*మహామంత్రి మాదన్న - 13*
(చరిత్ర ఆధారిత నవల)
👳🏽
రచన : ఎస్.ఎమ్. ప్రాణ్ రావు
'నాన్నా నాకు కూడా నెలకి నలభై జీతం రావాలి. ఆ జీతం నాకూ కావాలి'
'అంటే తురకలలో కలుస్తావా' అనుమానం నిండిన గొంతుతో అడిగాడు మల్లన్న.
'అవును. అదీగాక ఆ మతంలో కలిస్తే అందరూ సమానులు అవుతారని కూడా చెప్పారు'.
'ఇవ్వాళ ఉండి రేపు పోయే పైస కోసం కులం కట్టుబాటు తప్పుతావా. పిడీల నుంచి మనం కొలుస్తున్న దేవుడిని కొలువు కోసం అమ్ముకుంటావా. తప్పుడు పని చేస్తానంటున్నావు. దేవుడు ఎట్లా పుట్టిస్తే అట్లా పుట్టాం. ఏ కులం కడుపులో వేస్తే ఆ కులం కడుపు చీల్చుకుని బయటపడ్డాం. నొసట ఏది రాస్తే దాన్నే మన కొంగున కట్టుకుని అనుభవిస్తున్నాం. మన వంశపోళ్లు ఎవరైనా పదవి కోసమో, పైస కోసమో తరతరాల నుంచి చేసే పూజను వదులుకున్నారా. ధర్మం తప్పారా. ఈ సంగతి నలుగురి నోట్లో పడితే నవ్వుల పాలవుతాం' అన్నాడు మల్లన్న కొడుకుకి నచ్చచెబుతున్న ధోరణిలో.
'అది కాదు నాన్నా...'
'ఏది కాదుర' మధ్యలోనే అందుకుంది తల్లి. ఎవరి దేవుడు వారికుంటాడు. మన దేవుడు మన దేవుడే. మన మెత్త మన మెత్తనే' అంది.
'కొండన్నా, అంతా సమానమంటున్నావు. ఎక్కడుందిరా అది. డబ్బు ఉన్న తురక మతస్తుడు బీద తురక పిల్లవానికి పిల్లను ఇస్తాడా. వాడిని తనతో సమానంగా చూస్తాడా. అంతటా ఇదే జరుగుతుంది. మన కట్టుబాట్లు మనకున్నాయి. మనం మనకంటే తక్కువ కులం వాళ్ల ఇంట్లో అన్నం తింటేనే పంచాయతి పెట్టి దండుగ వేస్తారు. తక్కువ కులం పిల్లని తెచ్చుకున్నా తక్కువ కులం పిల్లవాడికి పిల్లని ఇచ్చుకున్నా కులం నుంచి వెలివేస్తారు. కులం పాదాలు మన నెత్తి మీద. అలాంటప్పుడు మనం మతం మారితే బతకనిస్తారా' తినడం పూర్తి చేసిన మల్లన్న తన కంచం తీసి జాలాడులో పడేసి, చెయ్యి కడుక్కుని వచ్చాడు. పై బట్టతో మూతి తుడుచుకున్నాడు.
కొండయ్య తల్లి గంగమ్మ అందుకుంది. వేళ్లు నాకుతున్న మనుమడు సంగయ్యను ఒళ్లోకి లాక్కుని వాడి జుట్టు నిమురుతూ, 'వీడి పెళ్లాం తల్లిగారింట్లో వుంది. నువ్వు మతం మారితే దాన్ని వాళ్లు కాపురానికి పంపుతారా. పంచాయతి పెట్టి పెళ్లికి వాళ్లు ఖర్చు చేసిన డబ్బును మన ముక్కు పిండి వడ్డీతో సహా వసూలు చేస్తారు. రేపు నీ బిడ్డని ఇవ్వమని కులం వాళ్లు ఎవరన్నా అడుగుతారా. నీ సంగతి తెలిసిన నీ బావలు నీ చెల్లెళ్లను ఏలుకోమని వదిలేస్తే ఏం చేస్తావు' సూటిగా అడిగింది.
కొండయ్య కాసేపు మౌనంగా వుండిపోయాడు. తల తిప్పి భార్య వైపు చూస్తూ 'నువ్వేమంటావు శివమ్మా' అడిగాడు.
