Saturday, November 1, 2025

 8️⃣3️⃣

*🛕🔔భగవద్గీత🔔🛕*
  _(సరళమైన తెలుగులో)_

  *మూడవ అధ్యాయము* 

    *కర్మయోగము.*  

*శ్రీభగవానువాచ:*

*37. కామ ఏష క్రోధ ఏష రజోగుణసముద్భవ:l*
 *మహాశనో మహాపాప్మా విద్ధ్యేనమిహ వైరిణమ్ll*

రజోగుణము వలన పుట్టిన కామము, క్రోధము మనకు శత్రువులు, కోరికలు ఎన్ని తీరినా ఇంకా కోరికలు మిగిలే ఉంటాయి. కామదాహమునకు అంతు లేదు. ఈ కామములు తీరకపోతే అవి మనకు శత్రువులుగా పరిణమించి, అనేక మహాపాపములకు కారణం అవుతూ ఉంటాయి అని తెలుసుకో!

ఓ అర్జునా! ఎవరో చెప్పినట్టు అందరూ పాపాలు ఎందుకు చేస్తున్నారో తెలుసా! దానికి మూలం రజోగుణము వలన పుట్టిన కోరికలు. అవి తీరకపోతే వచ్చే కోపం. ఈ కోరికలు ఎంత అనుభవించినా వాటి ఆకలి, దాహం తీరదు. ఇంకా కావాలి ఇంకా కావాలి అంటుంటాయి. కోరికలకు తృప్తి లేదు. ఈ కామము, క్రోధము మానవునికి ప్రబల శత్రువులు. అన్ని అనర్థాలకు ఇవే మూలము. అని కృష్ణుడు అర్జునునితో చెప్పాడు.

మూడు లోకములలో ఉన్న మానవులను పట్టి పీడిస్తున్న జాడ్యము ఒకటే ఉంది. అదే కామము, కోరిక, ఒక వస్తువు కావాలని ఆరాటం, ఈ కామము రజోగుణము నుండి పుడుతుంది. వాడి కోరిక తీరడానికి ఎవరు కానీ, ఏది కానీ అడ్డు తగిలితే పిచ్చి కోపం వస్తుంది. కాబట్టి కోరిక కోపము పక్క పక్కనే ఉంటాయి. రజోగుణము నుండి కోరిక పుడుతుంది. ఆ కోరిక తీరడానికి కర్మ చేస్తాడు. అది మంచి కర్మ కావచ్చు. చెడ్డ కర్మ కావచ్చు. చేయకూడని కర్మ కావచ్చు. పుణ్యం కావచ్చు. పాపం కావచ్చు. ఏదైనా ఆలోచించకుండా చేసేస్తాడు. చేసిన తరువాత మంచి జరిగితే ఎగిరి గంతేస్తాడు. చెడు జరిగితే ఎందుకు చేసానా అని ఏడుస్తాడు. ఫలానా వాడు చెబితే చేసాను అని పక్కవాడి మీద తోసేస్తాడు. యజమాని చెబితే చేసాను అని అంటాడు.

ఎవరు ఎన్ని చెప్పినా అసలు పాపం చేయడానికి మూలం కామము, కోరిక. ఆ కోరిక మానవునికి ఇష్టం లేకపోయినా బలవంతంగా అతని చేత పాపం చేయిస్తుంది. కోరిక అంత శక్తివంతమైనది. ఆ కోరిక తీరక పోతే కోపం వస్తుంది. కామము, క్రోధము ఇద్దరూ అన్నదమ్ములు. అందుకనే అరిషడ్వర్గములలో కామ, క్రోధములకు మొదటి రెండు స్థానములు కేటాయించారు. కామము నాయకుడు అయితే క్రోధము ఉపనాయకుడు. ఆత్మను గురించి తెలుసుకోవాలి అనుకొనే వారికి ఈ ఇద్దరూ ప్రబలశత్రువులు, ఈ కామము నకు ఆకలి ఎక్కువ. ఎంత తిన్నా దీనికి ఆకలెక్కువ. (మాన్ ఈజ్ ఎ బండిల్ ఆఫ్ వాంట్స్, ఎన్ని కోరికలు తీరినా ఇంకా కొన్ని కోరికలు మిగిలిఉంటాయి) అమ్మయ్య అన్ని కోరికలు తీరాయి అన్న మాట ఎవరి నోటా రాదు. అగ్నిలో నెయ్యి పోస్తే భగ్గుమన్నట్టు ఈ కామము ఎప్పుడూ మండుతూనే ఉంటుంది. అగ్నిలో నెయ్యి సమిధలు వేయకపోతే అగ్ని చల్లారి పోతుంది. అలాగే ఈ కామాగ్నిలో తత్వవిచారణ ద్వారా కోరికలను అదుపు చేస్తే, కామం దానంతట అదే చల్లారిపోతుంది.

