Saturday, November 1, 2025

 🔥అంతర్యామి 🔥
# మహనీయులు...

☘️చరాచర జగత్తులోని జీవులన్నిటా ఉత్కృష్టమైంది. మానవ జన్మ. మనిషి అమితమైన మేధాశక్తిని, ఆలోచనతో కూడిన అనురక్తిని, ప్రగతి సాధించేందుకు కావాల్సిన అభివ్యక్తినీ సమృద్ధిగా కలిగినవాడు. ఆ సామర్థ్యాలను సద్వినియోగం చేసుకుంటూ ఒకరి మేలు కోసమో, జాతి పురోగతి కోసమో, భాషా సంస్కృతుల కోసమో నిస్వార్థంగా కృషి చేసేవారి జీవితాలే సార్థకమవుతాయి. అలాంటి వారికి ముసలితనమూ, మరణమూ ఎన్నటికీ లేవని, భువిలో అమరులనీ అంటాడు భర్తృహరి.

☘️మనిషి తన సంసారాభివృద్ధిని చూసుకోవడంలో ప్రత్యేకత ఏమీ లేదు. దాన్ని దాటి సార్ధకమైన జీవితాన్ని గడపగలిగినవాడే ధన్యుడు. అంటే-నలుగురికీ ఉపయోగపడేలా కొన్ని పనులు చేయగలగడం, ఎంతో కొంత సమాజానికి మేలు చేయడం. మనం చేసిన పనివల్ల కొంతమంది సుఖంగా సంతోషంగా ఉన్నారంటే, అంతకన్నా కావాల్సింది ఏదీలేదు కదా! మనిషి తనకోసం, తన కుటుంబ సభ్యుల సుఖం కోసం కాకుండా, సమాజ సంక్షేమం కోసం కృషి చేస్తే జనహితం, పరహితం చేకూరుతుంది. ప్రతిఫలం ఆశించకుండా ఇంకొకరికి మేలు చేయడమే పరహితం. 

☘️ఎదిరికెప్పుడు చేయు హితమెల్ల తనదనుచు చదివి చెప్పనియట్టి చదువేలా..... అంటాడు పద కవితా పితామహుడు అన్నమయ్య. అంటే, ఎదుటివాడికి విరివిగా సాయం చేసినవాడే నిజమైన విద్యావంతుడని అర్థం.

☘️మన కుటుంబ శ్రేయస్సు చూసుకుని, ఎవరికీ ఎటువంటి సాయమూ చేయకుండా జీవితాంతం గడిపేస్తే, మన బతుకుకూ ఎందుకూ పనికిరాని గడ్డిపువ్వుకీ ఎటువంటి భేదమూ ఉండదు. స్వార్థమే సర్వమని తలచేవారు నిరంతరం అంతులేని చింతలతో, ఇంకా సంపాదన పెంచుకోవాలనే ఆందోళనలతో సతమతమవుతుంటారు.
కూడగట్టుకోవటమే పరమావధిగా బతుకుతారు. అలా కాకుండా గుబాళించే మల్లెపువ్వులా మనలో మానవత్వం పరిమళిస్తేనే, జీవితం సార్థకమవుతుంది.

☘️పరహితమన్నదే ఆలంబనగా జీవించిన మహనీయులెందరో మనకు చరిత్రలో తారసపడతారు. అటువంటి పరోపకార గుణ సంపన్నులను సూక్తి సుధాకరం 'మనుజకోటిలో ఉత్తములైన సాధు చరితులు' అని నిర్వచిస్తుంది.

☘️ఈ విధమైన సుగుణ సంపత్తితో శోభించేవారిని దైవీగుణాలు కలవారని కృష్ణ భగవానుడు పేర్కొన్నాడు. దేశ దాస్య శృంఖలాలను తొలగించడానికి పాటుపడిన స్వాతంత్య్ర సమరయోధులు, సరికొత్త ఆవిష్కరణలతో జన శ్రేయస్సుకు నూతన బాటలు వేసే శాస్త్రవేత్తలు, నిస్వార్థంగా ప్రజాసేవ చేసే వ్యక్తులు అందరి జీవితాలూ సార్థకమైనవే ప్రతి దేశానికీ విలక్షణమై రీతిలో భాషా సంస్కృతులు పట్టుగొమ్మలుగా ఉంటాయి. వాటి అభివృద్ధికోసం పాటు పడేవారిదే సిసలైన జీవనం అన్నాడు శ్రీకృష్ణదేవరాయలు. సంస్కృతీ వికాసం లేని రాజ్యాలు, సిరులు వ్యర్థమన్నాడు. ఆంధ్రభోజుడు. అలాంటి భాషా సంస్కృతుల సంరక్షణకు అంకితమైన వారు ప్రాతఃస్మరణీయులే.

☘️మన గురించి ప్రత్యేకంగా ఏదన్నా చెప్పుకోవాలంటే, అది పరుల అభివృద్ధిని కోరి చేసిన మేలు అయివుండాలి. జీవితంలో నిజమైన ఆనందమంటే ఒకరికి చేసే సాయం వల్లనే లభిస్తుంది. అందుకే. అలాంటి మనుషులే మహానుభావులు. ఉన్నత ప్రమాణాలతో ఆదర్శాలను పాదుకొలిపే పరమ పావనులు!🙏

✍️- వెంకట్ గరికపాటి

🌺 శ్రీ రామ జయ రామ జయ జయ రామ 🌺

No comments:

Post a Comment