'నీ జీతం నలభై అవుతుందని నువ్వు మతం మారుతానంటున్నావు. సరే. రేపు ఎవడన్నా ఎనభై రూపాయల జీతం వున్న ఫౌజుదార్ నన్ను మెచ్చితే కట్టుకున్న నిన్ను కాదని వాడిని మనువాడతాను. ఒప్పుకుంటావా' అంది శివమ్మ.
'అదేమన్న మాట' అన్నాడు కొండయ్య కోపంగా ముక్కుపుటాలు ఎగరేస్తూ.
'శివమ్మ ఉన్నమాటే అంది. అలాంటి ఆలోచనలు మనసులో పెట్టుకోకు. మీ తాత శివుడి మీద ఎన్నో తత్వాలు కట్టాడు. ఈ చుట్టుపక్కల పది ఊళ్లలో నిత్యం ఆ తత్వాలు పాడుకుంటారు. ఆయన మనుమడివి నువ్వు, నువ్వు కత్తి పట్టావు. కత్తి పట్టినవాడు యుద్ధం చేస్తాడు. యుద్ధభూమి ఏదైనా కావచ్చు. వెనుతిరిగి పారిపోడు' అన్నాడు మల్లన్న ఆ చర్చకి ముగింపు పలుకుతూ.
📖
'తానీషా కొత్త జీవితం ఎలా ఉంది' అడిగాడు షా రాజు. అబుల్ హసన్ కి తను పెట్టిన పేరు తాన్ షాని, తానీషాగా మార్చి పిలుస్తాడు షా రాజు.
ఈ ఖాన్ కాలో చాలా బావుంది. ఏ బాదర బంది లేదు. బిక్షా పాత్రలో ఏది పడితే దానితో తృప్తిపడటం. తృప్తి నిండిన మనసుతో ప్రార్థన చేసుకోవడం. మీ ప్రవచనాలు వినడం. తీరిక సమయాల్లో తోట పని చెయ్యడం. వీటితో జీవితానికి అసలైన రంగు రుచి వచ్చాయి' అన్నాడు అబుల్ హసన్.
https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe
'తానీషా, నువ్వు ఇక్కడికి వచ్చి ఎనిమిదేళ్లు దాటింది. నీ పాత జీవితం ఇంకా నీ స్మృతిలోంచి చెరిగిపోలేదను కుంటాను. ఎప్పుడన్నా తలుచుకుంటే ఏమనిపిస్తుంది'
'రాచ నగరంలో మగపిల్లలు మీసాలు వచ్చీ రాకముందే ఆడపిల్లలతో జతకడతారు. అది అక్కడి రివాజు. నా విషయంలోనూ అదే జరిగింది. అందులోనూ రాజమాత హయత్ బక్షీ బేగంకి నా మీద ప్రత్యేక వాత్సల్యం. దాంతో నాకు పట్టపగ్గాలు లేకపోయాయి. స్త్రీ పురుష సంయోగమే జీవితానికి పరమావధి అనుకున్నాను. దాంతో బరితెగించాను. చివరికి ఇక్కడికి చేరుకున్నాను. పంజరంలోంచి బయటపడి ఎత్తులో ఎగురుతున్నాననిపిస్తుంది' అన్నాడు హసన్ నిజాయితీ నిండిన గొంతుతో.
'తానీషా, నా ముఖస్తుతి కోసం చెప్పకు. బాగా ఆలోచించి చెప్పు. ఇక్కడికి వచ్చినందుకు విచారిస్తున్నావా'
'ఇందాకే చెప్పాను కద, ఇక్కడ బావుందని. ఇక్కడ నాకళ్ల ఎదుట కొత్త ప్రపంచం ఆవిర్భవించింది. రాచ నగరంలో వున్నప్పుడు జీవితం అంటే పూలపాన్సు తప్ప మరేమీ కాదనుకున్నాను. ఆ పాన్సు మీద పవ్వళింపు సేవలు అందించడానికి నవయువతులు నా కోసం పలవరిస్తుంటా రని అనుకున్నాను'.
'మరి ఇప్పుడు' అడిగాడు షా రాజు.
