Thursday, November 20, 2025

 మనసుకు ప్రశాంతత ఎలా లభిస్తుంది?
ఎన్ని పుస్తకాలు చదివినా, ఎన్ని బోధలు విన్నా మనుషులకు జీవితంలో ఏదో విషయం తొలుస్తూ ఉంటుంది. ఏదో లోపం బాధ పెడుతూనే ఉంటుంది దాంతో మనిషి మానసిక ప్రశాంతత కోల్పోతాడు. దీనికి ఎవరూ అతీతులు కాదు.

పెద్ద అధికారం లోనో, లేక ఎక్కువ ధనం వున్నవాళ్ళ వైభవం చూసి వారు చాలా సుఖ పడుతున్నారనీ, వారి జీవితం అంతా పూల పానుపు అని భ్రాంతి పడి, అవి తనకు లేవని చింతపడి శాంతి కోల్పోతాడు. అయినా తనకంటే క్రిందవారిని బాధల్లో వున్నవారిని చూసి తన పనే నయం కదా అని తృప్తి పడితే ప్రశాంతంగా ఉంటాడు.

ఇక డబ్బు, అధికారం వున్నవాడు తనకు ఎవరో గౌరవం ఇవ్వలేదని, మర్యాద చేయలేదని బాధ పడుతుంటాడు. అవతల వారు ఏ మాత్రం లక్ష్యపెట్టకపోయినా కసి పెంచుకొని అవకాశం కోసం చూస్తుంటాడు. ఇక్కడ కూడా ప్రశాంతత పోతుంది. . వారికి తాను ఏమన్నా ఉపకారం చేశాడా అని ఆలోచన చేసుకోవాలి.

ఎవరికైనా తన ఆప్తులు, సంతానం బాధపడినా రోగాలబారిన పడినా ఆశాంతికి, శోకానికి గురి అవుతారు . ఇది ఎవరికైనా తప్పదు. అలాంటి సమయాల్లో బంధు మిత్రులు ఇచ్చే ధైర్య వచనాలకు కొద్దిగా స్వాంత పడతారు. అందుకనే వందమంది ముఖ పరిచయం కంటే ఒక్క ఆప్త మిత్రుడు అయినా ఉండాలి. తాను కూడా వారి కష్టాల్లో చేతనయిన సాయం చేయాలి. ఒకే వైపు సహాయాలు కోరుకొంటే మైత్రి నిలవదు.

మనలోనూ, మన చూట్టూ వున్న బంధు మిత్రుల్లో అనేక లోపాలు ఉండచ్చు. వారు మనకు సరిగ్గా రెస్పాండ్ అవ్వలేక పోవచ్చు. అంత మాత్రాన వారిని దూరం చేసుకోకూడదు.

ఆ సమయం లో మనం కోపానికి, విరక్తికి లోనుకాకుండా శాంతం వహిస్తే మనం సౌఖ్యంగా ఉంటాము. మనం ఎవ్వరినీ జడ్జ్ చేయకుండా వుంటే చాలా సమస్యలు దూరం అవుతాయి.

అలా అని వెర్రి వెంగళప్ప లాగా అన్నిటినీ సహించ కూడదు. మనకు న్యాయంగా రావాల్సిన వాటి గురించి పోరాడవలసిందే.

ఏదైనా మనిషి జన్మ కు ఏదో రూపం లో బాధలు తప్పవు. కొంతమంది బయటకు చెప్తారు. మరి కొందరు లోలోపల కుళ్ళి పోతారు.

తనకున్న బడ్జెట్ పరిమితులను చూసుకొని ఖర్చులు చేసుకొంటూ, ఆరోగ్యాన్ని జాగ్రత్త వహిస్తే కొంత ప్రశాంతంగా ఉండచ్చు.
అన్నిటికంటే ఎక్కువగా నిత్యం దైవ నామ స్మరణ చేస్తూ మనసును ప్రశాంతంగా ఉంచుకోవచ్చు

No comments:

Post a Comment