*వైదిక_వాఙ్మయం*
*త్రిమతాలు:*
*ద్వైత, అద్వైత, విశిష్టాద్వైతాలు.*
ద్వైత సిద్ధాంతము:
జగద్గురు శ్రీమధ్వాచార్యులు (ఆనంద తీర్థులు) ప్రవచించిన సిద్ధాంతం ద్వైత సిద్ధాంతము. జీవాత్మ వేరు, పరమాత్మ వేరు అని విశ్వసించే ఒక వైదిక/ వైష్ణవ మతం. హరి సర్వోత్తముడనీ, జగత్తు సత్యమనీ, జీవ సముదాయం యావత్తు భేదమయమనీ ద్వైతులు విశ్వసిస్తారు. హరి సర్వ స్వతంత్రుడనీ, సమస్తజీవులు ఆయనకు దాసులనీ, హరిభక్తి మోక్ష దాయకమనీ ద్వైత సిద్ధాంతం తెలియజేస్తుంది.
వ్యాసరాయ తీర్థులవారు ఒక శ్లోకంలో ద్వైత సిద్ధాంత సారాన్ని తెలియజేశారు.
‘‘శ్రీమన్ మధ్వమతే హరిః పరతరః సత్యం జగత్ తత్త్వతో భేదోజీవగణాః హరేరనుచరాః నీచోచ్ఛభావం గతాః ముక్తిః నైజ సుఖాను భూతిః అమలా భక్తిశ్చ తత్సాధనం హ్యక్షాది త్రితయం ప్రమాణమఖిలామ్నాయైక వేద్యో హరిః’’.
ప్రపంచం పంచభేదాలతో కూడినది. పంచభేద జ్ఞానం ముక్తికి దోహదం చేస్తుంది. జీవుడికీ పరమాత్మకు మధ్య, జీవుడికీ జీవుడికీ మధ్య, జీవుడికీ జడానికీ మధ్య, జడానికీ జడానికీ మధ్య భేదాన్ని తెలుసుకోవడమనే జ్ఞానమే పంచ భేద జ్ఞానం. సత్వ రజస్తమో గుణాలు జీవుడిని నడిపిస్తాయి. సత్వ గుణం మోక్ష సాధనకు యోగ్యత కలిగిస్తుంది. నైజ సుఖాను భూతి ముక్తి. దానిని పొందడానికి మార్గం భక్తి. ఆగమాల (వేదాల) ద్వారా దేవుణ్ణి తెలుసుకొనగలుగుతాం. ఈ జ్ఞానమే ద్వైత జ్ఞానం. మధ్వాచార్యులు (ఆనంద తీర్థులు) ప్రవచించిన సిద్ధాంతం కనుక దీనిని అను సరించేవారందరు మాధ్వులు.
విశిష్టాద్వైతం:
విశిష్టాద్వైతం వైదిక మతంలోని త్రివిధ విశ్వాసాలలో ఒకటి. మిగిలినవి అద్వైతం, ద్వైతం. విశిష్టాద్వైతం రామానుజుడికి పూర్వం నుంచి ఉన్నది. ఐతే, రామానుజుడు విశిష్టాద్వైతాన్ని బహుళ వ్యాప్తిలోకి తెచ్చాడు. తిరుమల - తిరుపతి దేవస్థానం 1985లో ప్రచురించిన ‘‘హిందూమత ప్రవేశిక’’ గ్రంథంలో డాక్టర్ కె.సేతురామేశ్వర దత్త విశిష్టాద్వైతం గురించి ఇలా వ్రాశారు : ‘‘విశిష్టాద్వైత మతంలో చిత్తు, అచిత్తు, ఈశ్వరుడు ఈ మువ్వురూ నిత్యులు. చిత్తు, అచిత్తు ఈశ్వరుని ప్రత్యేక గుణాలు (ధర్మాలు). ఈశ్వరునికి - ఈ ప్రకారాలు ఉన్నాయి. కాబట్టి ఆయనకు ‘ప్రకారి’ ఆని పేరు. దేని సహాయం వల్ల దాని ఆధారం తెలుస్తుందో దానికి ‘ప్రకారం’ అని పేరు. ప్రకారి లేకుండా ప్రకారం ఉండదు. కాబట్టి చిదచిత్ విశిష్టుడైన బ్రహ్మం ఒకడే. ప్రకారం ప్రకారి సహజంగా భిన్నమైనవి. కాబట్టి వాటి స్వభావంలో భేదం ఉన్నది. అచిత్తు శుద్ధ సత్త్వం, మిశ్రసత్త్వం, సత్త్వశూన్యమని మూడు విధాలు. శుద్ధ సత్త్వం స్వయం ప్రకాశమైనది. దీనికి పరమపదమని పేరు. కాలం సత్త్వ శూన్యం, కాని ఆకాశం వలె నిత్యం. మిశ్ర సత్త్వం