Saturday, April 30, 2022

🌹 ఒక బౌద్ధ మహిళ (పటాసార) కథ 🌹

🌹 ఒక బౌద్ధ మహిళ కథ 🌹

🥀'సకల దుఃఖాలకూ హేతువు కోరికే!' అని బుద్ధభగవానుడు నొక్కివక్కాణించాడు. లోకం దుఃఖభూయిష్టమైనదని అరచేతిలో ఉసిరికాయలా కొట్టొచ్చినట్టు చూపించాడు. సమస్త దుఃఖాల నుండి విడివడటం కోసమూ, నిర్వాణం అని బౌద్ధం సూచించే ఉన్నతోన్నత స్థితి అయిన పరమానందమైన ముక్త స్థితి పొందడానికోసమూ పురుషులను స్త్రీలను వ్యత్యాసం లేకుండా సన్న్యాస జీవితాన్ని స్వీకరింపజేశాడు. బుద్ధుడు స్థాపించిన సన్న్యాస సంఘం ప్రపంచ చరిత్రలో సాటిలేనిదిగా భాసించింది.

🥀బుద్ధుని అనుగ్రహం పొందిన వేలాదిమంది జీవితంలో శ్రేయస్సును ప్రాప్తించుకోగలిగారు. వారిలో సన్న్యాస జీవనం స్వీకరించి, ఆరాధనీయులైన స్థాయిని చేరుకున్న మహిళలూ ఉన్నారు.

🥀బౌద్ధ భిక్షుణీలలో మహాత్ముల స్థాయిలో పరిగణించి నాడూ నేడూ ఆరాధింపబడుతున్న వారిలో పటాసార అనే మహిళ ఒకరు.

🥀పటాసార అంటే నిర్దుష్టమైన సత్ప్రవర్తన సంతరించుకొన్నదీ, కర్తవ్యాలను తు.చ. తప్పక నిర్వహించేదీ అని అర్థం చెప్పుకోవచ్చు. ఈ నామధేయం ఆమెకు సన్న్యాసాశ్రమం స్వీకరించిన తదుపరి కలిగింది. ఆమె పూర్వాశ్రమ నామధేయం తెలియరావడం లేదు.

🥀పూర్వం శ్రావస్తి అనే ఖ్యాతి గాంచిన నగరం ఒకటి ఉండేది. ఆ నగరంలోని ఒక సంపన్న కుటుంబంలో పటాసార జన్మించింది.

🥀పెరిగి పెద్దదైన పటాసార వివాహ వయస్కురాలయింది. అప్పుడు ఆమెకు తన తండ్రి వద్ద ఉద్యోగంలో ఉన్న ఒక యువకుడిపై మనస్సు కలిగింది.

🥀ఈ విషయం ఆమె తండ్రికి తెలియదు. ఆయన తన అంతస్తుకు, హోదాకు తగిన కుటుంబంలోని వరుణ్ణి నిశ్చయించి కుమార్తె వివాహం వైభవంగా జరిపించాలనే ప్రయత్నంలో ఉన్నాడు.

🥀ఈ స్థితిలో ఏం చెయ్యాలో పాలుబోక పటాసార, ఆమె మనసిచ్చిన ఆ యువకుడు శ్రావస్తి నగరం నుండి పారిపోవాలని నిశ్చయించుకున్నారు. ఆ ప్రకారం ఒకరోజు ఇద్దరూ రహస్యంగా నగరం వదలి దూరంలో ఉన్న ఒక గ్రామం చేరుకున్నారు. అక్కడ భార్యాభర్తలుగా జీవితం ప్రారంభించారు.

🥀కొంతకాలం గడిచింది. పటాసార గర్భవతి అయింది. ఆమెకు పుట్టింటికి వెళ్ళాలని ఎంతో ఉబలాటం కలిగింది. అందుచేత ఆమె, "మొదటి బిడ్డ పుట్టబోయే ఈ సమయంలో నేను పుట్టింట్లో ఉండాలనుకొంటున్నాను” అని భర్తకు చెప్పింది. కాని ఆమె భర్త అందుకు ఒప్పుకోలేదు. కాబట్టి మొదటి బిడ్డ గ్రామంలోనే జన్మించింది.

🥀పటాసార రెండవసారి గర్భం ధరించింది. అప్పుడూ ఆమె పుట్టింటికి వెళ్ళాలని ఎంతో ఆశపడింది. మునుపటి మాదిరే ఆమె భర్త అందుకు ఒప్పుకోలేదు. కాని ఈసారి పుట్టింటికి వెళ్ళి తీరాలని పటాసార మొండిపట్టు పట్టింది. చివరికి భర్త అందుకు సమ్మతించాడు.

🥀ఇద్దరూ గ్రామం నుండి శ్రావస్తి నగరానికి బయలుదేరారు. కాని పుట్టింటిని చేరుకోవడానికి ముందే, మధ్య దారిలోనే పటాసారు. ప్రసవించింది.