'ఈ కొత్త ప్రపంచం చూసి నా వళ్లు జలదరించింది. ఆకలి, అనారోగ్యం, పీడన సామాన్యులను అణిచివేస్తున్నాయని అధికార మదం, అహంకారం ఆ అణిచి వేతకి పదునైన ఆయుధాల్లా అమిరాయని తెలిసొచ్చింది.'
'మరి వీటికి ఎదురు తిరగాలని, మార్పు తేవాలని నీకు అనిపించలేదా' అడిగాడు షా రాజు.
'మీరు నాకు అలాంటి శిక్షణ ఇవ్వలేదు. ఈ ప్రపంచం మొత్తం భగవంతుని ఆధీనంలో వుందని మీరు చెప్పారు. దీనిని మార్చాల న్నా, మసి చెయ్యాలన్నా అంతా ఆయన అభీష్టం మేరకే జరుగుతుందని చెప్పారు. ఆయన చేసే లీల కోసం ఓర్పుగా వేచి వుండటమే మన కర్తవ్యం అని నూరి పోశారు. అందుకే అన్నిటి పట్ల తటస్థంగా వుండటం అలవరుచుకున్నాను. ఏదీ మన చేతిలో లేదు. మనం అంతా అంథులం. ఆ భగవంతుడు మన చేతికర్ర. ఆయన ఎటు తీసుకెడితే అటు వెళ్లడమే. ఆయన నడిపించే మార్గం ఎప్పుడూ సవ్యమైనదే అని నిశ్చయించుకున్నాను'.
'ఒక వేదాంతిలా, తాత్వికుడిలా మాట్లాడుతున్నావు. అసలు తాత్వికులు పాలకులు అయితే ప్రపంచ రూపురేఖలు ఎలా ఉంటాయో అన్న ఆలోచన కలుగుతోంది.' అన్నాడు షా రాజు.
'మీకిప్పుడు అలాంటి ఆలోచన ఎలా వచ్చింది' అడిగాడు అబుల్ హసన్.
'అది తరువాత చెబుతాను గానీ మరో విషయం చెప్పు'
'అడగండి.'
ఇంతలో అక్బర్ షా వచ్చాడు. 'ఏమిటి గురుశిష్యులిద్దరూ ఏదో చర్చలో మునిగి పోయినట్లు కనిపిస్తున్నారు' అన్నాడు.
'అది సరే. నీ కావ్యం శృంగార మంజరి ఎంతదాకా వచ్చింది' అడిగాడు అబుల్ హసన్.
'మంగళాచరణం మటుకే అయింది. గణపతి, సరస్వతి స్తుతి పూర్తి అయింది.
సంస్కృతం, తెలుగు రెండు భాషల్లోనూ వ్రాస్తున్నాను' అన్నాడు అక్బర్ షా.
అబుల్ హసన్ విస్మయం నిండిన చూపులతో అక్బర్ షా వైపు చూశాడు.
https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe
'ఇందులో ఆశ్చర్యపడేందుకు ఏముంది. బీజాపూర్ సుల్తాన్ ఇబ్రహీం ఆదిల్ షా తన గ్రంథం కితాబె-నౌరస్ కి హిందూ దేవ దేవతలకు మొక్కిన తరువాతే శ్రీకారం చుట్టాడు' అన్నాడు అక్బర్ షా.
'అందులో తప్పేముంది. ఏ భాషలో వ్రాస్తున్నామో ఆ భాష సంప్రదాయాన్ని పాటించాలి' అన్నాడు షా రాజు.
'తెలుగు నేను బాగా చదువగలను' అన్నాడు అబుల్ హసన్.
'సరే. నేను అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పలేదు' అన్నాడు షా రాజు.
'మీరు నన్ను ఏమీ అడగలేదు' అన్నాడు అబుల్ హసన్ నవ్వుతూ.
'నిజమే సుమా. ఇప్పుడు అడుగుతున్నా ను చెప్పు. రాజమాత హయత్ బక్షీ బేగానికి నీ మీద ప్రత్యేకమైన మమత అని చెప్పావు. ఎందుకో చెప్పలేదు'.
అబుల్ హసన్ మాట్లాడలేదు.
'నేను చెబుతాను. అబుల్ హసన్ నాజూకుగా వుంటాడు. ఎంతో అందంగా ఉంటాడు. అంతకంటే అందమైన యవ్వనాన్ని అణువణువున నింపుకు న్నాడు. అంతే కదూ' అన్నాడు అక్బర్ షా.