సత్త్వ, రజస్, తమో గుణాలకు లోనై, ప్రకృతి, మహత్, అహంకారం, పంచ తన్మాత్రలు, ఇంద్రియాలు మొదలైన 24 తత్త్వాలుగా రూపొందుతుంది. జీవుల పురాతన కర్మను అనుసరించి అది జీవుల శరీరం, అహంకారం అవుతుంది. మమకార అజ్ఞానాల చేత దేహధారణ చేసిన జీవుల జనన మరణ పరంపరలకే సంసారమని పేరు. అవిద్య, కర్మల వలయంలో ఉన్న కొందరి పాపాలు వారి పుణ్యాల వల్ల నశిస్తాయి. వారు అప్పుడప్పుడు ముక్తికొరకు ఈశ్వరుని ప్రార్ధిస్తారు. ఈశ్వరానుగ్రహంతో లభించిన గురువు బోధనలతో శాస్త్రాలలోని సమ్యక్ జ్ఞానాన్ని పొందుతారు. నిత్య నైమిత్తిక కర్మలను- తమ దశను, స్థితిని అనుసరించి యథావిధిగా ఆచరిస్తూ శమం, దమం, తపస్సు, శౌచం, క్షమ, ఆర్జవం, భయం, అభయం, స్థానం, వివేకం, అహింస, దయ మొదలైన ఆధ్యాత్మిక గుణాలను సంపాదిస్తారు. ఈశ్వరుని శరణు పొంది భక్తి చేత శాస్త్రాన్ని మననం చేసికొంటూ, ఈశ్వర గుణాలను ధ్యానం చేస్తూ ఈశ్వర కృపతో అజ్ఞానాన్ని పోగొట్టుకొంటారు. వారు భక్తి యోగాన్ని అభ్యసించి దేహత్యాగ సమయంలో ప్రపత్తి వల్ల, ఈశ్వరానుగ్రహం వల్ల ముక్తిని పొందుతారు. కైవల్యం, ఈశ్వర ప్రాప్తి అని ముక్తి రెండు విధాలు. కైవల్యం అంటే ఆత్మ సాక్షాత్కారం వల్ల కలిగే ఆనందానుభవం. పరమ పదంలో ఈశ్వరుని చేరి ఈశ్వర స్వరూపాన్ని, శాశ్వతానందాన్ని అనుభవించడం మరొకవిధమైన ముక్తి. ఈశ్వరుడు పరమ పదంలో ప్రత్యేకమైన దివ్యమంగళ స్వరూపాన్ని కలిగి ఉంటాడు. ఆయన తన కృపకు పాత్రులైన తన ప్రియురాండ్రు శ్రీదేవి, భూదేవి, నీలాదేవుల తోనూ, నిత్య ముక్తులైన అనంత, గరుడ, విష్వక్సేనాది సూరులతోనూ, ముక్త జీవులతోనూ కలసి ఉంటాడు. ఇతర జీవులను కూడా కర్మవిముక్తులుగా చేసి వారిని తనతో సామ్యం కలవారినిగా చేస్తాడు. విశిష్టాద్వైత మతంలో విష్ణువు లేక నారాయణుడు లేక వాసుదేవుడు లేక వేంకటేశ్వరుడు పరబ్రహ్మ...’’ వావిళ్ళ సంస్థ 1931లో ప్రచురించిన శ్రీభగవద్గీతా మాహాత్మ్యం పీఠికలో శ్రీవావిళ్ళ వేంక టేశ్వరులు విశిష్టాద్వైతాన్ని ఇలా వివరించారు (ఆయన మాటల్లోనే) : ‘‘బ్రహ్మం నామరూప విభాగం చేయ శక్యంగాని సూక్ష్మచిదచిద్విశిష్ట చైతన్య రూపమైయుండి పిదప నామరూపవిభాగం గల స్థూల చిదచిద్విశిష్ట చైతన్యరూప మగుచున్నది. ఇట్లు సూక్ష్మ చిదచిద్వి శిష్టమునకును, స్థూల చిదచిద్వి శిష్టమునకును నైక్యము సిద్ధాంతిత మగుటచే దీనికి విశిష్టాద్వైతం అను పేరు, అన్వర్థ మగుచున్నది... ...
శ్రీమన్నారాయణుడే పర తత్త్వం, అతడు సర్వజ్ఞుడు, సర్వేశ్వరుడు, సర్వాంతర్యామి, ఆది మధ్యాంతరహితుడు. మాయ అనెడి ప్రకృతిని మూలంగాగొని జగత్తును ఇచ్ఛామాత్రమున సృజించువాడు. ఇట్టి నారాయణుడు తప్ప అన్య దేవతలను వైష్ణవుడారాధింపరాదు.’’
