Saturday, November 1, 2025

 దుఃఖరాహిత్యం
కురుక్షేత్ర యుద్ధంలో అభిమన్యుడు మరణించాక పక్కన కూర్చొని ఏడుస్తున్నాడు అర్జునుడు. కొంచెం దూరంలో కృష్ణుడూ విచారంగా కూర్చుని ఉన్నాడు. అర్జునుడిది సరే కొడుకు పోయిన దుఃఖం, నువ్వెందుకు బాధపడుతున్నావని కృష్ణుణ్ని అడిగాడు అటుగా వెళ్తున్న వ్యక్తి. 'ఇంత కష్టపడి భగవద్గీత బోధించాను అయినా అర్జునుడికి అర్ధం కాలేదు' అని సమాధానమిచ్చాడట కృష్ణుడు. ఎంతటి కష్టానికైనా దుఃఖించకుండా ఉండగలగడం గొప్ప స్థితి. దుఃఖరాహిత్యం అంత సులభమేమీ కాదు. పెద్ద పెద్ద సమస్యలకి దుఃఖం తప్పదు. కానీ చిన్న చిన్న వాటికి కూడా ఏడుస్తూ కూర్చుంటారు కొందరు!

దుఃఖంలేని స్థితి కోసం ప్రవక్తలు, తత్వవేత్తల బోధనలు వింటాం. భగవద్గీత లాంటి గ్రంథాలు చదువుతాం.. వాటిలోని సారాన్ని ఆచరించనప్పుడు చదివీ ఉపయోగం ఏంటి? ప్రతి మనిషికి రెండు ప్రపంచాలుం టాయి. ఒకటి బయటికి కనిపించే వాస్తవ ప్రపంచం. రెండోది అతడి మనసులోని అంతర్గత లోకం. ఈ అంతర్గత ప్రపంచంలో రకరకాల ఆలోచనలు, కలలు, ఉద్వేగాలు లాంటివెన్నో ఉంటాయి. చాలామందికి ఈ రెంటికీ మధ్య సమన్వయం తెలియక తాము నమ్మేది ఒకటైనా, బయటి ప్రపంచం కోసం మరొకలా నటిస్తారు. ద్వంద్వ ప్రవృత్తితో వాస్తవంలో ఒకలా, లోపల మరొకలా బతికితేనే దుఃఖం కలుగుతుంది. నమ్మిన విలువలకు నిజాయతీగా కట్టుబడి నడిచే వాడు తృప్తిగానే జీవిస్తాడు. దుఃఖరాహిత్యం కావాలంటే ద్వంద్వ ప్రవృత్తులు ఉండకూ డదు. కానీ అడుగడుగునా మనం ముసుగులు వేసుకుంటాం. పరిణతి పెరిగే కొద్దీ ముసుగు మరింత దట్టంగా వేసుకోవడమా... మొత్తానికి తొలగించడమా ఏది సమర్థత అంటే- ముసుగు తీయడమే. పరిస్థితులతో సర్దుబాటు చేసుకోవడమే సమర్థత. అదే క్రమంగా దుఃఖస్థితి నుంచి దుఃఖరాహిత్యానికి నడిపిస్తుంది. ఈ స్థితి కోసం మనం మెదడుకు శిక్షణ ఇవ్వాలి
క్షణ క్షణం పరివర్తనాశీలమైన ప్రపంచంలో మనుగడ కోసం ఆరాటం తప్పదు. ఈ ఆరాటమే జీవన పోరాటమైనప్పుడు దుఃఖం అనివార్యం. మన తప్పొప్పులకు మనమే బాధ్యులం. మన కష్టానికి, బాధకి మనమే కారణం అనుకుంటే దుఃఖం ఉండదు. జీవించడం తెలియనివాళ్లే దుఃఖాన్ని మోస్తూ తిరుగుతారు. ఎక్కడిదాన్ని అక్కడే వదిలేసి ముందుకెళ్తాడు సమర్థుడు. అందుకే దుఃఖరాహిత్యం అనేది మన సమర్థతపై ఆధారపడి ఉంటుంది. ఎంతో చిన్న ప్రాణులైన చీమలకు ఎటువైపు వెళ్తే పంచదార పలుకు లభిస్తుందో, ఎటు వెళ్తే అపాయమో తెలుసు. వాటికన్నా ఎన్నో రెట్లు గొప్పవాడైన మనిషికి ఏది మంచో ఏది చెడో తెలియక పోవడం, తెలిసినా ఆ విధంగా ఆచరించక పోవడమే దుఃఖం. దాన్ని అధిగమించడానికి జ్ఞానమే ఔషధం. ఈ జ్ఞానాగ్ని వెలుగులో మనల్ని మనం దర్శించుకోవడం, మన అసలు స్వరూపం తెలుసుకోవడమే దుఃఖరాహిత్యం. మనలోపలి శత్రువులైన అరిషడ్వర్గాలను జయించడమే అసలైన దుఃఖరాహిత్యం.

శివలెంక ప్రసాదరావు

No comments:

Post a Comment