*మార్గదర్శకులు మహర్షులు -10*
🪷
రచన: మహామహోపాధ్యాయ శివానందమూర్తి
*కశ్యపప్రజాపతి-1*
కపిలమహర్షి, దేవహూతికర్దములకు జన్మించిన కుమారుడు. ఆయన సాక్షాత్తు విష్ణుమూర్తే! ఆ కపిలమహర్షిని చూడటానికి మరీచి, బ్రహ్మ వచ్చారు.
ఇంతకుముందు మనం విన్నట్లుగా, కర్దమ ప్రజాపతి తన కుమార్తెలలో కళ అనే ఆమెని మరీచిమహర్షికిచ్చి వివాహం చేసాడు. ఆ మరీచిమహర్షి తపోవనానికి తపస్సు చేసుకోవటం కోసం వెళ్ళిపోయాడు.
మరీచి మహర్షికి, కళకు ఒక కుమారుడు జన్మించాడు. ఆ పిల్లవాడు గర్భవాసంలో పెరుగుతున్నప్పుడే ఆయన భార్యతో, "నీ గర్భంలో పెరిగే పిల్లవాడు భవిష్యత్తులో ప్రజాపతి అవుతాడు. అతడిని జాగ్రత్తగా పెంచి నారాయణజపం నిరంతరమూ చేస్తూ ఉండు" అని అన్నాడాయన.
పిల్లవాడు జన్మించాడు. కశ్యపుడు అని పేరు పెట్టారు ఆ పిల్లవాడికి. (కశ్యపమహర్షే కశ్యపప్రజాపతి. ప్రజాపతులు, మహర్షులు చాలా చోట్ల ఒక్కరే). పెరిగిన తరువాత కశ్యపుడికి ఉపనయనాది సంస్కారములు చేసారు. అనంతరం బ్రహ్మయొక్క సలహా ప్రకారం దక్షప్రజాపతికి కలిగిన పుత్రికలలో ఆయనకు కొంతమంది కూతుళ్ళను ఇచ్చి పెళ్ళిచేసాడాయన. వాళ్ళు-అదితి, దితి, దనువు, కాల, అనాయువు, సింహిక, ముని, కపిల, క్రోధ, ప్రథ, క్రూర, వినత, కద్రువ. దక్షుడు వీళ్ళందరినీ కశ్యపుడికే ఇచ్చి పెళ్ళిచేసాడు. ఆయనకు వెతుక్కునే పనిలేదు. ఇంతమందికి అల్లుళ్ళను ఎక్కడని వెతుక్కుంటాడు! చాలా సంతానాన్ని పొందాడు. జీవకోటికి తండ్రి ఆయన. అంటే ఒక్క మనుష్యులకే కాక, పశుపక్ష్యాదులకు, సర్పాలకు కూడాను! ఆవిధంగా కశ్యపుడు ప్రజాపతి అయ్యాడు. జీవకోటిని రక్షించమని ఆయనకు బ్రహ్మయొక్క ఆజ్ఞ.
వివాహ సమయంలో కశ్యపప్రజాపతి వాళ్ళందరికీ పుత్రసంతానాన్ని ఇస్తాను అని చెప్పాడు. కొంతకాలానికి అదితి గర్భవాసంలో ధాత, మిత్రుడు, శుక్రుడు, అర్యముడు, వరుణుడు, అంశుడు, భగుడు, వివస్వతుడు, పూషుడు, సవితృడు, త్వష్ట, విష్ణుడు అనేవాళ్ళు - పన్నెండుమంది ఆదిత్యులు - పుట్టారు. అదితి గర్భాన పుట్టటంచేత వాళ్ళకు ఆదిత్యులు అని పేరు వచ్చింది.