అద్వైతము:
ఇది స్మార్తమతము. ఇందు బ్రహ్మమని అవిద్యయని రెండుపదార్థములు కలవు. అందు బ్రహ్మము సత్యము, జ్ఞానానందాత్మకము, నిర్వికారము, నిరవయవము, నిత్యము, నిర్దోషము, విభువు. (సత్యము = కాలత్రయముచే బాధింపఁదగనిది. నిర్వికారము = రూపాంతరములు లేనిది. నిరవయవము = అవయవములు లేనిది. నిత్యము = కాలత్రయములయందు ఉండునది. విభువు = వ్యాపనము కలిగి ఉండునది.)
అవిద్య అపారమార్థికము, సదసద్విలక్షణము, జడము, సవికారము, సావయవము, అనాది సాంతము, అజ్ఞానరూపము. (అపారమార్థికము = మిథ్యా భూతము. బ్రహ్మతత్వజ్ఞానముచేత నివర్తించునది. ఇది వ్యావహారికసత్త అని చెప్పఁబడుచున్నది. వ్యవహారదశలో సత్తుగా తోఁచును కాని పరమార్థము కాదు. సదసద్విలక్షణము = సత్తనఁగా బ్రహ్మము, అసత్తనఁగా తుచ్ఛమయిన శశశృంగాది; పారమార్థికసత్తయిన బ్రహ్మముకంటెను ప్రమాణసిద్ధముగాని తుచ్ఛముకంటెను విలక్షణమైనది. బ్రహ్మమువలె పారమార్థికము కాదు, తుచ్ఛమువలె ప్రమాణములకు అవిషయమును కాదు.)
ఈయవిద్య సత్వరజస్తమోరూపగుణత్రయాత్మకము. దీనికి ఆచ్ఛాదకశక్తి, విక్షేపశక్తి అని రెండుశక్తులు ఉన్నవి. ఆచ్ఛాదకశక్తికల యవిద్యచేత ఆవరింపఁబడిన బ్రహ్మమునకు చీఁకటిలో ఉన్నమనుష్యునకువలె స్వస్వరూపజ్ఞానము చెడి విక్షేపరూపమయిన దేవతిర్యఙ్మనుష్యాది భేదజ్ఞానము కలుగుచున్నది. ఈదేవాదిభేదములు అన్నియు అవిద్యాపరిణామములుగాని పరమార్థములు కావు.
ఈచైతన్యరూపమయిన బ్రహ్మము శుద్ధ చైతన్యము, మాయావచ్ఛిన్న చైతన్యము, అంతఃకరణావచ్ఛిన్న చైతన్యము, వృత్త్యవచ్ఛిన్న చైతన్యము, విషయావచ్ఛిన్న చైతన్యము అని అయిదు భేదములుగలది. శుద్ధమైన బ్రహ్మస్వరూపమునకు ఈభేదములు అవిద్య మొదలుగాగల యుపాధులచేత కలుగుచున్నవి.
అందు శుద్ధచైతన్యము అనునది శుద్ధబ్రహ్మస్వరూపము.
మాయావచ్ఛిన్నచైతన్యము అనునది ఈశ్వరుఁడు. అతఁడె జగత్సృష్ట్యాదికర్త, సర్వాంతర్యామి, సగుణ బ్రహ్మము.
💫💫💫
*ద్వైతం, అద్వైతం, విశిష్టాద్వైతం ఈ మూడూ ఒకే సత్యాన్ని బోధిస్తాయి కదా! మూడెందుకు?*
🤔🤔
సత్యం ఒకటే అయినా దాన్ని సాధించడానికి దారులు చాలా ఉంటాయి. మనిషి యొక్క మనస్సు రకరకాల దారులు చూస్తూంటుంది. ఒకేదారి అందరికీ నచ్చదు. అందువల్ల ప్రముఖులయిన ఆచార్యులు అలా మూడు మార్గాలు
చూపించారు. మార్గాలు వేరయినా చేరిది ఒకచోటికే. అయితే అద్వైతం మాత్రం వేరే చేరడం అనేది లేదు. అదే నువ్వు అంటుంది. అయినా ఈ విషయం తెలియాలంట ఉపనిషత్తుల పాఠం చదవాలి.
*ద్వైతం, అద్వైతం అనగా ఎమి?*
ఆత్మ పరమాత్మ విడిగా ఉంటే ద్వైతం, భేదం లేదు అంటే అద్వైతం. ఈ రెండు ముక్కలూ అర్థం కావడానికి శంకరుల ప్రస్థాన త్రయం, మధ్వాచార్యుల వారి భాష్యములూ చదవాలి. ఈ జీవితం చాలదు అవి ఒంట బట్టడానికి. అయినా భగవద్గీత చదవండి. కొంత తెలిసినట్టు భ్రమ కలుగుతుంది.
భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ మూడు మార్గాలను నిర్దేశించాడు వాటినే పరంపరలో ఆచార్యులు మనకి ఉపదేశించారు. అరుణాచలం
No comments:
Post a Comment