8️⃣2️⃣
*🛕🔔భగవద్గీత🔔🛕*
_(సరళమైన తెలుగులో)_
*మూడవ అధ్యాయము*
*కర్మయోగము.*
*అర్జున ఉవాచ:*
*36. అథ కేన ప్రయుక్తోఽయం పాపం చరతి పూరుష:l*
*అనిచ్ఛన్నపి వార్ష్ణేయ బలాదివ నియోజిత:||*
కృష్ణా! ఎవరూ కావాలని పాపాలు చెడ్డ పనులు చేయరు కదా. మరి ప్రతిరోజూ మానవులు ఏదో ఒక చెడ్డపని చేస్తూనే ఉన్నారు. దీనికి కారణం ఏమిటి. ఏ శక్తి మానవుని చేత చెడ్డపనులు దుర్మార్గాలు చేయిస్తూ ఉంది. అనిఅడిగాడు అర్జునుడు.
మనలో చాలా మంది అంటుంటారు. "ఇది తప్పని తెలుసయ్యా కాని ఎందుకో చేయాలని అనిపిస్తుంది." అని అంటుంటారు. కోపం అన్ని అనర్థాలకు మూలం అని అందరికీ తెలుసు. కాని కోపం అందరికీ వస్తుంది. అనరాని మాటలు అంటారు. తరువాత బాధపడతారు. అలాగే స్మోకింగ్ ఆరోగ్యానికి హానికరము అని తెలిసి ప్రభుత్వం సిగరెట్లను నిషేధించదు. అలాగే మద్యం కూడా. కారణం ధనం. చాలా మందికి తాము చేసే పనులు తప్పు అని తెలుసు కాని చేస్తూనే ఉంటారు. మానలేరు. జంక్ ఫుడ్ హాని చేస్తుంది అని అందరికీ తెలుసు కాని అందరూ అదే తింటారు. లంచం తీసుకోవడం తప్పు, జైలుకు పోతాము అని తెలుసు కానీ తీసుకుంటున్నారు. (ఇటీవల లంచం తీసుకునే వాళ్లను విచారించి. శిక్షలు విధించే జడ్జిగారే 3 కోట్ల లంచం తీసుకొని జైలుకెళ్లాడు. ఉద్యోగం పోయింది. ఇది ఆయనకు తెలియదా. తెలుసు. కానీ చేసాడు. ఎవరో చెప్పినట్టు చేసాడు.) దొంగతనం పాపం అనీ, శిక్షపడుతుందనీ తెలుసు. అందుకే ఎవరూ చూడకుండా దొంగతనాలు చేస్తుంటారు. ప్రజాధనం కొల్లగొట్టడం తప్పు, పాపం, నేరం అని అందరికీ తెలుసు.
కానీ రాజకీయనాయకులు, పెద్దపెద్ద పదవులలో ఉన్నవాళ్లు కోట్లకొద్దీ ధనం కొల్లగొడుతున్నారు. అవే స్కాములు. అంతెందుకు వందల మంది ముందు ఈ అమ్మాయి నా సహధర్మచారిణి. నా అర్థాంగి అని అంగీకరించి తాళి కట్టిన భర్త ఆమెను చిత్రహింసలు పెట్టడం, ఒక్కోసారి అంతమొందించడం చూస్తూనే ఉన్నాము. ఏ ఫామిలీ కోర్టుకు పోయినా అంతులేని కథలు వినిపిస్తాయి. అంతెందుకు ఒక మహా మేధావి ప్రధాన మంత్రి పదవిలో ఉన్న మహోన్నత వ్యక్తి కోల్ స్కామ్ లో ఇరుక్కున్నాడు. దీని కంతా కారణం ఏమిటి? ఈ దుర్మార్గాలు మానవులు ఎందుకు చేస్తున్నారు?తనకు ఇష్టం లేకపోయినా, ఎవరో బలవంతపెట్టినట్టు, ఎవరో చేయిస్తున్నట్టు అధర్మం చేస్తున్నారు. దీనికి కారణం ఏమిటి? ఇదీ అర్జునుడి ప్రశ్న.
కాబట్టి మానవునిలో అనుకూల శక్తి కన్నా ప్రతికూల శక్తి ఎంత బలంగా ఉంటుందో ఆలోచించుకోండి. ఇక్కడ ఒక పదం వాడారు. బలాదివ నియోజిత: అంటే ఎవరో బలవంతం చేసినట్టు ఎవరో ప్రేరేపించినట్టు, ఆజ్ఞాపించినట్టు మానవులు పాపం చేస్తున్నారు. అంటే మానవులు పాపం చెయ్యాలి అనే సంకల్పం లేకపోయినా, ఎవరో చేయించినట్టు పాపం చేస్తున్నారు అని భావన ఇది ఎందువల్ల జరుగుతూ ఉంది అని అర్జునుని సందేహము.
మనం సాధారణంగా గమనిస్తే మానవులు మూడు విధాలుగా ఉంటారు. కొంత మంది ఎప్పుడు కూడా ఏ పరిస్థితులలో కూడా పాపం చేయరు. అటువంటి ఆలోచన కూడా చేయరు. రెండవ రకం వారు. పాపం చేయడం తమకు ఇష్టం లేకపోయినా, ఎవరో లోపల నుండి ప్రోధ్బలం చేసినట్టు పాపం చేస్తుంటారు. మూడవ రకం కావాలని పాపం చేస్తుంటారు. మొదటి తరగతి వారు జీవన్ముక్తులు. రెండవ రకం వారు దైవ చింతన కలవారు. మూడవ రకం వారు పాపాత్ములు. అర్జునుడు ఇక్కడ ఈ రెండవ రకం వారిని గురించి అడుగుతున్నాడు. మానవులు మూడో తరగతిలో అస్సలు ప్రవేశించకూడదు. రెండవ తరగతి నుండి మొదటి తరగతి లోనికి ప్రవేశించడానికి ప్రయత్నించాలి. అలా కాకుండా మానవులు తాము పాపాలు చేస్తూ ఆ పాపాలను ఇతరుల మీదకు తోసేస్తుంటారు. ఎలా అంటే, చాలా మంది మానవులు ఇది శని ప్రభావం అండీ. ఏలిన నాటి శని నన్ను పట్టి పీడిస్తూ ఉంది అని శని మీదికి తోస్తారు. మరి కొంత మంది సాతాను నా నెత్తిమీద ఎక్కినాట్యం చేస్తున్నాడండీ అందుకని ఇలా జరిగింది అని కనపడని సాతాను మీదికి తోసిస్తారు. మరి కొంత మంది శనిపెద్దమ్మ, ఇనప గజ్జెల తల్లి నా నెత్తిమీద తాండవం చేస్తూ ఉందండీ అని అంటారు. కానీ పరమాత్మ మాత్రం శని అనలేదు. సాతాను అనలేదు. శనిపెద్దమ్మ అని అసలే అనలేదు. మనం చెడ్డ పనులు చేయడానికి పాపాలు చేయడానికి కారణం ఏమిటో క్రింది శ్లోకాలలో నిర్మొహమాటంగా వివరిస్తున్నాడు.
(రచన: శ్రీ మొదలి వెంకట సుబ్రహ్మణ్యం, రిటైర్డ్ రిజిస్ట్రార్, ఏ. పి. హైకోర్టు.)
P201
No comments:
Post a Comment