచూస్తే పెళ్ళికూతురు తల్లికి ముచ్చటెసింది. భోజనంచేసి చెయ్యికడుక్కొన్నతరువాత, సెల్లుఓపెన్ చేసింది ఆవకాయపాళ్ళు నోట్ చేసుకోవడానికి
ఆడంగులందరూ సెల్లులలో స్వరచక్ర తెలుగుతో తయారుచెేసుకొన్న తమతమ వాట్సప్ లోని తెలుగు గ్రూపులను తెరిచారు.

     "పచ్చావకాయపాళ్ళు చెప్పండత్తయ్యగారూ!"అని పెళ్ళికొడుకు అప్పగారడగగానే, పెళ్ళికూతురు తల్లి చెప్పడంప్రారంభించింది.

       "పావుకేజీ పచ్చకారం తీసుకొన్నామనుకోండి, పావుకేజీ కొట్టిన గుల్లఉప్పుగుండ, అరకేజీ సన్నావాలపొడి. అదేమేము మాడుగుల ఆవాలంటాం .
అవైతేనే మంచి ఘాటుగా వుంటుందావకాయ. మరి మీకు అవిదొరక్కపోతే మామూలావాలపొడినే అరకేజీపొడిని తీసుకొని బాగా మూడుగుండలూ కలుపుకోండి. ఇక నేనైతే, కొత్తపల్లికొబ్బరి మామిడికాయలను ఒక పదో, పన్నిండో కొని శుభ్రంచేసుకొని ముక్కలు కొట్టించుకొని, మా సామర్లకోట అంబటి సుబ్బయ్యగారి శ్రేష్టమైన నువ్వుల గానుగనూననెను ముప్పావుకేజీకానీ, ఊటబాగా కావాలంటే  కెేజీకానీ కొని, మూడుగుండలూ కలిపినదాట్లో మమామిడికాయ ముక్కలు మూడుగుండలూ కలిపినది ఒక గిన్నెడైతే, మామిడికాయముక్కలు రెండుగిన్నెలు కలిపి తడీపొడిగా నూనేపోసి, బాగా కలిపి జాడీకి ఎత్తుతాను. మర్నాడు దాన్నలా వదిలేసి, ముడోనాడు బాగా పైకీ క్రిదంకూ కలిపి మిగిలిననూనెనుకూడా పోసి బాగాకలిపి మూతపెడతాను.

 ఇష్టమైతే వెల్లుపాయలుకూడా బాగావలచి ఒకపావుకేజీదాకా కలుపుకోవచ్చు. మాఅత్తగారైతే, వెల్లుల్లిరెబ్బలను ఎనిమిదో పదో, దారంతో దండలుగా గుచ్చి ఆవకాయలోవేసేవారు, ఆవకాయలో వెల్లుపాయలకోసం వెతుకులాటలేకుండా. అన్నట్టు చెప్పడం మరచిపోయాను గుప్పెడుకొత్త మెంతులుకూడా ఆవకాయలో  కలిపితే, ఘుమఘుమలు ఆడుతూవుంటుంది, చలవచేస్తుందికూడాను. 


నేనైతే కొంచం పచ్చావకాయను విడిగాతీసి, దాట్లో పులిహోరపోపులో ఇంగువముద్ద, కొంచంవేసి... దానితోపాటు జీడిపప్పులు, వేరుశనగ గింజలూ కూడా కలుపుతాను. వేడివేడి అన్నంలో కలుపుకొంటే, అచ్చంగా పులిహోర తిన్నట్లుగానే వుంటుంది. కరివేపాకు పోపులో మరికాస్తవేసామంటే మరీ ఘుమఘుమలాడుతూవుంటుంది పచ్చావకాయ.    అలాగే పిల్లలు ఇష్టంగా తింటారని కొంచం పచ్చావకాయలో బెల్లంపాకంపట్టిపోస్తాను. పిల్లలు టిఫెన్లలో నంచుకోసం జాములూ గీములూ అడగకుండా ఇష్టంగా బెల్లపావకాయనంచుకొని తింటారు."పెళ్ళికూతురుతల్లి చెప్పడంముగించింది.

   ఒకవేళ పచ్చకారం కనుక మీప్రాంతంలో దొరకకపోతే, ఆవకాయలసీజను మొదలవ్వకుండానే ఎవరెవరికి ఎంతెంతకావాలో మాకు ఫోన్ చేసి చెపితే, మేము కొరియర్ లో మీ మీ అడ్రస్ లకు పచ్చకారంపంపిస్తామని ఆమె భరోసా ఇవ్వగానే, బంధువులందరూ, ఆడపెళ్ళివారు ఏడువారాలనగలెట్టినంతగా వాళ్ళమొఖాలు సంతోషంతో వెలిగిపోయాయి. మగపెళ్ళివారిని సంతోషపడడమే కదా  ఆడపెళ్ళివారికి కావలసినది.

 *తూగోజి పచ్చావకాయ* *జిందాబాద్  !*

No comments:

Post a Comment