Sunday, July 20, 2025

ధర్మస్థలంలో ఏం జరిగింది.?

 *ధర్మస్థలంలో ఏం జరిగింది.?* 

*కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో ఉన్న ధర్మస్థళ. ఇప్పటి వరకు ఇది మంజునాథుడి ఆలయం నుంచి ఆధ్యాత్మిక ప్రాంతంగానే సుపరిచితం. ఈ నెల 3న ఓ న్యాయవాదితో కలిసి అక్కడి పోలీసుస్టేషన్‌కు వచ్చిన వ్యక్తి చేసిన ఫిర్యాదు అందరినీ ఉలిక్కిపడేలా చేసింది.ధర్మశాల దేవాలయంలో పారిశుద్ధ్య కార్మికుడిగా పని చేసిన తాను దాదాపు 20 ఏళ్ల పాటు అనేక మృతదేహాలను పాతిపెట్టానని బాంబు పేల్చాడు. హతుల్లో మహిళలు, చిన్నారులు ఉన్నారని, కొందరిపై అత్యాచారం జరిగినట్లు, మరికొందరిపై యాసిడ్‌ దాడులకు సంబంధించిన గుర్తులు ఉన్నాయని అంతా ఉలిక్కిపడేలా చేశాడు. ప్రస్తుతం మానవహక్కుల, మహిళ సంఘాలు నిజాలు నిగ్గు తేల్చడానికి ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తున్నాయి.*

*ధర్మస్థళ కర్ణాటకలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటి. ఇక్కడి మంజునాథ స్వామి ఆలయం ఏళ్లుగా* *లక్షలాది మంది భక్తుల్ని ఆకర్షిస్తోంది. ఈ ఆలయాన్ని నడిపే ట్రస్ట్‌ కర్ణాటకలోని అత్యంత శక్తిమంతమైన హెగ్డే కుటుంబం నేతృత్వంలో పని చేస్తుంటుంది. అత్యంత సంప్రదాయకమైన ఈ కుటుంబం కేవలం దక్షిణ కన్నడ జిల్లాలోనే కాకుండా ఆ రాష్ట్రంలోనే సామాజిక, రాజకీయంగా శక్తిమంతమైంది. అలాంటి ధర్మస్థళ దేవాలయం సూపర్‌వైజర్లు, నిర్వాహకులపై మాజీ పారిశుద్ధ్య కార్మికుడు ఇచ్చిన ఫిర్యాదుతో ఇప్పుడు కేసు నమోదైంది. ఇందులోని నిజానిజాలు గుర్తించే పనిలో ధర్మస్థళ పోలీసులు ఉండగా... సుజాత భట్‌ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసు విభాగం మొత్తం అప్రమత్తమైంది. ఫిర్యాదుదారుడిగా ఉన్న మాజీ పారిశుద్ధ్య కార్మికుడు 'తాను దళితుడినని, 1995 నుంచి 2014 డిసెంబర్‌ దేవస్థానంలో పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేశానని' పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో అనేక కీలకాంశాలు పొందుపరిచాడు. అంతా ఉలిక్కిపడేలా చేసిన ఆ వివరాలివి...*

*"ఉద్యోగంలో చేరిన తొలినాళ్లల్లో ధర్మస్థళ ఆలయానికి సమీపంలో ఉన్న నేత్రావతి నది వద్ద విధులు నిర్వర్తించా. ఆ పరిసరాలను శుభ్రం చేసే డ్యూటీ నుంచి సూపర్‌వైజర్ల ఆదేశాల మేరకు హఠాత్తుగా హేయమైన, దారుణ నేరాలకు సంబంధించిన సాక్ష్యాధారాలను మాయం చేసే పని చేయాల్సి వచ్చింది. పురుషులతో పాటు మహిళలు, బాలికలు, చిన్నారుల మృతదేహాలను తీసుకువెళ్లి సమీపంలో ఉన్న అడవిలోని వివిధ ప్రాంతాల్లో పాతిపెట్టేలా సూపర్‌వైజర్లు ఆదేశించారు.*

*మొదట్లో ఇవన్నీ నేత్రావతి నదితో పాటు ధర్మస్థళ ప్రాంతానికి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదాలు, ఆత్మహత్యలకు సంబంధించినవి భావించా. అయితే కొన్నాళ్లకు ఆ మృతదేహాలను ఉన్న గాయాలు, ఇతర గుర్తులను చూసి అనుమానించాం. దీంతో ఆ మృతదేహాలు ఏమిటి? అంటూ ఆ బాధ్యతలు అప్పగించిన సూపర్‌వైజర్లను ప్రశ్నించా. పోలీసులకు చెప్పకుండా ఇలా మృతదేహాలను మాయం చేయకూడదని, అసలు విషయం చెప్పకపోతే ఆ పని చేయనని స్పష్టం చేశా. ఆగ్రహానికి గురైన వాళ్లు నన్ను తీవ్రంగా కొట్టారు. తాము చెప్పినట్లు చేయకపోతే చంపేస్తానంటూ బెదిరించారు. 'ముక్కలుగా నరికేస్తాం', 'మీ మృతదేహాన్ని మిగిలిన వాటిలాగే పాతిపెడతాం', 'మీ కుటుంబాన్ని కూడా ఉండనీయం' అంటూ వాళ్లు భయపెట్టడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆ పని కొనసాగించా.*

