మీలోనూ ఓ హనుమంతుడు!
జీవితంలో ప్రతి మనిషికీ ఒక లక్ష్యం ఉండాలి. అదే లేకపోతే మన ప్రస్థానం దిక్కుతెలియని పడవలా అయిపోతుంది. లక్ష్యసాధన అంటే గమ్యాన్ని చేరుకోవడానికి మనం చేసే ప్రయాణం, పడే శ్రమ. లక్ష్యం స్థిరంగా ఉండాలి. సాధన దృఢంగా ఉండాలి. అప్పుడే లక్ష్యాన్ని చేరుకోగలం.
ద్రోణాచార్యుడు తన శిష్యులకు ఒక పరీక్ష పెడతాడు. ఒక పెద్ద చెట్టు పైన చిట్టచివరి కొమ్మల్లో ఒక పక్షి కూర్చుని ఉంది. దాని కంటిని బాణంతో కొట్టాలన్నది పరీక్ష. ముందుగా ధర్మరాజు వచ్చాడు. చెట్టుమీద ఏం కనిపిస్తోందని అడిగాడు ద్రోణుడు. 'చెట్టు, చెట్టుమీద పక్షి, ఆకాశం, పక్షికి చుట్టూ ఆకులు ఉన్నాయి' అన్నాడు యుదిష్ఠిరుడు. సరే... నువ్వు వెనక్కి వెళ్లు అని చెప్పి భీముణ్ని పిలిచి అదే ప్రశ్న అడిగాడు. చెట్టు, కొమ్మలు, పక్షి, ఆకాశం... చెప్పాడు భీముడు. ఇలా అందరూ అదే సమాధానం చెప్పడం, గురువు వాళ్లను తిప్పి పంపడం జరిగింది. చివరికి అర్జునుణ్ని పిలిచి అందర్నీ అడిగిన ప్రశ్నే అతణ్ని అడిగాడు. అర్జునుడు నిశ్చలంగా 'నాకు కేవలం పక్షి కన్నే కనబడుతోంది. ఇంకేం కనబడటంలేదు అని చెప్పాడు. ద్రోణాచార్యుడు చిరునవ్వుతో 'బాణం వెయ్యి అర్జునా' అన్నాడు. మరుక్షణం అర్జునుడి ధనుస్సులోంచి బాణం దూసుకు పోయింది. పక్షి నేలకూలింది.
అక్కడ లక్ష్యం పక్షి కన్ను కొట్టడం. అంటే మనకు అదే కనబడాలి తప్ప ఇంకేవీ కనిపించకూడదు. అంత స్థిరమైన దృష్టి కోణం ఏర్పరచుకున్నప్పుడే ఎవర మైనా లక్ష్యాన్ని చేరుకోగలుగుతాం. సీత్తు అర్జునుడి లక్ష్యం పక్షి కన్ను లాగా మనకీ మన లక్ష్యం ఏంటో కచ్చితంగా తెలియాలి. దాని పైనే దృష్టి నిలపాలి. లక్ష్యసాధనకు కావాల్సింది స్పష్టమైన దృష్టి, ఏకాగ్రత. లక్ష్యం చిన్నదైనా, పెద్దదైనా... దాన్ని చేరాలంటే మనసు, శక్తి, శ్రద్ధ అన్నీ ఒకే బిందువులో కలిసి ఉండాలి. అడ్డంకులను అధిగమించాలే కానీ లక్ష్యం నుంచి వెనక్కి మళ్లకూడదు.
రామరావణ యుద్ధంలో లక్ష్మణుడు గాయపడ్డాడు. వైద్యుడు సుషేణుడు వచ్చి చూసి హిమాలయాల్లో ఉన్న సంజీవనిని తెస్తేనే లక్ష్మణుడి ప్రాణాలు నిలబడతాయని చెప్పాడు. హనుమంతుడు ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా హిమాలయాలకు దూసుకెళ్లాడు. అక్కడ సంజీవని ఏదో తెలియలేదు. అందుకని ఆయన తల పట్టుకుని కూర్చోలేదు. ఏ చెట్టో తెలియదు కాబట్టి మొత్తంగా పర్వతాన్నే పెకిలించుకు తీసుకెళ్లాడు. లక్ష్మణుడి ప్రాణాలను కాపాడాడు. నిత్యజీవితంలో మనకూ ఎన్నో సవాళ్లు ఎదురవుతుంటాయి. వాటికి వెరచి వెనక్కి తగ్గవద్దని చెబుతుంది హనుమంతుడి దివ్యగాథ. ఆనాడే కాదు, ఈనాడైనా లక్ష్యసాధనకు పట్టుదలే ప్రధానం.
అవసరమైతే పర్వతాన్నే మోయగల శక్తి మనలోని సంకల్పానికి ఉంటుంది! హనుమంతుడు మనలోనూ ఉన్నాడు. ఆ సత్యం తెలుసుకుని లక్ష్యాన్ని నిర్దేశించుకుని, దానివైపు బలంగా అడుగేసినప్పుడు ఆయన బయటపడతాడు.
మావూరు విజయలక్ష్మి
No comments:
Post a Comment