Saturday, November 1, 2025

 ఈరోజు *చందమామ చెప్పిన కథలు* పుస్తకానికి సురవరం ప్రతాపరెడ్డి *తెలుగు విశ్వవిద్యాలయ పురస్కారం* అందుకుంటున్న సందర్భంగా ప్రజాశక్తిలో పరిచయం రాసిన *అమ్మిన శ్రీనివాస్* గారికి ధన్యవాదాలు.
***********************
*ఆధునిక బాల సాహితీ హరివిల్లు డా.ఎం.హరికిషన్*
~~~~~~~~~~~~~~~~~~
   మౌఖిక జీవనదుల ద్వారా ఒక తరం నుంచి మరో తరానికి  ప్రవహిస్తూ ఆనందపు విజ్ఞానాలు పంచే కథల ఖజానా మన జానపద కథా సాహిత్యం, రాయలసీమకు చెందిన తెలుగు అధ్యాపకుడు, రచయిత డాక్టర్ ఎం హరి కిషన్ తన బోధనా వృత్తిలో భాగంగా స్థానిక జానపద కథాంశాలను తన శిష్యుల మాటల్లో దొరకబట్టి తనదైన బాణిలో ఆసక్తి, హాస్యాలను మేళవించి అందమైన జానపద కథలుగా మలిచి భావితరాలకు భద్రపరిచే పనిలో భాగంగా ఇప్పటికి 15 పిల్లలు చెప్పిన బాలల కథా సంపుటాలు వెలువరించడమే గాక, మరికొన్ని స్వీయ కథలతో సుమారు 50 బాలసాహితీ పుస్తకాలు ప్రచురించారు.
    తన కథల్లోని శైలిని, నిడివిని మార్చడానికి అస్సలు ఇష్టపడని ఈ బాలసాహితీవేత్త కథలు ఏ పత్రికల్లో ఎక్కడా కనిపించవు. కానీ పుస్తకాల రూపంలోనూ, ఆధునిక మాధ్యమాలైన ఫేస్బుక్, వాట్సప్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, తదితరాల ద్వారా సమూహాలు ఏర్పాటు చేసి వేలాదిమంది సభ్యులకు తన కథలను చేరవేయడమే కాదు, పుస్తకాల అమ్మకాలో కూడా ముందున్నారు.
పుస్తకాలు ముద్రించడం అంటే డబ్బు కోల్పోవడం, పుస్తకాలు పంచుకోవడమే అన్న చాలామంది రచయితల అనుభవాలను నిజం కాదని నిరూపించారు డాక్టర్ హరికిషన్.
 రచనల్లో విషయం ఉంటే పుస్తకాలు ఉచితంగా పంచుకోవలసిన పనిలేదని అందుకు పుస్తకాల ద్వారా తనకు వచ్చిన ఆదాయమే ఉదాహరణ అని ఆయన సగర్వంగా చెబుతారు.
   "వందరోజులు వందకథలు" పేరుతో హరికిషన్ ఏర్పాటుచేసిన వాట్సాప్ గ్రూపు తెలుగు బాలసాహిత్యంలోనే అతిపెద్ద కథల సమూహంగా చెప్పవచ్చు. ప్రపంచాన్ని కబళించిన కరోనాకాలంలో ఆవిర్భవించిన ఈ సమూహం, ఇంతింతై వటుడింతై అన్న విధంగా ఒక్క సమూహంగా ఏర్పడి సభ్యులు అసంఖ్యాకంగా చేరికతో ప్రస్తుతం 38 సమూహాలుగా విస్తరించింది. 30 వేల పైచిలుకు సభ్యులకు నిత్యం తెలుగు బాల సాహితీ మధురిమలను సరదా కథలు, సామెతలు, పొడుపు కథలు, గేయాలు, జానపద కథలు రూపంలో అందిస్తున్నారు.
