Sunday, July 20, 2025

 _[—నామిని సుబ్రహ్మణ్యం నాయుడు రాసిన *"సినబ్బ కతలు"* నుండి ఇదిగోండి ఈ కథ కూడా చదివి మురిసిపోండి.]_ 
___________________________
*_“తంతే తలకోనలో పడే కత”_* 
*=================*

*నాకు పిర్రలకాడ నిక్కర, బుజాల కాడ చొక్కాయి చినిగిపోయినా యెంగటాపరం అయిస్కూలుకు పొయ్యేదానికి అగుమానం లేదుగాని, సత్తు కేరీరులో కూడు పెట్టకపోతా ఉంటే మాత్రం బలే బైసాట్లుగా ఉండింది. కోడి గెలికినట్టు అచ్చిరాలు రాసే ఉమ్మడికి టీలు కేరీరు, పుస్కాలకు గూడ సరిగ్గా అట్టలేసుకునేది రాని రాముడికీ టీలు కేరీరు, చదువు మింద శ్రద్దేలేని రాజగోపాలుడికీ టీలు కేరీరు. నేనేమన్నా మా అమ్మకు నెల తక్కవగా పుట్నానా..! నాకు మాత్రం ఈ సత్తు కేరీరు అగుమానం ఏందిరా శాస్త్రం జెప్పిన బ్రమ్మం గారా? అని నేను నడవలూరులో ఉండే బ్రమ్మం గార్ని నిలేసి ఉండాను. చెప్పాల్సిన శాస్త్రాలన్నీ డోలు వాయించి చెప్పేసిన బ్రమ్మం గారికి గుళ్లో మాత్రం నోరూ వాయీ లేకుండా నిరామయంగా అయిపోయి, మూగెద్దు మాదిర్తో గమ్మనుండాడు.*

*"ఒరే సినబ్బా! నువ్వు యెంగటాపరం అయిస్కూలికి పోతాపోతా దినామూ నా గుళ్లోకి వచ్చి అంత ఈబూదిని నొష్టన పెట్టుకొని పో. నలపై దినాలు ఈ మాదిర్తో చెయ్, మీయమ్మకు బుద్ది పుట్టి నీకు టీలు కేరీరు తీసిస్తోంది" అని చెప్పినాడు బ్రమ్మంగారు నాతో, సరే, దేముడి మాట మనమెందుకు కాదనాలని చేసి చూసినాను.*

*నలపై ఒకటో రోజు మా కొట్టాంలో ఉండే మా బుజ్జి ఎనుము పెయ్యిదూడను ఈనింది. పాలచుక్కను కండ్లజూసే యింటికి అది ఎంత వైభోగం? మల్లారం నుంచి మా ఊరికి వచ్చే ఒక ముండమోపి ఆడామెకు మా అమ్మ తెల్లారీ సందేళా పడిపాలు పోయ మరిగింది. (పడిపాలు అంటే అరశేరు,) ఆ పాలు ఖరీదు ఎనబై నయాపైసలు. పదినాళ్ళ పాలరూకతో టీలు కేరీరు కొని పెడితే.... నేను చందమామ మాదిర్తో దగద్దమానంగా యెలిగి పొయ్యే టీలు కేరీర్లో అయిస్కూలికి నెల్లూరు మొలగొలుకుల కూడు ఎత్తకపోతే ఏమి, కేడి బియ్యం కూడు ఎత్తకపోతే ఏమి? టీలుకేరీర్లో ఏమి ఎత్తకపోయినా ఎంత మతింపు!*

*మా వూరికి మంగళవారమాయన అని ఒకాయన మంగళోరం, మంగళోరం తిరపతి నుంచి టీలు సామాను తెచ్చేటోడు. ఆ పుణ్యాత్ముడిది ఏమీ తప్పులా, వాయిదాల ప్రకారం గూడా సొత్తును అమ్మేవాడు. మావూరోళ్ళు ఆయన్ని 'మంగళోర మాయన' అనే పేరుతో పిలుచుకునేటోళ్ళు. మా మిట్టూరుకి మూడు మైళ్ల దూరంలో ఉండే యెంగటాపరానికి ఆయన బుదోరం బుదోరం వచ్చేటోడు. అందుకని యెంగటాపరంలో ఆయన పేరు 'బుదోరమాయన.'*

