Saturday, November 1, 2025

 ఓం నమో భగవతే శ్రీ రమణాయ

   సన్నిధిలో ఒక పుస్తకం చదువబడుతున్నది. దానిలో ఈ ప్రపంచము, సుఖము కోసం సృష్టించబడినదా లేక దుఃఖము కొరకు సృష్టించబడినదా అన్న ప్రశ్న ఉన్నది. వెంటనే దానిమీద మహర్షి ఏమి వ్యాఖ్యానిస్తారో అని అందరూ వారి వైపు చూచారు.

     భక్తులందరినీ కలియ చూస్తూ మహర్షి ఇలా సెలవిచ్చారు........

    సృష్టి మంచిదీ కాదు, చెడ్డదీ కాదు. అది ఉన్నట్లే ఉన్నది. మానవుని మనస్సు దానిని తన కోణం నుంచి చూస్తూ తనకు అనుకూలమైనట్లు వ్యాఖ్యానిస్తుంది. 

   ఒక స్త్రీ స్త్రీ మాత్రమే. ఒక మనస్సు ఆమెను తల్లి అంటుంది. ఇంకొకటి చెల్లెలంటుంది. మరియొకటి పిన్నీ, అత్తా అంటుంది. మనుష్యులు స్త్రీలను ప్రేమిస్తారు, పాములను ద్వేషిస్తారు. రోడ్డు ప్రక్కన ఉన్న గడ్డి, రాళ్ళ పట్ల ఉదాసీనంగా ఉంటారు. ప్రపంచంలో ఉన్న దుఃఖాలన్నింటికీ ఈ సంబంధాలే కారణం. 

    సృష్టి ఒక రావిచెట్టు వంటిది. పక్షులు దాని పండ్లు తినడానికి వస్తూ ఉంటాయి. మనుష్యులు దాని నీడలో చల్లదనం కోసం వస్తారు. కాని కొంతమంది ఆ చెట్టుకు ఉరిపోసుకుని చచ్చిపోతారు. కాని ఆ చెట్టు వీటన్నింటితో ఏమీ సంబంధం లేకుండా, ఇవేమీ గుర్తించకుండా తనపాటికి తాను జీవిస్తూ ఉంటుంది. 

  మానవుడి మనస్సే కష్టాలను సృష్టించుకుని సహాయం కోసం అలమటిస్తూ ఉంటుంది. ఒక మనిషికి కష్టాలిచ్చి మరొకడికి సుఖాలీయటానికి భగవంతుడికి అంత పక్షపాతం ఉంటుందా? సృష్టిలో అన్నిటికీ చోటు ఉంటుంది. కాని ఒక క్షుథార్హుడి ప్రక్కనే రుచికరమైన తిండి ఉండగా దానివైపు చేయిజాపి ఆకలి తీర్చుకోకుండా ఉన్నట్లు.... సృష్టిలో ఉండే మంచివాటినీ, ఆరోగ్యకరమైన వాటినీ, సుందరమైనవాటినీ వదిలి పెట్టి ఊరకే దుఃఖిస్తూ ఉంటాడు. ఇది ఎవరి తప్పు, భగవంతునిదా, మానవునిదా? 

   కాని మనుష్యుల అదృష్టంకొద్దీ, భగవంతుడు అనంతదయాసాగరుడై మానవుడిని ఎన్నడూ వదలిపెట్టడు. ఎల్లప్పుడూ గురువులనూ, శాస్త్రాలనూ ఇచ్చి, క్రొత్త అవకాశాలను ఇచ్చి, మార్గం చూపించి తన తప్పులను తెలుసుకొనజేసి తుదకు శాశ్వతానందాన్ని ప్రసాదిస్తాడు.

    అందుకు అక్కడి భక్తులు "భగవాన్! ఈ ప్రాపంచిక సుఖాలు పనికిమాలినవనీ ఒకప్పుడు బాధాకరమనీ కూడా మాకు తెలుసును. కాని వాటిని వదల లేకుండా ఉన్నాము. వాటియందలి మా కోరికలను పోగొట్టుకొనుట ఎట్లా?" అని అన్నారు.

    అందుకు మహర్షి "భగవంతుని గూర్చి తలచుకోండి. బంధాలు క్రమంగా వాటియంతట అవే విచ్ఛిన్నమౌతాయి. కోరికలన్నీ పోయేవరకూ భక్తి ప్రార్థనాదులను వెనుకకు నెడితే, భగవంతుని కోసం మీరు చాలా చాలా కాలం వేచి ఉండవలసి వస్తుంది.

No comments:

Post a Comment