*అభివృద్ధి_సోపానాలు*
*మనిషి గొప్పవాడు కావాలని నిరంతరం కలలు కంటుంటాడు.*
*ధనాశ కలిగినవాడు కుబేరుణ్ని మించి పోవాలనుకుంటాడు. అధికారదాహం కలవాడు అత్యున్నతస్థాయి కుర్చీని ఆక్రమించుకోవాలనుకుంటాడు. జ్ఞాని పరమజ్ఞానిగా, సాధకుడు సిద్ధుడిగా, శూరుడు యోధుడిగా, వైద్యుడు ధన్వంతరి సమంగా... ఇలా ఉంటాయి ఆశల కలలు.*
*కలలు వేరు, వాస్తవం వేరు!*
*ధాన్యాన్ని సంచుల్లోనే ఉంచుకుని, పదింతల పంటకోసం కలలు కనడం ఎంతవరకు సబబు?*
*హలాలతో పొలాలు దున్ని భూమాతను నమ్ముకుని తగినంతగా కృషి చెయ్యాల్సి ఉంటుంది. కలలు కృషితో జత కలిసినప్పుడే సత్ఫలితాలు లభిస్తాయి.*
*ఉద్యోగి తన ప్రజ్ఞకు పదును పెట్టుకుంటూ, అంకితభావంతో పనిచేసినప్పుడే పదోన్నతులు లభిస్తాయి. తన కళ్లముందు తనకంటే వెనకవాళ్లు అభివృద్ధి సోపానాలు ఎక్కుతుంటే అసూయతో రగిలిపోవడం మన ఆరోగ్యానికే చేటు.*
*అలాగే విద్యార్థులు కూడా. అమూల్యమైన సమయాన్ని ఆటపాటలు, వినోదాలతో వ్యర్థం చేసుకుంటే ఉత్తీర్ణతే కష్టం కావచ్చు. ఇక ఉన్నతశ్రేణికి అవకాశం ఎలా ఉంటుంది?*
*గతించిన కాలం ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కిరాదు. సర్వసమర్థుడైన భగవంతుడైనా కాలాన్ని వెనక్కితిప్పడు. కోట్లాది రూపాయలు గుమ్మరించినా గతించిన క్షణాల్ని తిరిగిపొందడం అసాధ్యం. కానీ, చాలామంది ఈ సత్యాన్ని గమనికలోకి తీసుకోరు.*
*‘నేను చాలా తప్పులు చేశాను. తల్లిదండ్రుల్ని హింసలుపెట్టాను. ఒక్కసారి వారికి మళ్ళీ సేవలు చేసే అవకాశం ఇవ్వు భగవంతుడా’ అని ఎంత మొత్తుకున్నా- పోయినవాళ్లు మళ్ళీ ప్రత్యక్షం కారు.*
*సమయం మన చేతుల్లో ఉన్నప్పుడే సద్వినియోగం చేసుకోవాలి. ధనం పుష్కలంగా ఉన్నప్పుడే దానధర్మాలు చెయ్యాలి*.
*యౌవనంలో ఉండగానే తీర్థయాత్రలు చేయాలి. బాలుడిగా ఉన్నప్పుడే శ్రద్ధగా విద్యాభ్యాసం చేయాలి. మనసు మనమాట వినే సమయంలోనే ఆధ్యాత్మిక సాధన చేయాలి. మంచిచెడుల విచక్షణ కల్పించే జ్ఞానాన్ని సదా రక్షించుకోవాలి*.
*కుబేరుడు శ్రీనివాసుడికి రుణం ఇచ్చిన కథ ఉంది. అంతటి ధనసంపన్నుడూ ఎవరికీ ఎక్కడా దానధర్మాలు చేసిన కథలు కనిపించవు. అందువల్ల కుబేరుడికి భక్తులుండరు.*
*సిరుల దేవత శ్రీమహాలక్ష్మిని ఎందరో ఆరాధిస్తారు. ఆ తల్లి చల్లనిచూపు పడితే చాలనుకుంటారు. ఎందుకంటే ఆ మహాదేవి అనుగ్రహమే అమోఘదానంతో సమానం.*
*ప్రపంచంలో కుబేర సమానులెంతమంది ఉన్నా- సత్కార్యాలు, దానధర్మాలు చేయనిదే వాళ్లకు గుర్తింపు ఉండదు.*
*కాబట్టి, తన సంపదను పంచడంతోపాటు, తోటివారిని ఆదుకునే తత్వాన్ని పెంచుకోవాలి! అవధులెరుగని దాత అనిపించుకోదగినవాడు భగవంతుడొక్కడే. ఆయన దాతలకే దాత.*
*ఎదుగుదలను భౌతికంగా, సిరిసంపదలు, అధికారహోదాలకు, విద్యాధిక్యత, జ్ఞానసంపదకు ముడిపెట్టుకున్నంత కాలం మనిషి సత్యానికి దూరంగా ఉంటాడు.*
*అసలు సత్యమేమిటంటే, మనలోని సంస్కారం ఒక్కో మెట్టు ఎదగాలి. సంపూర్ణ సంస్కారవంతుడికి ఎవరి ఎదుగుదలపట్లా అసూయ, ద్వేషాలు ఉండవు.*
*తులసి మొక్క సర్వలోకపూజిత. అది ఎప్పుడూ చిన్నదిగానే ఉంటుంది. తాడిచెట్టు చాలా ఎత్తుగా ఉంటుంది. కానీ, తులసి మొక్క పవిత్రత ముందు అది ఎందుకూ కొరగాదు.*
*అభివృద్ధి సోపానాలు ఎక్కడానికి ఆరాటపడటం కంటే మన అర్హతలు పెంచుకునేందుకు కృషిచేయడం చాలాముఖ్యం. ఎవరో మనల్ని మించిపోతున్నారనే దుగ్ధ మన ఎదుగుదలకు ప్రధాన అవరోధం కనుక, ఆ భావాన్ని మనలోకి రానివ్వకూడదు. మనం మనంగానే ఉండాలి. మనకు లభించాల్సినవి లభిస్తూనే ఉంటాయి. పెరగాల్సింది సంస్కారం. మరేవీ కావు. ఇదే జీవన విజయసూత్రం!*✍️
*సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
No comments:
Post a Comment