*నేను మాయమ్మ ముందర పొడుగ్గా నిలబడి, చూపుడు వేలును బారడు పొడుగు ఆడించి, “అమా, యిప్పుడే చెప్తావుండా, మళ్ళ చెప్పలేదనుకొనేవు! ఎనుము ఈనింది గదా! ఈ ఈతలో నువ్వు నాకు టీలుకేరీరు కొనియ్యాల.” అని యెచ్చిరిక జేసినాను.*

*'ఈడు పట్టుకున్నాడంటే మళ్ళ వొదలడు గదా' అని మాయమ్మ నాతో నెమ్మదిగా..., "కుచ్చోని గదరా పొనుకోవాల. ముందు కుచ్చోనియ్, మళ్ళా పొనుకుంటా” అని శాస్త్రం మాట్లాడేది. నేను కోపంతో, “నువ్వు నేర్చిన మాటలు కట్టిపెట్టువాయ్. నాకు గాని టీలు కేరీరు తీసీకుంటే-" అని నత్తి కొరుక్కునే వాడ్ని. నేనింత కోపంతో కానీగానీ మాటలు మాట్లాడినా, మాయమ్మ గాంధీ తాత పక్కింటి దాని మాదిరిగా శాంతంతో, “ఏమి నాయినా, నువ్వు సత్తు కేతీరులో అన్నం పెట్టుకోని పోతే నీకు తలగుడ్డ నేల పడిపోతిందా? చదువుకునే పిలగోడికి బడాయి ఉండగూడదురా తండ్రీ!" అని నాకు మైసూరు శాండిలు సోపేసేది. మా అమ్మ అంతటితో నోరు మూసుకోకుండా ఇదిగో ఇంకో కత మొదలెట్టింది...* 

*మా మేనత్తకు ముత్యాలునాయుడు అని ఒక కొడుకుండేటోడు. ఆయన ఎస్.ఎస్.ఎల్.సి. పాసయి మా ఊరికి వీఎల్ డబుల్యూ అయిపోయ్నాడు. ఆయనకు మా మేనత్త మొగుడు ఒక పలక తీసిచ్చినాడంట. ఆ పలకతోనే ఆయన తమ్ముడు దేవరాజులు నాయుడు గూడా చదువుకుని ఈ పొద్దు పెద్ద డాకట్రగా అమిరికాలో ఉండాడు. దేవరాజులు చదువుకున్న పలకతోనే మా చిన్నాయన కొడుకులు గూడా చదువుకున్నారంట. ముత్యాలనాయుడు అయిస్కూలికి, ఏ కేరీరయితే ఎత్తక పొయ్ నాడో అదే కేరీర్తో బడాయిలకు పోకుండా యింతమందీ చదువుకుని ఊళ్లేలతా ఉండారంట... అని గొప్పలు చెప్పకొచ్చింది.*

*నేను మా కోతి మొకం దాన్ని అడిగింది ఇటు మంటి కతలు చెప్పమనా? నాకు టీలు కేరీరు తీసియ్యమనిగదా?*