🥀ఆ స్థితిలో తల్లికీ, పుట్టిన బిడ్డకూ రక్షణగా ఒక గుడిసె నిర్మింపదలచాడు భర్త. గుడిసె నిర్మాణానికి కావలసిన చెట్టుచేమలు, తీగలు మొదలైనవి సేకరించడానికి పక్కనే ఉన్న ఒక దట్టమైన అడవిలోకి వెళ్ళాడు. దురదృష్టవశాత్తు అడవిలో అతణ్ణి ఒక తాచుపాము కాటువేసింది. క్షణాల్లో అతడు విలవిల తన్నుకుంటూ నేలకొరిగి ప్రాణాలు విడిచాడు.

🥀ప్రసవంతో నీరసించి ఉన్న పటాసార భర్త రాక కోసం కళ్ళల్లో ఒత్తులు పెట్టుకొని ఎదురుచూడసాగింది. అడవిలోకి వెళ్ళిన భర్త ఎంతసేపటికీ తిరిగి రాకపోయేసరికి పటాసారకు దిగులు, భయం పట్టుకున్నాయి. కాచుకొని కాచుకొని ఇక లాభం లేదనుకొని స్వయంగా తానే వెళ్ళి వెతకడానికి ఆమె ఉద్యుక్తురాలయింది.

🥀నడిచే శక్తి కూడా అప్పుడు ఆమెలో లేదు. అయినప్పటికీ మెల్లగా లేచి భర్త కోసం అడవిలో వెదకసాగింది. కాసేపటికల్లా భర్త విగతజీవుడై పడి ఉన్న దృశ్యం చూసింది! అంతే! లోకమే విరిగి తన తలమీద పడ్డప్పటికీ పటాసార అంత దిగ్భ్రాంతికి గురి అయ్యేది కాదు. పెద్ద ఆఘాతం! తన హృదయం వెయ్యి ప్రక్కలైనట్లు ఆమెకు అనిపించింది. ఇంతటి ఘోరం కలలో సైతం ఆమె ఎదురుచూసి ఉండదు.

🥀ఆ తరువాత పెద్ద బిడ్డను ఒక చేత పుచ్చుకొని, మరో చేత్తో శిశువును ఎత్తుకొని పటాసార పుట్టింటికి బయలుదేరింది.

🥀దారిలో ఒక ఏరు అడ్డం వచ్చింది. బిడ్డలిద్దరినీ చేతుల్లోకి తీసుకొని ఏకకాలంలో ఏటిని దాటడం సాధ్యం కాదని ఆమె గ్రహించింది. కాబట్టి ఆమె పెద్ద బిడ్డను తీరం వద్దనే నిలబెట్టి, శిశువుతో ఆ వైపు తీరాన్ని చేరుకున్నది. అక్కడ ఒక బండరాయి మీద కొన్ని ఆకులను పరిచి దానిపై శిశువును పరుండబెట్టి, మళ్ళీ ఆకులతో శిశువును కప్పి ఉంచింది.

🥀తదుపరి పెద్ద బిడ్డను తోడ్కొని రావడానికి ఆ వైపు తీరానికి బయలుదేరింది. ఏటిలో సగం దూరం దాటినప్పుడు, ఒక పెద్ద రాబందు శిశువు వైపుగా వేగంగా ఎగురుకుంటూ పోవడం ఆమె చూసింది.

🥀పటాసార మనస్సు తల్లడిల్లిపోయింది. ఆమె రాబందును తరిమికొట్టడానికి రెండు చేతులను పైకెత్తి అదలిస్తున్నట్లు ఊపసాగింది. ఆమె సైగను తీరం ఒడ్డున నిలబడి ఉన్న పెద్ద బిడ్డ చూసింది. తనను తల్లి వెంటనే రమ్మని పిలుస్తున్నదని భావించి నీళ్ళలోకి దిగింది! పటాసార ఏ బిడ్డనూ రక్షించే స్థితిలో సమీపంలో లేదు! ఏకకాలంలో శిశువును రాబందు ఎత్తుకుపోవడమూ, పెద్ద బిడ్డ ఏటి వెల్లువలో కొట్టుకుపోవడమూ ఆ అభాగ్యురాలి కళ్ళ ముందే జరిగిపోయింది.

🥀భర్త అకాల మరణం, బిడ్డల దుర్మరణంతో ఆమె కుప్పకూలిపోయింది. దిక్కు తోచని స్థితిలో, ఏకాకిగా మిగిలిపోయిన పటాసార శ్రావస్తి నగరంలోని తండ్రిగారి ఇంటికి కాళ్ళీడ్చుకుంటూ బయలుదేరింది. కాని క్రితం రోజు కురిసిన కుంభవృష్టి కారణంగా ఆమె పుట్టి, పెరిగిన పాత భవనం కూలి, నేలమట్టమైపోయి ఉంది. ఇల్లు కూలి, నేలమట్టమైనప్పుడు ఆమె తల్లిదండ్రులు, సోదరుడు మరణించారనే విషయం ఊరి జనం ఆమెకు తెలిపారు.