దితి గర్భవాసంలో పుట్టినవారు దైత్యులు. కశ్యపుడివలన దితికి హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు పుట్టారు. దనువు కుమారులు అందరూ దానవులు. సామాన్యంగా రాక్షసులు అని వీళ్ళను అంటుంటారు కాని దైత్యులు, దానవులు వేరువేరు. దనువు కుమారులు వీళ్ళంతా! వీళ్ళ పేర్లు విప్రచిత్తి, శంబరుడు మొదలైన రాక్షసులు నలుగురు పుట్టారు. కాల అనే భార్యకు వినాశన, క్రోధ మొదలయిన వాళ్ళు ఎనమండుగురు పుట్టారు.
https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe
వినాశకుడు వంటి పేర్లు ఏమిటంటే - అది వారి లక్షణం అనుకోవాలి. ప్రజాపతి ఏ పేరు పెట్టుకుంటే అదే నిజం. తరువాత అనాయువు అనేటటువంటి భార్యకు బల వీరాదులనే నలుగురు పుట్టారు. సింహిక అనే భార్యకు రాహువు (రాహుగ్రహం) పుట్టాడు. 'సైంహికేయో విధుంతుదః' అని నిఘంటువు చెబుతుంది. 'సైంహికేయుడు' అని రాహువుకు పేరు. ముని అనే ఆయన భార్య - భీమసేనుడు, ఉగ్రసేనుడు అనే గంధర్వులను కన్నదట. కపిల అనే భార్యకి అమృతము, గోగణము, బ్రాహ్మణులు, ఘృతాచీ మేనకాది అప్సరసలు కశ్యపుడి వలన జన్మించారట.
క్రోధ అనే ఆమెకు క్రోధవశగణములు జన్మించినవి. అంటే పరమేశ్వరుడి యొక్క లక్షణములలో క్రోధమున్నది, ధైర్యమున్న ది, క్రౌర్య మున్నది. ఇవన్నీ కూడా ఈ సృష్టి లో ఈశ్వరుడి విభూతులుగానే చెప్పారు. ఇవన్నీ కూడా, ఈ లక్షణములన్నీ కూడా ప్రజాపతి సంతానంగా శరీరాలతో అవతరించాయని చెప్పటమంటే, సృష్టిలో ఉండే లక్షణాలు కశ్యప ప్రజాపతి కారణంగా శరీరాన్ని పొంది వచ్చినవి అని చెప్పటమే.
ప్రథ అనే ఆమెకు సిద్ధులు పుట్టారు. క్రూర అనే భార్యకు సుచంద్ర, చంద్రహంత, చంద్రకాంత అనేవాళ్ళందరూ పుట్టారు. భాగవతం చతుర్థ స్కంధంలో ఈ విషయాలన్నీ చెప్పబడినవి.
మరికొంతకాలానికి ఆయన భార్యలయిన కద్రువ, వినతలు తమకు పుత్రసంతానం కలగకపోవటంచేత సంతానాభిలాషతో కశ్యపుడి దగ్గరికి వెళ్ళి ఆయనను సహస్ర వర్షములు సేవించారట. వీళ్ళ సేవకు సంతోషించి ముందర కద్రువను అడిగాడు ఏంకావాలి అని! ఆమె తనకు వెయ్యి మంది పరాక్రమవంతులయిన కొడుకులు కావాలని కోరుతుంది.
తరువాత వినతను అడిగితే ఆమె కద్రువ లాగానే, వెయ్యిమంది కంటే బలవంతులు ఇద్దరు తనకు కావాలని కోరుకున్నది. అసూయ అనేది అసలు సృష్టిలోనే ఉన్నది. తన సవతి అయిన కద్రువ, ముందర ఏమి అడుగుతుందో చూసిన తరువాత ఆమె కంటే పెద్ద వరాన్ని తను అడగాలని ముందర వరం కద్రువకు ఇమ్మన్నది వినత.
