కురుక్షేత్ర యుద్ధంలో ద్రోణుడు తన కుమారుడు చిరంజీవి అని తెలిసి కూడా అశ్వద్ధామ హతః కుంజరః అని ధర్మరాజు పలికితే ఎలా విశ్వసించాడు?
గొప్ప అప్రియం వింటే అస్త్ర సన్యాసం చేస్తాను.
అప్పటివరకూ యుద్ధం చేస్తాను అని చెప్పాడు ద్రోణుడు.
ఆయన భీష్ముడి లాగా తన మరణ రహస్యం చెప్పలేదు.
కొడుకు చావు అశౌచకరం.. మంత్రాలు (అస్త్రాలు ) అశుచిగా పలకగూడదు. ఆ ధర్మం ఆయన పాటించి అస్త్ర సన్యాసం చేశాడు అని అనుకోవచ్చు. ఆయన బ్రాహ్మణుడు. ఆయన పెట్టుకొన్న నియమం మంత్రం పైన గౌరవంతో తానుగా ఏర్పరచుకొన్నది కావచ్చు.
యుద్ధమూ ఒక యజ్ఞమే.. యజ్ఞదీక్ష కంకణవిసర్జనతోగానీ పూర్తికాదు. యుద్ధంలో ఎవరెవరో ప్రతిక్షణమూ మరణిస్తూనే ఉంటారు . ఆ దీక్ష ఉత్సర్జనం చేసే వరకూ అశౌచం అంటదు.
కానీ తండ్రి కొడుకుల విషయం వేరే…
భీష్ముడు శంతనుడికి పితృకార్యం చేస్తూ , అశౌచదీక్షలో ఉన్నపుడు ఒక శత్రురాజు సత్యవతిని తనకివ్వాలి — లేకుంటే యుద్ధానికి కాచుకో—అన్నాడట.. .అపుడు ఏవో సంధివాక్యాలతో కాలం నెట్టమని భీష్ముడు తన మంత్రులకు చెప్పి , ఈ అశౌచదీక్షా సమయం తీరగానే వాడి తాట వలిచాడట .
ఇక్కడ ద్రోణుడు ఒక బ్రాహ్మణుడుగా తాను యుద్ధంలో పాల్గొనడం తన అవాంతర విధిగా తలపబట్టి ఆ నియమం (దుర్వార్తా శ్రవణంతో దీక్షావిరమణం) పెట్టుకొని ఉండవచ్చు.
ఇప్పటికీ ఏ దుర్వార్త ఎవరి మరణమైనా/ తమకు ఏ సంబంధం లేని వాళ్ళుపోయినా , వార్త వింటేనే సచేలస్నానం —( అంటే కట్టుబట్టలతోనే ఇంటి బయటే స్నానం) చేసి , ఇంటిలోపలికి వెళ్ళే ఆచారం ఉంది . ఆ ద్వాపరయుగంలో ఇలాంటి ఆచారాల పాటింపు చాలా మందిలో ఉండింది అనుకోవచ్చు.
అందుచేత పాండవులు దుర్వార్త చెవిని వేసి , ఆయన అడ్డు తొలగించుకోవడం జరిగింది అని చెప్పవచ్చు.
అశ్వత్థామ చిరంజీవి అని ద్రోణుడు ఎరిగిన విషయం కాదు.
అశ్వత్థామ కృష్ణ శాపం వల్ల 3000 సంవత్సరాలపాటు
రోగగ్రస్త చిరజీవనం పొందాడు గానీ , చిరంజీవ చిరంజీవ సుఖీభవ సుఖీభవ ! —అని పెద్దల శుభాశీస్సులు పొందిన పుణ్యజీవనం కాదు.
No comments:
Post a Comment