Sunday, July 20, 2025

 ఇంతలా వర్షాలు, పైగా పిడుగులు ఉరుములు, చీకటి పడిపోయినట్టున్న వాతావరణం, నల్లటి మబ్బులతో పాటుగా ఎన్నో తీయని ఙ్ఞాపకాలు... 

ఈరోజు వర్షం వస్తే బయటికి వెళ్ళం రోడ్డు మీద నీళ్ళు నిలిచిపోతాయని 
ఈరోజు వర్షం వస్తే బజ్జీలు వేడిగా వేయించుకుని తింటాం ఆత్మారాముడిని శాంతింపజేయడానికి 
ఈరోజు వర్షం వస్తే ఒకవేళ బయటికి వెళ్ళినా కేబ్ బుక్ చేసుకుంటాం
బట్టలు వాషింగ్ మెషీన్ లో టంబుల్ డ్రై పెట్టి ఆరబెట్టుకుంటాం 
బయట ఎంత చల్లగా ఉన్నా ఇంట్లో ఏ సీ వేసుకుని నిద్రపోతాం

ఆశ్చర్యం వేస్తుంది... 

ఎల్లప్పుడూ ఒకేలా ఉండవు కదా రోజులు 
చిన్నప్పుడు వర్షం వస్తుంది అంటే భలే సంబరం తడిస్తే తప్ప ఇంట్లోకి రాకూడదు అని 
కావాలని గొడుకు రెయిన్ కోటు మర్చిపోయి వెళ్ళిపోవడం 
గొడుగు ఉన్నా తడిసే ఇంటికి రావడం 
పుస్తకాలకి పాలిథిన్ కవర్లు తొడగడం 
ఇవన్నీ ఒకెత్తు అయితే 

అసలు ఇంట్లో ఎలా ఉండే వాళ్లమా అనిపిస్తుంది 
పెంకుటింటికి ఏడాదికి ఒకసారి ఈ వర్షాకాలం ముందు పెంకులు అన్నీ సరిచేయించి, విరిగిన పెంకులు తీసి కొత్తవి పెట్టించడం, ఉన్న పెంకుల పగుళ్ళలో సిమెంటు పెట్టించడం చేసేవారు. 
ఆ అదృష్టం అందరికీ దక్కేది కాదు. అద్దెకు ఉన్న దిగువ మధ్య తరగతి, మధ్యమ మధ్య తరగతి జనాలు అయితే అసలు చెప్పనే అక్కర్లేదు. 

మా పెంకుటిల్లు చూరు, వసారాలో కూడా చిన్నపాటి వర్షానికే పెంకుల మధ్య నుంచి బొట్టు బొట్టుగా మొదలై ధారలుగా వర్షం ఇంటిలో కారేది. గదిలో ఉన్న సామాన్లు, మంచం, బట్టలు లాంటివి వాటికి అణుగుణంగా అటూ ఇటూ కదుపుకుని దుప్పటీలు, ఆ కారుతున్న వర్షం చుక్కలు పట్టడానికి గిన్నెలు బకెట్లు లాంటివి సరిగ్గా అందులోనే పడేలా అక్కడ పెట్టి, మధ్య పొడి భాగంలో కూర్చుని ఉండేవాళ్ళం. అయినా జీవితం భారం అనిపించేది కాదు బహుశా పిల్లలం కావడం వల్లనేమో. 

ఇప్పుడు ఇంట్లోకి చిన్న చిన్న పురుగులు, దోమలు, బొద్దింకలు వస్తేనే నానా హంగామా చేస్తూ వేలకు వేలు పెట్టి పురుగు మందు, చెదల మందులు కొట్టిస్తున్నాం. అప్పట్లో వర్షంలో తేళ్ళు, జెర్రిలు, కొన్ని చోట్ల అయితే పాములు కూడా ఇళ్ళల్లోకి వచ్చేసేవి. అలాగే చీకటిలో వర్షం పడినా పెరట్లో ఉన్న బాత్రూంకి హరికేన్ లాంతరు పట్టుకుని వెళ్ళేవాళ్ళం గొడుగు కింద తడవకుండా నడుస్తూ. పైగా మీట తిప్పితే నీళ్ళొచ్చే కుళాయిలు ఎక్కడ? 

నూతి నీళ్ళు అప్పటికప్పుడు తోడుకుని తీసుకుని వెళ్ళేవారు. భలే సరదాగా ఉండే మరో విషయం ఏంటంటే గోదావరి జిల్లాల్లో పుష్కలంగా నీళ్ళు. నీటి కొరత తెలియని చోటు. వర్షాలు బాగా పడే సమయాలలో అయితే చెంబుతో బింది లోంచో గంగాళంలోంచో ముంచుకునేలా నీళ్ళు పైకి వచ్చేసి ఉండేవి. అలా ముంచుకుని తెచ్చుకోవాలనే సరదాలో పరుగులు, ఆ నాచు కట్టేసిన నూతి చప్టాలమీద ఎక్కడ కాలు జారి పిల్లలు నూతిలో పడిపోతారో అనే భయంతో పెద్దవాళ్ళు, అదో ప్రహసనం... 

ఇంతలా అడుగడుగునా ప్రమాదాలు పొంచిఉన్నా బ్రతుకులు దుర్బరం అని మాత్రం ఎప్పుడూ అనిపించేది కాదు. ఉన్నదానిలో గుట్టుగా నడుపుకునే సంసారాలు, సాయంత్రానికి హాయిగా గూటికి చేరిన గువ్వలలా ఇంట్లో అందరూ చేరి కబుర్లు చెప్పుకుంటూ రాత్రి భోజనాలు, బడికి వెళ్ళను అని మారాలు, మాష్టార్ల ఆరాలు, గొడవ పడినా గడప దాటని ఇల్లాళ్ళు, అల్లరి చేసేటప్పుడు కూడా నాన్న కోప్పడతారేమో అనే భయంతో పిల్లలు... 

ఆ రోజులు ఆ జీవితాలు... ఈ నాటి ఏ ఆర్భాటాలు లేకపోయినా హాయిగా ఉండేవి 
ఇప్పుడేంటో ఎంత సంపాదించినా తనివి తీరని మనసులు 
ఎంత పని చేసినా ఎప్పుడూ ఏదో అసంతృప్తి 
అన్ని సౌకర్యాలూ ఉన్నా నిద్రలేమి 
కంచంలో పంచభక్ష్యాలు ఉన్నా తిని అరాయించుకోలేని ఆరోగ్యాలు 
కావాలన్నా కనిపించని అనురాగాలు అప్యాయతలూ 
పేరుకి మాత్రమే చుట్టరికాలు 
పెడదార్లు పడుతున్న కుర్రకారు....

No comments:

Post a Comment