ఉగాది ప్రత్యేక సందేశాత్మక ఆటవెలది పద్య కవిత:-
కవి: హోమియో డాక్టర్ సకురు అప్పారావు గారు!
9848025870
9133331039
శీర్షిక:-
"కోకిలమ్మ గొంతు మూగబోయింది"
వనము చెంతజేరె వాసంతమేతెంచ
కోకిలమ్మ మురిసి కూయుచుండె
బుజ్జి పిల్లలరచి పోటీలు పడుచుండ
పాట పైకి పెంచి పరవశించె
కోకిలమ్మ రాక కొత్త శోభలు దేగ
తనను బిడ్డ లాగె దలచె వనము
వనము దరికి వచ్చె వాసంతమెల్లనూ
కోకిలమ్మె యిపుడు గొత్త రాజు
కాపు జెరుచు పురుగు గాయల్ని దినుచునూ
పరవశించు లాగ పాడుచుండె
ఇటుల గడుచుచుండ నెటునుండి వచ్చెనో
ఒకడు యముని లాగ నుగ్రరూపి
తనదె దోట యనుచు దనవనీ చెట్లన్ని
పిట్ట బురుగు జూచి పేచి
బెట్టి
ఒక్క కాయ గూడ నొగ్గేది లేదంటు
వింత మందు జల్లి విషము నింపె
కోకిలమ్మ దోట గూయుచూ తిరిగేను
తాను ఎరుగ లేదు తప్పు జరిగె
తోట నున్న విషము దోచేను ఉసురునూ
రాజు లేడు యిపుడు రాగమాగె
కోకిలమ్మె గాదు గూలేను జీవెల్ల
పాడు మనిషి జేసె పాపమెంత
వనము గుండె చెదిరి వరదల్లె విలపించె
తనదు బిడ్డ గతికి దల్లడిల్లె
వనము తోను గలసి వాసంత మెల్లనూ
గుండె పగిలి యేడ్చి గొల్లుమనెను
కన్న బిడ్డ లాంటి గాన కోకిల లేక
వీడిపోదు ననెను విషపు తోట
కరకు నరుడ నీవు గాయలే దినబోవ
తిన్న పిదప నీకు దెగులు రాద
మందు విషము బట్టి మంచాన బడమంది
దేహ వాతమొచ్చి దేకమంది
కోప శాప మొసగె గుండెలే బరువెక్కి
కరుణ లేని నరుని గసిగ దిట్టి
వనము నిడిచి వెళ్ళె వాసంత మెల్లనూ
తోడు వెళ్ళలేని దోట నొదిలి
-*-*-*-
కవిత యొక్క భావం:-
వసంత కాలం సమీపించగానే కోకిలమ్మ చక్కని తోటలోకి ప్రవేశించింది! కోకిలమ్మ ఆనందంతో పరవశించి కూయుచూ పాటలు పాడుతుంటే చిన్న పిల్లలు కూడా కోకిలమ్మతో పాటూ పోటీలు పడుతూ కూతలు పెడుతుంటే కోకిలమ్మ కూడా ఇంకా స్వరం పెంచి రాగాలు తీస్తుండేది!
కోకిలమ్మ రాక వనానికి కొత్త అందాలను, ఆనందాన్ని తేవడంతో తోట కోకిలమ్మను పండుగకు వచ్చిన తన కన్న బిడ్డలా భావించి, అక్కున చేర్చుకుంది! కోకిలమ్మ కూతలతో వసంత కాలం కూడా వచ్చేసింది! కోకిలమ్మ తోటంతా తనదే నన్నట్లు, తానే ఈ తోటకు కొత్తగా రాజైనట్లు స్వేచ్ఛగా తిరిగేది!
