8️⃣1️⃣
*🛕🔔భగవద్గీత🔔🛕*
_(సరళమైన తెలుగులో)_
*మూడవ అధ్యాయము*
*కర్మయోగము.*
*35. శ్రేయాన్ స్వధర్మో విగుణ: పరధర్మాత్స్వనుష్ఠితాత్l*
*స్వధర్మేనిధనం శ్రేయః పరధర్మో భయావహఃll*
చక్కగా ఆచరించబడిన పరధర్మము కంటే, గుణము లేనిదైనను స్వధర్మమే మేలు. స్వధర్మాచరణములో మరణించినా శ్రేయస్కరమే. ఎందుకంటే పరధర్మము చాలా భయంకరమైనది.
ఈ శ్లోకంలో స్వధర్మము, పరధర్మము గురించి చెబుతున్నాడు. అర్జునుడి స్వధర్మము యుద్ధంచేయడం. పరధర్మము సన్యసించి, బిక్షాటనతో జీవించడం. వీటి రెండింటి మధ్య తేడా చక్కగా వివరించాడు పరమాత్మ. ఓఅర్జునా! ఎంత చక్కగా ఆచరించినా పరధర్మము ఆచరణీయము కాదు. ఎందుకంటే అది భయానకమైనది. ఆచరణకు అసాధ్యమైనా స్వధర్మమును ఆచరించడమే మంచిది. ఎందుకంటే స్వధర్మము ఎల్లప్పుడూ శ్రేయస్సును కలిగిస్తుంది. కాబట్టి నీవు నీ పరధర్మము అయిన భిక్షాటన చేస్తూ సుఖపడేకంటే, స్వధర్మము అయిన యుద్ధం చేస్తూ మరణించడమే నీకు శ్రేయస్సును, వీరస్వర్గమును ఇస్తుంది. నీ కీర్తి ఇనుమడిస్తుంది.
అర్జునుడు పరంగా చెప్పాలంటే అర్జునుడు క్షత్రియుడు. అతని స్వధర్మము యుద్ధము చేయడం, రాజ్యపాలన చేయడం, ప్రజలను రక్షించడం. పరధర్మము యుద్ధము నుండి పారిపోవడం, సన్నాసము స్వీకరించడం, భిక్షాటన చేయడం ప్రస్తుతానికి యుద్ధం నుండి పారిపోవడం బాగా ఉంటుంది అనిపించినా, తరువాత అందరూ పిరికివాడని హేళన చేసి గేలిచేస్తుంటే అప్పుడు తెలుస్తుంది ఆబాధ. అందుకే స్వధర్మ ఆచరణే మంచిదని కృష్ణుని అభిప్రాయము.
ఇందులో మరొక విషయం కూడా దాగి ఉంది. స్వధర్మము అంటే ఆత్మ సంబంధమైన ధర్మము. ప్రతిమానవుని స్వధర్మము ఏమిటంటే తనను గూర్చి తాను తెలుసుకోవడం. తాను ఎవరో ఎక్కడి నుండి వచ్చాడో, తన కర్తవ్యం ఏమిటో తెలుసుకోవాలి. తాను ఆత్మస్వరూపుడు అని గ్రహించాలి.
అది చాలా కష్టం. పరధర్మము ఏమిటంటే ఈ దేహమే అత్మ అనుకోవడం. ప్రపంచంలో తాను చూసినవి, విన్నవి, తాకినవి శాశ్వతము అనుకోవడం వాటి కోసరం మోహంలో పడటం, తుదకు దుఖము చెందడం. కాబట్టి కష్టమైనా ఆత్మజ్ఞానము సంపాదించడమే ప్రతి మానవుని స్వధర్మము. ప్రాపంచిక విషయములలో మునిగితేలడం, సంసారంలో పడి కొట్టుకుంటూ ఉండటం పరధర్మము. స్వధర్మము మీద విరక్తి పరధర్మము మీద మోహము ఎందుకు కలుగుతూ ఉందంటే అది కేవలం మాయ.
ప్రపంచంలో దొరికే వస్తువులు అన్నీ మనలను మాయలో పడేస్తుంటాయి. ఆ మాయ నుండి బయట పడాలి. దానికి మార్గములే సత్సంగము, భగవతారాధన, మనో నిగ్రహము, ఇంద్రియ నిగ్రహము. ఈ మాదిరి ఆత్మచింతన కొనసాగిస్తూ ఉంటే మరణ సమయంలో కూడా ఇదే చింతనతో ఈ దేహమును వదిలి మరొక పుణ్య దేహమును పొందే అవకాశము ఉంది. అలా కాకుండా ఎల్లప్పుడూ ప్రాపంచిక విషయములలో మునిగితేలుతుంటే మరణ సమయంలో కూడా ఈ ప్రాపంచిక విషయములు వదలలేక, వాటి గురించి ఆలోచిస్తూ, ఆవేదన చెందుతూ, మరు జన్మలో కూడా ఆ చింతనలకు సంబంధించిన దేహమే వస్తుంది. కాబట్టి పరధర్మమైన ప్రాపంచిక విషయముల మీద మనసు నిలపకుండా, స్వధర్మమైన ఆత్మచింతన మీద మనసు నిలపమని పరమాత్మ బోధిస్తున్నాడు.
