Monday, December 1, 2025

 అహో సైకత లింగేన 
భ్రష్టా మే తామ్ర భాజనం గతాను గతికోలోకః న లోకః పారమార్థికః||



భావం 

"అయ్యో ఈ ఇసుక లింగం వల్ల నా రాగి చెంబు పోయింది కదా! లోకంలో జనులు ముందువారు ఏదిచేస్తే అదే చేస్తారు కాని, ఆ పనిలోని పరమార్థాన్ని గ్రహించరు” అని శ్లోక భావం. దీనిని చిన్ని కథతో వివరిస్తాను.

 ఓ భక్తుడు పర్వదినంరోజు సముద్ర స్నానానికి వెళ్తాడు. అతని చేతిలో ఒక రాగి చెంబు  ఉంటుంది. అప్పటికి ఇంకా సముద్రస్నానానికి ఎవరు రాలేదు. 

స్నానానికి వెళ్ళే ముందు రాగి చెంబుని ఒడ్డున జాగర్తగా దాచాలనుకొంటాడు. అందుకని ఇసుకలో చిన్నగొయ్యి చేసి ఆ చెంబుని గోతిలో పెట్టి, గుర్తుగా ఇసుకని కుప్పలాగా పోగుచేస్తాడు. ఆ ఇసుక కుప్ప దూరానికి ఒక లింగాకారంలో కనపడుతుంది. తను స్నానం చేసేటప్పుడు ఆ చెంబు ఇంక ఎవరు దొంగలించలేరని అనుకొని సముద్రం లోకి స్నానానికి వెళతాడు. 

కాని ఇంకో ఇద్దరు సముద్ర స్నానానికి వస్తూ దూరంనుంచి మొదటి వాడు ఇసుకని కుప్పలా చేయడం చూస్తారు. చెంబు దాచుకోడానికి అలా చేసాడని గ్రహించక, సముద్ర స్నానానికి వెళ్లేముందు ఇసుకని శివలింగంలా చేసి సముద్రస్నానం చేస్తే మరింత పుణ్యం వస్తుంది,అదే ఆచారం అనుకొని మొదటికుప్ప ప్రక్కనే వాళ్ళిద్దరూ మరోరెండు కుప్పలుచేసి స్నానానికి వెళతారు. 

దూరంనుంచి వచ్చే మరోనలుగురు వీరు చేసినదానిని చూసి వాటి ప్రక్కనే మరోనాలుగు శివ లింగాలు చేస్తారు. ఇలా సముద్ర స్నానానికి వచ్చే ప్రతి ఒక్కరు ముందు వారిని చూసి “ఈ పర్వదినాన ఇసుకని శివలింగంగా చేసి సముద్రస్నానం చేయాలి” అనుకొని అలాగేచేస్తారు. ఇలా వందల సంఖ్యలో ఆ సముద్రపు ఒడ్డున శివలింగాలు ఏర్పడుతాయి. 

మొదటి భక్తుడు స్నానం చేసి ఒడ్డుకి వచ్చి చూసి ఆశ్చర్యపోయి!, అన్ని శివలింగాలలో తన చెంబు కోసం గుర్తుగాచేసిన ఇసుక కుప్ప ఎక్కడ ఉందో తెలుసుకోలేక, తన రాగి చెంబు పోయినందుకు బాధపడుతూ "నేను చేసిందే చూసి చేసేరు కాని ఎందుకు చేసానో అందలి పరమార్థం ఏమిటో తెలుసుకో లేకపోయారు” అని “గతాను గతికోలోకః న లోకః పారమార్ధికః” అనుకొంటూ వెళ్ళి పోతాడు.” 

పై చాటు శ్లోకం రావడానికి ఇంతటి రసవత్తరమైన సన్నివేశం జరిగింది.

- సురవరపు నాగేంద్రశర్మ

No comments:

Post a Comment