*కొన్నిసార్లు ఆయా మృతదేహాలపై అత్యాచారం, తీవ్రమైన హింసకు సంబంధించి ఆనవాళ్లు కనిపించాయి. మహిళల మృతదేహాల్లో అనేకం వస్త్రాలు లేకుండా లో దుస్తులు లేకుండా ఉండేవి. వారి శరీరాలపై లైంగికదాడులకు సంబంధించి గుర్తులు, గాయాలు కనిపించేవి. కొన్ని మృతదేహాలకు ఏకంగా గొంతులు కోసి, తీవ్రరక్తస్రావమై ఉండేవి. 1994 నుంచి దాదాపు 20 ఏళ్ల పాటు ఎన్నో మృతదేహాలను తీసుకువెళ్లి ధర్మస్థళ చుట్టుపక్కల ఉన్న అటవీ ప్రాంతాల్లో పూడ్చిపెట్టా. వాటిలో 2010లో పూడ్చిన బాలిక మృతదేహం స్కూల్‌ యూనిఫాంతో ఉంది. ఆ రోజు సూపర్‌వైజర్లు నన్ను నేత్రావది నది సమీపంలో ఉన్న పెట్రోల్‌ బంక్‌కు అర కిలోమీటరు దూరంలో ఉన్న ప్రదేశానికి పంపారు. అక్కడే నాకు ఆ బాలిక మృతదేహం కనిపించింది. అప్పట్లో ఆమె వయస్సు 12 నుంచి 15 ఏళ్ల మధ్య ఉండచ్చు. ఆమె శరీరంగా లైంగిక దాడికి సంబంధించిన గుర్తులు స్పష్టంగా కనిపించాయి.*

*యాసిడ్‌ దాడిలో ముఖం, చేతులు కాలిపోయి ఉన్న మహిళలవి, గొంతు పిసికి చంపిన పురుషుల మృతదేహాలు కూడా తీసుకువెళ్లి పాతిపెట్టి వచ్చా. నా సమక్షంలోనూ కొందరిని చంపిన సూపర్‌వైజర్లు ఆ శవాలను మారుమూల అటవీ ప్రాంతాల్లో పాతిపెట్టించారు. 1998లో వారికి ఎదురు తిరగడంతో తీవ్రంగా కొట్టారు. నా ప్రాణంతో పాటు నా కుటుంబ ప్రాణాల కోసం 2014 వరకు ఈ పని చేశా. ఆ ఏడాది డిసెంబర్‌లో సూపర్‌వైజర్ల సంబంధీకుడు నా కుటుంబానికి చెందిన బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. దీంతో నా ఉద్యోగంతో పాటు ధర్మస్థళ వదిలి కుటుంబంతో సహా పారిపోయా. ఇతర రాష్ట్రంలో తలదాచుకున్నా... నాకు, నా కుటుంబానికి హాని తప్పదనే భయం నిత్యం వెంటాడుతూనే ఉంది. అప్పట్లో జరిగిన దారుణాలను బయటకు చెప్పాలని ఇటీవల తిరిగి వచ్చా'' అని పేర్కొన్నాడు.*

*ధర్మస్థళకు వచ్చిన వెంటనే తాను అప్పట్లో ఓ శవాన్ని పాతిపెట్టిన ప్రాంతానికి వెళ్లానని పోలీసుల దృష్టికి తెచ్చాడు. అక్కడ తవ్వి కొన్నేళ్ల క్రితం పాతిపెట్టిన మృతదేహాన్ని తవ్వి తీశానంటూ కొన్ని ఫొటోలను తన ఫిర్యాదుతో జత చేసి ధర్మస్థళ పోలీసులకు అందించాడు. తనకు, తన కుటుంబానికి రక్షణ ఇవ్వాలని కోరాడు. పోలీసులు తనతో వస్తే తాను మృతదేహాలను పాతిపెట్టిన అటవీ ప్రాంతానికి తీసుకువెళ్తాననీ పేర్కొన్నాడు.*

*ఆ మృతదేహాలను బయటకు తీసి సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు పూర్తిచేయాలని ఆశిస్తున్నానని, అలా చేస్తేనే వారి ఆత్మకు శాంతి చేకూరుతుందని, తనలో ఉన అపరాధ భావం పోతుందని సదరు మాజీ పారిశుద్ధ్య కార్మికుడు పోలీసులకు చెప్పాడు. అప్పట్లో మృతదేహాలను మాయం చేయాలని ఆదేశించిన వారిలో సూపర్‌వైజర్లతో పాటు ఆలయ పాలకమండలి సభ్యులూ ఉన్నట్లు వివరించాడు. ప్రాణభయంతోనే వారి పేర్లు చెప్పలేదని, పలుకుబడి ఉన్న వారి నుంచి తనకు రక్షణ కావాలని కోరాడు. పోలీసుల ఆ భరోసా ఇస్తే అన్ని పేర్లు చెప్తానని అన్నాడు. ఈ ఫిర్యాదును కోర్టుకు నివేదించిన ధర్మస్థళ పోలీసులు న్యాయమూర్తి అనుమతితో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.*

No comments:

Post a Comment