వినత, కద్రువలకు మొదటి నుంచీ ఒకరిపై మరొకరికి ద్వేషమే. కశ్యపుడు వాళ్ళకోరిక తీర్చటంకోసమని తపస్సులోకి వెళ్ళిపోయాడు. తరువాత ఇంద్రాది దేవతలను తనకు సహాయకులుగా తీసుకొని పుత్రకామేష్టి యాగం చేసాడు వీళ్ళందరికోసము. మిగతా భార్యలకందరి కీ సహజంగానే పుత్రులు కలిగారు. మరి వినత, కద్రువలకు మాత్రము ఎందుకు కలుగలేదో! వారి సంస్కారం ఎటువంటిదో!
https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe
పుత్రకామేష్టియాగంలో కశ్యపుడు ఇంద్రాది దేవతలతోపాటు వాలఖిల్యాది మునులు అనేకమందిని యాగానికి పిలిచాడు. ఆ వాలఖిల్యాది మునులు కృశించిన శరీరాలతో వికారంగా ఉన్నారు. వీళ్ళు చిరకాలం నుంచీ తపస్సు చేస్తున్నారు. కృశించిపోయి ఉన్నారు. వీళ్ళకు అన్నం లేదు. నిద్రలేదు. నీళ్ళు తాగరు.. తపస్సు తప్ప ఏదీలేదు. అటువంటి వ్రతం ఒకటి అవలంబించి, కృశించిపోయి వికారంగా ఉన్న ఆ మునులను చూచి ఇంద్రుడు నవ్వాడు. దాంతో ఇంద్రుడి మీద వీళ్ళకు కోపం కలిగింది..
ఆ మునులు, తమను చూచి నవ్వినటు వంటి ఇంద్రుడికంటే వెయ్యిరెట్లు ఎక్కువ బలసంపన్నులయిన కొడుకు కశ్యపుడికి పుట్టాలని స్వాహాకారంతో యజ్ఞం చేసారు. తనకంటే వెయ్యిరెట్లు ఎక్కువ బలవంతు డైన కొడుకు కశ్యపుడికి పుడితే తను ఈ ప్రపంచంలో రెండవవాడై పోతాడు అని భావించి ఇంద్రుడు కశ్యపుణ్ణి శరణుజొచ్చా డట. అయితే ఇంద్రుడు చేసిన అపరాధాని కి వాలఖిల్యాదులు చెప్పిన మాట నిజం కావాలి.
అప్పుడు కశ్యపుడు వాలఖిల్యాది మునులను ప్రార్థించాడు. "మీ మాట నిజమే అగుగాక! కాని ఇంద్రుడికంటే వెయ్యిరెట్లు అధిక బలవంతుడైన కొడుకు నాకు పుడితే ఈ ఇంద్రుడికున్నటువంటి జగత్పూజ్యత పోయి లోకం అస్తవ్యస్తం అవుతుంది కదా! కాబట్టి మీరు చెప్పిన మాట నిజం అవాలి. కాని ఇంద్రుడివలెనే దేవతాస్వరూపంలో గరుత్మంతుడు అని పక్షి రూపంలో పుట్టాలి! అతడు ఇంద్రుడి కంటే బలవంతుడు కావొచ్చు. కాని పక్షి జాతికి ఇంద్రుడు అవుతాడు వాడు. అప్పుడు వాళ్ళిద్దరికీ మధ్యన వైరం లేకుండా ఉంటుంది. ఇలా మీరు ఒప్పుకోండి" అని వాలఖిల్యాది మహర్షుల ను ఒప్పించి, తను గరుడుడిని గరుత్మంతు డనే పుత్రుడుగా కన్నాడు కశ్యపుడు.
ఈ యాగఫలితంగా వినత కద్రువలిద్దరూ గర్భవతులు అయ్యారు. వాళ్ళిద్దరి గర్భాల లోంచీ అండములు ఒక్కొక్కటి - చెరొకటి - పుట్టాయట! కశ్యపుడు తపస్సుకు వెళ్ళిపోయాడు. వినతకద్రువలిద్దరూ ఆ అండాలను ఘృతభాండాలలో పెట్టి, పూజ చేస్తూ జాగ్రత్తగా రక్షించుకుంటున్నారు. కొంతకాలానికి కద్రువ ఆరాధించుకుంటూ ఉండే ఆ అండం చిట్లి, పగిలి దాంట్లోంచి శేషుడు, వాసుకి, తక్షకుడు, కర్కోటకుడు, ధనంజయుడు, కాళీయుడు మొదలయిన వెయ్యిమంది నాగముఖులందరూ పుట్టారు. వినత తన గర్భాన పుట్టిన ఆ అండాన్ని చాలాకాలంవరకూ కాపాడింది. కద్రువకు శూరులు, పరాక్రమవంతులైన సర్పాలు పుట్టాయని పుత్రసంతానంతో ఆమె సంతోషపడుతోందన్న దుఃఖం వినత భరించలేక, తనవద్దనున్న అండాన్ని పగులగొట్టింది. అప్పుడు అందులోంచి రెండు అండములు పుట్టాయి.