*మా నంగిదాని కతలు ఈ మాదిర్తో ఉంటే.. అయిస్కూల్లో ఆ సత్తు కేరీరు నా మానం తీసి కానగ మాకులకు కట్టేస్తా ఉండాది. ఒకసారి మా సోసీలయ్యోరు కిష్ణారెడ్డి (ఈయన్ను మేము బొగ్గోడు అనుకుంటాము) నన్ను పైకి లేపి, “ఒరే మిట్టూరు గుడ్డోడా! ఈరోజు నీ కేరీర్ని పూరా లేపేస్తా. ఏమి టిఫను?" అనడిగినాడు. మా బొగ్గోడు బలే వోగు నాయాలు. ఆయన ఆడపిలకాయిల కేరీర్లను దినామూ తీసి ఒక్కో కేరీర్లో రెండేసి పిడికిళ్లు బొక్కలాడేస్తాడు. నేను లేచి నిలబడి, "సంగటి, వొట్టి మిరక్కాయ కూర సా, తింటావా సా?" అనడిగినాను. మా బొగ్గోడు, “తీస్కరారా!” అననన్నాడు. నేను నా కేరీరును ఎత్తకపొయ్ యిస్తే, ఆ బొగ్గు నాకొడుకు చేతల్లోకి తీసుకోకుండా, “ఈ అందమైన కేరీర్లో బలే అందంగా ఉండునబ్బా సంగటి. తినకుండానే "పద పద!" అనేసినాడు. వాడనిన ఈ మాటలకు క్లాసు క్లాసంతా, ఇంకా నాలాగే సత్తు కేరీర్లు తెచ్చే నాకొడుకులు గూడా రేలంగిని చూసి నవ్వినట్టు ఒకటే నవ్వేసినారు. క్లాసులో నా గాచ్చారం ఈ వాటంతో ఉంటే, సందేళ యింటికి వచ్చేటప్పుడు పుస్తకాల మింద ఉండే నా సత్తు కేరీరుకు మాటి మాటికీ 'మూత ఊడిపోతుండేది. అది కింద పడిందంటే, టీలు కేరీర్లు తెచ్చే నాయాండ్లు తమాస తమాసగానే ఒకడు మూతను రెడ్డి గుంటలో పడేటట్టు, యింగొకడు కేరీరును రెడ్డి గుంటను ఆనుకొని వుండే లంజి గుంటలో పడేటట్టు తన్నేటోళ్లు.*

*ఒకరోజు నాకు కలొచ్చింది. ఆ కల్లో మాయమ్మ, నాకోసం పద్నాలుగు రూపాయలు పెట్టి జమ్మాచారంగా ఉండే ఒక టీలు కేరీర్ను కొనేసింది. నేను అక్కసుతో నా సత్తు కేరీర్ను ఎదురుగుండా పెట్టుకొని ఈడ్చి ఒక్క తన్ను తన్నినాను. నేను తన్నిన తన్నుకు నా కేరీరు ఈదిలోని బురద గుంటలోకి పొయ్ పడకుండా, ఆకాశిమార్గాన ఎగరతా ఎగరతా పొయ్ తలకోనలో పడింది.*

*ఆ తెల్లారి మాయమ్మ, మాయక్క నా కర్లింగు హెయిర్లను గుత్తిగా పట్టుకోని, "నాబట్టా! రాత్తిర్లు మా పక్కల్లో పొనుకున్నావంటే దూలానికి యేలాడదీసేస్తాము. నిద్దర్లో ఒక్కొక్క తన్ను తన్నినావంటే - తలనకోనలో పొయ్ పడేటట్టుగా ఉందంటే! నీకు యాడిదిరా నిద్దర్లో అంత శగితి?” అని నన్ను తగులుకున్నారు.*
|||||||||||||||||||||||||||||||||||||||||||||
*_-{[ఓయబ్బో... అట్టాంటిట్టాంటివి గాదే సినబ్బ కతలు..!! ఒక్కో కత ఒక్కో రేంజిలో ఉందిగా.... రేపు మళ్ళీ ఇంకో కతతో కలుసుకుందాం. అంతదాకా ఈ కతల్ని తలుచుకుంటా... నవ్వొస్తే నవ్వుకుంటూ తెగ సంబరపడిపోండి. అలాగే ప్రతి కథ వెనకాల దిగువ మధ్య తరగతి కుటుంబాల ఈతి బాధలు కూడా గమనించండి..🙏: --వెలిశెట్టి నారాయణరావు, విశ్రాంత సాంఘికశాస్త్ర ఉపాధ్యాయుడు]}-_*

No comments:

Post a Comment