ఈ విషయాన్ని మనం లౌక్యంగా ఆలోచిస్తే. విద్యార్థుల స్వధర్మం స్కూలుకు, కాలేజీకి వెళ్లి చదువుకోవడం. ఇది కొంచెం కష్టం అయిన పని. పరధర్మం స్కూలు కాలేజీ ఎగ్గొట్టి మాటనీలకు పోవడం, అమ్మాయిలను ఏడిపించడం, లవ్ అఫెయిర్సులో మునిగితేలడం. ఇది చాలా సులభం, ఆనందం కలిగించే పని. కష్టం అయినా స్వధర్మం ఆచరిస్తే మంచి మార్కులతో పాసవుతాడు. మంచి ఉద్యోగం వస్తుంది. సుఖంగా జీవిస్తాడు. తాత్కాలికంగా సులభంగా ఆనందం కలిగించే పరధర్మం పాటిస్తే, ఫెయిల్ అవుతాడు. అవమానం భరించలేక ఆత్మహత్యకు పాల్పడతాడు. ఇలాగే ఉపాధ్యాయులు విద్యాలయాలకు వెళ్లి పాఠాలు చెప్పడం. విద్యార్థులను వృద్ధిలోకి తేవడం ఉపాధ్యాయుల స్వధర్మము. ఇది కొంచెం కష్టమే. ముందు తాను చదివి మరునాడు విద్యార్థులకు చెప్పాలి. దీని వలన ఎంతో మంది విద్యావంతులు తయారవుతారు. పెద్దపెద్ద పదవులు అలంకరిస్తారు. తమ గురువు గురించి గొప్పగా చెప్పుకుంటారు. కాని ఉపాధ్యాయుడు పరధర్మం పాటిస్తే అంటే విద్యాలయాలకు వెళ్లకుండా, జీతం మాత్రం తీసుకుంటూ, ఇతర వ్యాపకాలలో మునిగితేలడం, రాజకీయాలలో పాల్గొనడం, లేక ధనం కోసం ఇతరులకు ఊడిగం చేయడం. ఇది ప్రస్తుతానికి సులభంగానే ఆనందంగానే ఉంటుంది. కాని దాని వలన దీర్ఘకాలంలో ఎన్నో ఇబ్బందులు, ఉద్యోగం ఊడటం, సంఘంలో చెడ్డపేరు, మానసిక అశాంతి కలుగుతుంది. అలాగే ఉద్యోగస్థులు కూడా తమ తమ కార్యాలయాలకు సకాలంలో వెళ్లి తమకు కేటాయించిన సమయం వరకు పని చేయడం, అవినీతికి పాల్పడకుండా ఉండటం స్వధర్మము. అలా చేస్తే, చక్కని జీతం, మంచి ప్రోత్సాహకాలు, ఉన్నతాధికారులతో ప్రశంసలు, పదోన్నతులు లభిస్తాయి. కాని అలా కాకుండా, ఆఫీసులో సంతకం పెట్టి ఇతర వ్యాపకాలలో మునిగితేలుతూ, చేయాల్సిన పని ఎగ్గొట్టి ఇతరత్రా కాలక్షేపం చేయడం, అవినీతికి పాల్పడటం ఇది పరధర్మం. ఇలా చేస్తే, ఉన్న ఉద్యోగం ఊడుతుంది. భార్యాపిల్లలు వీధినపడతారు. తుదకు అధోగతి పాలవుతాడు. వ్యాపారస్థుల విషయం తీసుకుంటే ధర్మంగా, న్యాయంగా, నీతిగా వ్యాపారం చేసి అందులో వచ్చే లాభనష్టాలను సంతోషంగా స్వీకరించడం వ్యాపారస్థుని స్వధర్మం, ఇది కొంచెం కష్టం అయినా అమితమైన శ్రేయస్సును, మానసిక శాంతిని కలుగజేస్తుంది. ఉదాహరణకు ఇన్ఫోసిస్ నారాయణమూర్తి. అదే వ్యాపారాన్ని అధర్మంగా, అవినీతికి పాల్పడి, అక్రమాలు చేసి, లాభాలు గడించడం పరధర్మము, ఆ లాభాలు ఆనందం కలిగించకపోగా, తుదకు కష్టాల పాలుచేస్తాయి. ఉదాహరణ సత్యం అధినేత. రెండూ అత్యంత ప్రతిష్టాత్మకమైన వ్యాపారాలే. ఒకరు స్వధర్మం పాటిస్తే, మరొకరు పరధర్మాన్ని ఆశ్రయించారు. కాబట్టి మన నిజజీవితంలో కూడా స్వధర్మపాలన మొదట్లో కష్టంగా కనిపించినా అదే ఉత్తమం. పరధర్మం ఎప్పటికీ భయానకమే.
(సశేషం)
*🌹యోగక్షేమం వాహామ్యహం 🌹*
(రచన: శ్రీ మొదలి వెంకట సుబ్రహ్మణ్యం, రిటైర్డ్ రిజిస్ట్రార్, ఏ. పి. హైకోర్టు.)
P200
No comments:
Post a Comment