🥀పటాసాకు తల గిర్రున తిరిగిపోయింది. లోకం యావత్తు గిరగిరా తిరిగిపోతున్నట్లుగా ఆమెకు అనిపించింది. పిచ్చిపట్టినట్లయింది; అవును నిజంగానే ఆమెకు పిచ్చి పట్టింది. ఇప్పుడు ఆమె వీధుల్లో తిరిగే పిచ్చి అయిపోయింది.

🥀ఒక కాలఘట్టంలో మందీమార్బలంతో అడుగులకు మడుగులు ఒత్తించుకుంటూ వైభవంగా జీవితం గడిపిన ఆ కులకాంత, ఇప్పుడు పేలికలైన మాసిపోయిన దుస్తులతో వీధుల్లో తిరుగాడుతున్నది.

🥀ఇలా ఉండగా ఒక రోజు, ఆమె పూర్వజన్మ సుకృత ఫలంగా బుద్ధభగవానుని కృప ఆమెపై వర్షించింది.

🥀ఒకసారి బుద్ధుడు శోకతప్తులైన జనులను ఉద్దేశించి ధర్మోపదేశం చేస్తున్నాడు. అప్పుడు కాకతాళీయంగా ఆయన ఈ పిచ్చిదాన్ని చూశాడు. ఆ కరుణామూర్తి ఆమెకు చిత్తస్వాస్థ్యం కలిగేలా అనుగ్రహించాడు.

🥀అంతే! మతిస్తిమితం పొందడంతో ఆమె ప్రవర్తనలో, వస్త్రధారణలో మార్పు ఏర్పడింది. తరువాత ఆమె బుద్ధుని ఎదుటకు వచ్చి ఆయనకు ప్రణామం చేసింది. తాను గతంలో అనుభవించిన అష్టకష్టాలను పూసగుచ్చినట్లు ఆయనకు వివరించి చెప్పింది. కరుణా సింధువైన బుద్ధదేవుడు ఆమెను తపోమయ జీవితానికి నివేదనగా సమర్పించాలని భావించాడు. ఆయన ఉట్టిపడే కారుణ్యంతో, "తల్లీ! ఈ విధంగా 'నా అన్నవారినందరినీ కోల్పోయి నువ్వు కన్నీరుమున్నీరవడం, నీ గత జన్మలలో ఎన్నెన్నోసార్లు తటస్థించింది! అమ్మా, నువ్వు స్రవించిన కన్నీటిని చేరుస్తే నాలుగు సముద్రాలు నిండుతాయి. ఒకరి దుఃఖాన్ని ఏ బంధువో, కుమారుడో లేదా కుమార్తె అయినా సరే తీర్చడం అసాధ్యం.

🥀దుఃఖాలు లేనిది, బంధాలు లేనిది, జన్మలు లేనిది, అత్యున్నతమైనది - నిర్వాణంగా పేరుగాంచిన స్థితే అది" అంటూ జీవితం గురించిన నగ్నసత్యాలను తెలియజేశాడు.

🥀అంతులేని దుఃఖాలు, చేసిన పాపాలు, దుష్కర్మలు ఆత్మజ్ఞాని ఒక్క కడగంటి చూపు మాత్రాన పలాయనమౌతాయనటం పటాసార విషయంలో అక్షర సత్యమైంది. పటాసార మనస్సు స్పష్టతను సంతరించుకొంది. లౌకిక జీవితాన్ని ఉన్నదున్నట్లు చూడగలిగే పరిపక్వ స్థితిని ఆమె చేరుకోగలిగింది. తత్ఫలితంగా ఆమె భిక్షుణిగా బౌద్ధ సంఘంలో చేరి సన్న్యాస జీవితాన్ని మనస్ఫూర్తిగా స్వీకరించింది.

🥀సన్న్యాస జీవిత కట్టుబాట్లను తు.చ. తప్పక పాటిస్తూ అనతికాలంలో ఆమె ప్రథమ శ్రేణికి చెందిన భిక్షుణిగా రాణించసాగింది. ఆమె అనేక దివ్యదర్శనాలను పొందింది; బౌద్ధ తత్త్వాలలో నిష్ణాతురాలుగా విరాజిల్లింది.

🥀ఆమె నిర్దుష్ట ధార్మిక వర్తన చూసీ, కర్తవ్యతా పరాయణతను బౌద్ధ సంఘం ఆమెకు పటాసార నామధేయాన్ని ప్రసాదించింది. గాంచీ ఆమె కఠోర తపోమయ జీవితాన్ని, ప్రతిభాపాటవాలను స్వయంగా బుద్ధభగవానుడే అనేక సమయాల్లో ప్రశంసించి మాట్లాడాడు.

🥀పటాసార నేతృత్వంలో ముప్పైమంది భిక్షుణీలు శిక్షణ పొంది ఉన్నత ఆధ్యాత్మిక స్థితులను పొందారు. తాను దైవసమానురాలై ఇతరులు సమున్నత స్థితిని చేరడానికి పాటుపడిన పటాసారకు బౌద్ధ సంఘ చరిత్రలో ఎన్నటికీ చెరిగిపోని కీర్తి లభించిందనటం నిర్వివాదాంశం.


🌼🍒🌼🍒🌼🍒🌼🍒🌼🍒🌼🍒

సేకరణ

No comments:

Post a Comment