https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe
ఆ రెండింటిలో ఒకటి పగులగొడితే అందులోంచే అనూరుడు పుట్టాడు. అనూరుడు అంటే ఊరువులు లేనివాడు - తొడల నుంచీ కాళ్ళులేనివాడు. అండం పెరగకముందే ఆమె అండాన్ని పగుల గొట్టడంతో, శరీరం ఇంకా పూర్తిగా ఏర్పడ లేదు. అతడు పుట్టగానే, జ్ఞాని కాబట్టి, "నీ తొందరతో నన్ను అంగహీనుణ్ణి చేసావు. ఆ రెండో అండాన్నైనా జాగ్రత్తగా కాపాడు" అని తల్లితో చెప్పి వెళ్ళిపోయాడు.
సూర్యుడికి సారథి అయ్యాడతడు. సప్తాశ్వరథారూఢుడైన సూర్యుడు అనూరుడిని తన సారథిగా పెట్టుకున్నాడు.
రెండో అండంలోంచి గరుత్మంతుడు పుట్టాడు. వినత కద్రువలకు ఒకళ్ళమీద మరొకళ్ళకు మాత్సర్యం చాలా ఉన్నది. అసూయాగ్రస్తులు. వాళ్ళకు ఒకనాడు చిన్న విషయం పైన అర్థంలేని వివాదం ఒకటి జరిగింది. అదేమిటంటే, దూరంగా వారిద్దరూ ఒక అశ్వాన్ని చూచారు. దానితోక నల్లగా ఉంది, ఎంత బాగుందో అని కద్రువ అన్నది. తెల్లగా ఉన్నది అని వినత అన్నది. తెల్లగా ఉంటే నల్లగా ఉంది అంటావేమిటి అన్నది ఈవిడ.
“ఓడిపోయినవారు గెలిచినవారికి దాసీగా ఉండాలి" అని పందెం కట్టుకున్నారు ఇద్దరూ. దగ్గరికి వెళ్ళి చూస్తే తోక నల్లగా కనబడింది. అయితే ఈ పందానికి ముందు, కద్రువ తన కుమారులలో ఒకడిని పిలిచి, పందెం విషయం చెప్పి అతడితో, "నువ్వు నల్లగా ఉన్నావు కాబట్టి ఆ అశ్వం తోక పట్టుకుని వ్రేలాడి తోక నల్లగా కనబడేట్లు చెయ్యి. అప్పుడే నేను గెలుస్తాను" అన్నది. ఆ విధంగా కద్రువ మోసంతో పందెం గెలిచింది. వినత ఓడిపోయి కద్రువకు దాసి అయింది. గరుత్మంతుడు పుట్టేదాకా వినత, కద్రువకు దాసీగానే ఉన్నది. ఆవిడ ఆజ్ఞలను ఈమె పరిపాలిస్తూనే ఉన్నది. పురాణాల్లో ఉన్న ఈ కథ అందరికీ తెలిసిందే!
🪷
*సశేషం*
꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂
*కథల ప్రపంచం*
https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe
*తెలుగు భాషా రక్షతి రక్షితః*
*ఏడాది చందా 120/-, ఫోన్ పే & గూగుల్ పే నెంబర్ 9849656434*
*1 YEAR* *SUBSCRIPTION 120/-*
*phone pe & Gpay to 9849656434*
꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂
No comments:
Post a Comment