Saturday, November 1, 2025

 🔥అంతర్యామి 🔥
# కర్మ మార్గం...

☘️చాలామంది సత్యాన్వేషణ చేస్తారు కానీ, తామే  సత్యమని గ్రహించలేరు. అసలు సత్యమంటే ఏంట అనేది తెలుసుకోవడానికి ప్రయత్నించరు. సత్యవ్రతం మోక్ష సోపానమనుకుంటారు. సత్కర్మలు చేయాలనుకోరు. సత్యమనేది పుణ్యకర్మ కావచ్చు. కానీ సత్కర్మ కాదు. జ్ఞానంతో కూడినదే సత్కర్మ. ఎవరు దేవుడు అనేది ఎవరికి వారు జ్ఞానంతో తెలుసుకోవాలి. కర్మకాండలు చేస్తూ సత్యపథంలో ఉన్నామనుకునేవారు తమలోని దైవాన్ని దర్శించుకోవాలి.

☘️కర్మమార్గంలో కొన్ని క్లిష్టతలు ఉన్నాయి. కర్మలు చేసినా ఫలితం ఆశించవద్దన్నది గీతాకారుడి వ్యాక్యా కర్మలలో అనేక అనర్థాలు ఎదురవుతాయి. మరి శ్రేయోదాయక కర్మలు ఏంటీ అనే సందేహానికి కూడా పరమాత్మ సమాధానం ఇచ్చాడు. జీవులు కర్మకు బద్దులవుతారు. జ్ఞానంతో ముక్తులవుతారు. ఇది తెలుసుకుంటే కర్మ మార్గం ఫలవంతమవుతుంది. కర్మ చేసే క్రమంలో 'వ్యక్తిత్వాన్ని' మరచిపోవటం తగదు. మంచి, చెడు అనేవి మనసులో ఉండే భావనలంటారు మనస్తత్వవేత్తలు. వీటిననుసరించే చేసే కర్మ ఉంటుంది. రావణుడు, రాముడు, దుర్యోధనుడు, ధర్మరాజు ఇందుకు గొప్ప ఉదాహరణలు. వారిని పురాణ పురుషులుగా కాకుండా మానవ స్వరూపాలుగా గ్రహించగలిగితే 'కర్మతత్వం' అవగతమవుతుంది. 'నేను ఏదో ఒకనాటికి మరణించాల్సిందే'నని రోజూ ఓ అయిదు నిమిషాలు ఆలోచించుకుంటే సత్కర్మలే చేయాలని మనసవుతుంది. అలా అద్భుతాలు సాధించవచ్చు.

☘️కర్మకాండల్లో మునిగి తేలుతున్న జిజ్ఞాసువులు మోక్షానికి దూరమవుతున్నారని తలచిన శివుడు వారికి దిశానిర్దేశం చేయాలనుకున్నాడు. సాధారణ మనిషి రూపంలో వారిమధ్య అవతరించాడు. ఆయన ముగ్ధ మనోహర రూపాన్ని చూసిన రుషిపత్నులు ఆయనను అభిమానించసాగారు. ఎంతో తపశ్శక్తి కల రుషులు సత్యాన్ని తెలుసుకోలేకపోయారు. ఈ పాపాత్ముడు రుషిపత్నులను అపహరించటానికి వచ్చాడనుకున్నారు. ఎవరి కోసం సుదీర్ఘకాలం 'నమో హిరణ్య బాహవే సేనాన్యే దిశాంచపతయే...' అని ప్రార్థిస్తున్నారో స్వయంగా ఆయనే దిగి వస్తే గ్రహించలేకపోయారు. ఒక ఏనుగును, పులిని సృష్టించారు. పోయి అతణ్ని సంహరించమని చెప్పారు. పరమశివుడు వాటిని వధించి ఏనుగు చర్మాన్ని, పులి చర్మాన్ని ధరించాడని శివపురాణం చెప్పిన కథ. ఇది తెలుసుకున్న రుషులకు మోక్ష మార్గమేమిటో శివుడు నిజస్వరూపంతో బోధించాడు....

☘️సత్కర్మలో- 'కర్మకింపరం, కర్మతత్ జడం'- కర్మజడం. జడాన్ని కదిపే కర్త 'నేను కాదు' భగవంతుడని గుర్తుంచుకోవాలి. ఆ దేవుడి కోసం చేసే మంచి అంతా అన్నార్తుల కోసం చేయాలి. అదే సత్కర్మ. పక్షికి నాలుగు గింజలు, చెట్టుకు ఇన్ని నీళ్లు పోయడమూ ఈ కోవకు చెందుతాయి. కానీ దైవ సేవ పేరిట కోట్లు ఖర్చు చేస్తున్నవారు ఈ చిన్ని జీవన సూత్రాన్ని గ్రహించలేకపోవటమే చిత్రం. స్వలాభాపేక్షతో చేసే కర్మలు సత్కర్మలు కావు. పైగా 'అటువంటి కర్మల నుంచి ఎన్నటికి విముక్తులు కాలేరు' అంటారు రమణ మహర్షి. ఎవరైతే సత్కర్మ భగవంతుడి కోసమే చేస్తారో అటువంటివారికి దుఃఖమే లేదు. అంతా సంతోషమే.🙏
✍️- భమిడిపాటి గౌరీశంకర్

No comments:

Post a Comment