ఈ శ్లోకంలో పరమాత్మ మహాపాప్మా అనే పదం వాడాడు. ఈ కామము మహా పాపములకు కారణమైనది అని అంటారు. ఈ కామం వలననే మానవులకు పుణ్యాలు తగ్గి పాపాలు పెరుగుతుంటాయి. ఈ కామము మానవునికి శత్రువు వంటిది. బయట ప్రపంచంలో శత్రువులు దూరంగా ఉంటారు. కాని ఈ కామము అనే శత్రువు మన వెంటనే ఉండి, మనలను సర్వనాశనం చేస్తుంటుంది. ప్రతివాడి మనసులో తిష్టవేసుకొని కూర్చుని ఉంటుంది. పోనీ ఈ కామము ఒక జన్మతో పోయేది కాదు. జన్మ జన్మల నుండి వేధిస్తూ మన పాపపు వాసనలను పెంచుతూ జన్మ జన్మలకు మన వెంట వస్తూ ఉంటుంది. ఈ కామము మనిషిని శాంతంగా ఉండనివ్వదు. మానవుడిని తన బానిసగా చేసుకుంటుంది. (వాడు కోరికలకు బానిస అయ్యాడు, వ్యసనాలకు బానిస అయ్యాడు అని మనం అంటూఉంటాము.) ఆ ప్రకారంగా కామము మనలను బానిసలుగా చేసుకుంటుంది. తనే అధికారము చెలాయిస్తుంది. ఈ కామము తన మిత్రులైన క్రోధము, లోభములను కూడా పిలుచుకొని వచ్చి తన వెంట ఉంచుకుంటుంది. అవసరమైనపుడు వాటి సాయం తీసుకుంటుంది. వాటిని మన మీద ప్రయోగిస్తుంది. ఇంట్లో పాము ఉంటే ఎలా మనం శాంతిగా ఉండలేమో, అలాగే ఈ కామ క్రోధములు మనసులో చేరితో ప్రశాంతంగా బతకలేము. నిత్యం అశాంతితో అల్లాడుతుంటాము.

ఇంకా వివరంగా చెప్పుకోవాలంటే మనలో ఉన్న అజ్ఞానమే దీని కంతటికీ కారణము. మానవునిలో ఉన్న అజ్ఞానము, కామము, క్రోధము రూపంలో ప్రకటితమౌతూ ఉంటుంది. ఇవి రెండుగా కనిపించినా నిజానికి ఒకటే కామము తీరకపోతే క్రోధం పుడుతుంది. కామం లేకపోతే క్రోధం లేదు. ఈ కామము క్రోధము కంటికి కనిపించకపోయినా భావనా రూపంలో అనుభవరూపంలో ప్రకటితమౌతుంటాయి. కాబట్టి కామము అంటే కోరికల గురించి అవి తీరకపోతే వచ్చే కోపము గురించి తెలియని వాడు అంటూ ఎవరూ లేరు. ఈ కామమునకు కోపమునకు మూలస్థానము మనలో సహజంగా ఉన్న రజోగుణము. మనలో ఉన్న రజోగుణము నుండి ఇవి పుట్టాయి. వీటికి ఆకలి ఎక్కువ. ఈ ఆకలి ఎంత తిన్నా తీరేది కాదు. కోరికలు తీరుతూ ఉంటే కొత్తవి పుడుతూ ఉంటాయి. అగ్నిలో నెయ్యి పోస్తే భగ్గుమన్నట్టు ఈ కామం కూడా ప్రజ్వరిల్లుతూనే ఉంటుంది. ఈ కామము తీరకపోతే క్రోధంగా మారి మానవుల చేత మహాపాపాలు చేయిస్తుంది. కాబట్టి ఈ కామము దాని వలన పుట్టే క్రోధము మానవునికి ప్రబల శత్రువులు అని ప్రతివాడూ తెలుసుకోవాలి.

ఈ కామ క్రోధ లోభములు అనే శత్రువులను బయటకు తరిమెయ్యాలంటే మనం వివేకము, వైరాగ్యము అనే వారి సాయం తీసుకోవాలి. చాలామంది అంటుంటారు నేను కోరికలను అదుపులో ఉంచుకుంటాను అని. అది పొరపాటు, కామము అనే బీజం ఉన్నంతవరకు కోరికలు పుడుతూనే ఉంటాయి. కాబట్టి కామము అనే మూలాన్ని నాశనం చేయాలి. ఈ కామము ఎలా ఉంటుంది, దాని స్వరూపము, స్వభావము ఏమిటి అనే విషయం తరువాతి శ్లోకాలలో వివరిస్తున్నాడు పరమాత్మ.
(సేకరణ)

*🌹యోగక్షేమం వాహామ్యహం 🌹*

 (రచన: శ్రీ మొదలి వెంకట సుబ్రహ్మణ్యం, రిటైర్డ్ రిజిస్ట్రార్, ఏ. పి. హైకోర్టు.)
                           P204

No comments:

Post a Comment