   ప్రస్తుతం పత్రికల్లో వస్తున్న బాలసాహిత్యం 90% ఆరో తరగతి దాటిన పెద్ద పిల్లలకు, అందునా పఠన సామర్థ్యం అలవడిన పిల్లలకే చేరుతుంది తప్ప ఐదవ తరగతి లోపు చిన్నారులకు ఎంత మాత్రం ఉపయోగపడటం లేదనే భావంతో...
తెలుగు భాష అప్పుడప్పుడే నేర్చుకునే చిన్నారుల లేత మనసులను ఆకట్టుకునే సరళమైన బాలసాహిత్యం నేడు లేదు కనుక ఆ లేమిని భర్తీ చేసే పనిలో కృషి చేస్తున్నారు డాక్టర్ హరికిషన్.
   రెండు దశాబ్దాలుగా ప్రౌఢ బాలసాహిత్యాల్లో సవ్యసాచిగా సాహితీ కృషి చేస్తున్న హరికిషన్... నంద్యాల దగ్గరి పాణ్యం లో 19మే 1972 న మాసుల్దార్ హుస్సేనయ్య - కృష్ణవేణమ్మ దంపతులకు జన్మించారు. "కేతు విశ్వనాథరెడ్డి కథలు సామాజిక దృక్పథం" అనే అంశంపై పరిశోధన చేసి డాక్టరేటు పొంది వృత్తిరీత్యా ప్రభుత్వ ఉన్నత పాఠశాల లో తెలుగు అధ్యాపకునిగా సేవలందిస్తున్నారు.
    స్థానిక స్థలాల చరిత్రలు, వ్యక్తుల జీవితాలు, భావితరాలకు ప్రేరణాత్మకంగా తెలియజేయాలి అనే సంకల్పంతో కర్నూలు జిల్లా చరిత్ర, కొండారెడ్డి బురుజు, కర్నూలు జిల్లా మహనీయులు, అనే పేర్లతో అపురూపమైన చిత్రాలు పొందుపరిచి స్థానిక చరిత్రలను బాలసాహిత్యంగా తీర్చిదిద్ది వేలాది పాఠకుల ఆదరణ పొందిన హరికిషన్ బాలసాహితీ కృషి అందరికీ ఆదర్శనీయం.
    ఒకటి తిందునా రెండు తిందునా, నాకు మూడు నీకు రెండు, నలుగురు మూర్ఖులు, చిలుక ముక్కు ఊడిపాయ, వంటి జానపద కథల సంపుటాలతో పాటు నల్ల కుక్క ఠింగుబిళ్ళ, తిండిపోతు దయ్యం, దెబ్బకు ఏడు మంది, వంటి సాధారణ కథా సంపుటాలు. మెరుపుల వాన, తేనె చినుకులు, రేపటి వెలుగులు, వంటి బాలగేయ సంపుటాలు మిన్ను, చిన్ని- మిన్ను, యువరాణి లాస్య, వంటి బాలల నవలలతో పాటు బొమ్మలతో సామెతలు రెండు భాగాలుగా వెలువరించిన హరికిషన్ కథల లక్ష్యం అంతా ప్రాథమిక విద్యార్థులపైనే..!!
   అందుకే ఆయన కథల్లో కొన్ని ద్విత్వాక్షరాలు, సంయుక్తాక్షరాలు, లేనివిగా ఉండి భాషా ప్రయోగాలు చేసి పిల్లల్లో భాష పట్ల ఆసక్తి కలిగిస్తాయి.
    నిత్యం సాహితీ కృషితో పరోపకారం చేస్తున్న సంతృప్తితో సాగుతున్న ఈ ఆధునిక బాలసాహితీ ధీరుడు హరికిషన్ రాసిన సంయుక్తాక్షరాలు లేని బాలల కథా సంపుటి "చందమామ చెప్పిన కథలు" కు సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం తెలుగు బాలసాహిత్యానికి ప్రతిష్టాత్మకంగా ఇచ్చే పురస్కారం 2023 సంవత్సరంకు గాను లభించింది. తద్వారా ఆయన రెండు దశాబ్దాల బాలసాహితీ కృషికి నిండుదనం చేకూరింది.