కోకిలమ్మ తోటలో కాపలా తిరుగుతూ, కాపుకు హాని చేసే పురుగులనూ, చిగుళ్ళనూ, కాయలనూ ఏరుకుతింటూ, జనులంతా ఆనందంతో పరవశించేలాగా పాడుతూ తిరిగేది! ఇలా తిరుగుచుండగా ఒకరోజు ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు గానీ తోటలోనికి ఒకడు యముడిలాగా ప్రవేశించి, ఈ తోటంతా పరిశీలించి, కళ్ళు ఎరుపెక్కి, కోపంతో ఊగిపోయాడు!
ఈ తోట, ఈ చెట్లూ అన్నీ తన సొంతమనీ, ఇక్కడ ఉండే పిట్టలకూ, పురుగులకూ ఒక్క కాయ కూడా వదిలి పెట్టేది లేదని గొడవ గొడవ చేసేసి, ఏదో ఒక వింతైన విషపూరితమైన పురుగు మందును తెచ్చి, తోటంతా జల్లించాడు!
జరిగిన కుట్ర తెలియని కోకిలమ్మ ఎప్పటిలాగే కూయుచూ తోటలో తిరిగేసింది! జరగాల్సిన తప్పు అప్పటికే జరిగిపోయింది, విషపు ప్రభావానికి కోకిలమ్మ గురై, చనిపోయింది, కోకిలమ్మ గొంతు శాశ్వతంగా మూగబోయింది! ఇప్పుడింక ఈ తోటకు రాజు లాంటి కోకిలా లేదు, దాని రాగాలూ లేవు!
ఈ పాడు మనిషి చేసిన పాపపు పనికి కోకిల మాత్రమే గాక ఆ తోటలో బ్రతికే అనేక చిన్న ప్రాణులన్నీ చనిపోయాయి! కోకిలమ్మను కన్న బిడ్డలా భావించిన వనం కోకిల మరణంతో తల్లడిల్లి, గుండె చెదిరి, వరదలా ఏడ్చింది!
వనంతో పాటుగా వసంతము కూడా గుండె పగిలేలా ఏడ్చి, తనకు కన్న బిడ్డలాంటి కోకిలమ్మే లేకుండా పోయాక నేనిక్కడ ఉండలేను, ఈ విషం నిండిన తోటను వదిలి నేను కూడా పోతానని పలికింది!
"ఓయీ! కఠినమైన మనస్సు కలిగిన మనుషుల్లారా! ఎందుకిలా ప్రవర్తిస్తున్నారు? ఈ విషపు మందు జల్లిన కాయలు మీరు తినరా? తింటే మీకేమీ కీడు కలగదా? చూడండి, ఇటువంటి కాయలు తిన్న మీరు లేనిపోని జబ్బులతో మంచాన పడి, దానితో పాటూ పక్షవాతం కూడా వచ్చి, కాళ్ళు పనిచేయక, నేలపై దేక్కుంటూ, పాక్కుంటూ తిరుగుతారు చూడండి! "
అని వసంతం బరువెక్కిన గుండెలతో కరుణ లేని మనిషిని కసిగా శపించి తిట్టుకొని, తన వెంట రాలేని తోటను అక్కడే విడిచిపెట్టి, విషాదంతో వసంతం మొత్తం తరలి వెళ్ళిపోయింది!
-*-*-*-
ఈ "విశ్వావసు" నామ తెలుగు వత్సరాది నుంచీ ప్రతీ ఇంటిలోనూ, ప్రతీ రామాలయంలోనూ రామాయణం నిత్య పారాయణం జరిగే సాంప్రదాయం మొదలై, ప్రతీ మనిషిలోనూ సత్సాంప్రదాయ గుణాలు పెరిగి, పెద్దలను గౌరవించి, పూజించి, రక్షించే పిల్లలు పెరగాలని, అదేవిధంగా మీ అందరికీ సకల శుభాలు కలగాలని కోరుకుంటూ..... ఉగాది శుభాకాంక్షలతో... మీ హోమియో డాక్టర్ సకురు అప్పారావు! 🙏🙏🙏