  తెలుగు విశ్వవిద్యాలయ బాల సాహితీ పురస్కారం పొందిన ఈ కథా సంపుటిలో మొత్తం 25 కథలు ఉన్నాయి. "నా మాటకు తిరుగులేదు.. పో" తో మొదలు "మనది కానిది మనకెందుకు" వరకు సాగిన ఈ కథల పయనంలోని ప్రతి కథ చక్కిలిగిలి పెడుతూ నవ్విస్తూ ఆలోచింపజేస్తూ... యుక్తిదాయకంగా ఉండి చిన్నారుల చిట్టి బుర్రలకు ఎంచక్కని సందేశాన్ని ఇస్తుంది.
    పెద్దల మాట విన్నవారికి అంతా మంచే జరుగుతుంది మనం చేసే పరోపకారం మనలను నిత్యం కాపాడుతుంది అనే నిండు నిజాలను ఆవిష్కరించిన "నా మాటకు తిరుగులేదు.. పో" కథలో నిరుపేద యువకుడు తనకు గల పరోపకార గుణంతో ఆ రాజ్యపు రాజు మనసు గెలుచుకొని అతని కూతురుని వివాహం చేసుకున్న తీరు రచయిత ఇందులో ఆసక్తిగా అక్షరీకరించారు. 
   బల్లిని నక్క హేళన చేసి చివరికి దాని చేతిలో ఎలా ఓడిపోయిందో తెలిపే "ఎవరి గొప్ప వాళ్ళదే" కథ  సృష్టిలోని అందరూ సమానమే కానీ ఒకరు ఎక్కువ మరొకరు తక్కువ అనే అసమానతా భావం ఎంత ప్రమాదమో కళ్ళకు కట్టింది.
    ఐకమత్యం ద్వారా కలిగే లాభం గురించి చెబుతూ చెప్పుడు మాటల మోజులో పడి తగవులు పెట్టుకుని స్నేహాలు ఎలా చెడగొట్టుకుంటున్నరో.! అనే విషయాన్ని ఆవిష్కరించిన మంచి సందేశాత్మక కథ "బుర్ర లేని పుంజులు". రెండు కోడిపుంజుల మధ్య తగాదాపెట్టి అవి పోట్లాడి చనిపోయాక వాటిని ఆహారంగా తిన్న పిల్లి దుష్ట బుద్ధిని వివరిస్తూ ఇలాంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిక చేసిన మంచి కథ ఇది. ఇదే కోవకు చెందిన మరో మంచికథ "పావురం చేసిన రెక్కలు". పావురం తన పిల్లలను తింటున్న పిల్లికి తెలివితో ఎలా బుద్ధి చెప్పి దానిని చంపి తన పిల్లల ప్రాణాలు కాపాడుకుందో ఈ యుక్తిదాయక కథలో మనం ఆసక్తిగా చదవవచ్చు.
    తెలివంటే నీదేమామా, తల్లిని కాపాడిన పిల్లలు, కుందేలు కొబ్బరికాయలు, వంటి కథలు పేర్లతో పాటు కథల్లో కూడా ఆసక్తిని కలిగి ఉండి ఆబాలగోపాలన్నీ అలరిస్తాయి. ఈ సరళభాష బాల సాహితీవేత్త కథా సంపుటికి విశ్వవిద్యాలయ స్థాయి పురస్కారం లభించటం తెలుగు బాల సాహిత్యానికి పండుగ రోజు.
[29 అక్టోబర్ 2025న తెలుగు విశ్వవిద్యాలయ బాల సాహితీ పురస్కారం పుచ్చుకోపోతున్న సందర్భంగా....]
    డా:అమ్మిన శ్రీనివాస రాజు 
   సెల్:77298 83223.
________________

No comments:

Post a Comment