'నీ వివరణలో పూర్తి నిజం లేదు' అన్నాడు షా రాజు.
“అయితే ఆ నిజం అబుల్ హసనే చెప్పాలి' అన్నాడు అక్బర్ షా.
అబుల్ హసన్ సంకోచపడ్డాడు. మొహం లోకి అరుణిమ దూసుకువచ్చింది.
"సిగ్గుపడే అవసరం లేదు. అది మానవ నైజం' అన్నాడు షా రాజు.
'రాచ కుటుంబీకుడు సైఫ్ ఖాన్ రాజ మాతకి తమ్ముడు. నేను ఆయన మనుమడిని. అందుకే రాజమాతకి నా మీద మక్కువ. తన చిన్న మనుమరాలికి నేను ఈడు జోడు అనుకున్నారట రాజమాత' చెప్పాడు అబుల్ హసన్.
'ఆ అమ్మాయి అంటే నీకూ ఇష్టమేనా' అడిగాడు షా రాజు.
'ఇష్టమే. కానీ ఆ ఇష్టాన్ని భయం మింగేస్తోంది'.
'భయమా! ఆ అమ్మాయి కొడుతుందనా. లేక చిటికెన వేలు చుట్టూ తిప్పుకుంటుంద నా' నవ్వుతూ అడిగాడు అక్బర్ షా.
'రెండూ కావు'.
'మరేమిటి' రెట్టించాడు అక్బర్ షా.
'రాచనగరులోని వజ్రాల ధగధగలు, మణుల మెరుపులు, ముత్యాల మిలమిలలు. ఇహపోతే వీటన్నిటికీ అలంకారంగా నిలిచే నా ప్రేయసి. ఇవన్నీ నా భక్తి భావాన్ని నా సూఫీ తత్వాన్ని మరుగుపరుస్తాయేమోనని భయం' అన్నాడు అబుల్ హసన్.
'సుల్తాన్ మూడవ కూతురు అంటే నీకు తెలియకుండానే నీలో ఇష్టం ఏర్పడింది. అది దైవ ఘటన. నీ ప్రేమ ఫలిస్తుంది. అనవసర భయాలు పెట్టుకోకు. రేపు ఏమవతుందోనన్న భయం నీకు నేటి నుంచి వుండకూడదు. అంతే కాదు ప్రపంచ వ్యవహారాల పట్ల తటస్థత, దాని వల్ల అబ్బిన మనఃశాంతి ఈ రెండూ నువ్వు కలిగి వుండాలి. ఇదే నువ్వు నాకు ఇచ్చే గురుదక్షిణ' అన్నాడు షా రాజు.
'గురుదక్షిణ ఇప్పుడే ఇస్తున్నాను. ఇహ ప్రతి విషయంలో నిర్విచారంగా వుంటాను' అన్నాడు అబుల్ హసన్.
'నిర్విచారతే నిజమై శక్తి, అన్ని అపాయాలనూ తప్పించుకునే యుక్తి. నీకు శుభం కలుగుతుంది. త్వరలో నీ జీవితం ఊహించని మలుపు తిరుగుతుంది'.
'నిజమా నాన్నగారూ' అడిగాడు అక్బర్ షా.
'నా నోటి నుంచి ఎన్నడూ అబద్దం రాదు. అసలు విషయం చెబుతున్నాను. రాజమాత ప్రత్యేక దూత మాదన్న క్రమం తప్పకుండా ఈ ఖాన్ కాకి వస్తాడు. నీ
మనస్తత్వం గురించి, ప్రవర్తన గురించి రాజమాత పనుపున అడిగి తెలుసు కుంటాడు. ఎందుకో తెలుసా' అడిగాడు షా రాజు.
'తెలీదు' అన్నాడు అబుల్ హసన్.
'గోలుకొండ సింహాసనానికి వారసత్వపు హక్కు కేవలం కులీల రక్తానికే వుంటుంది. రాజమాత చిన్న మనుమరాలికి అన్నిటా ఈడు జోడు అయిన నీ ఒక్కడిలోనే ఆ రక్తం ప్రవహిస్తోంది'
👳🏽
*సశేషం*
꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂
*కథల ప్రపంచం*
https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe
*తెలుగు భాషా రక్షతి రక్షితః*
*ఏడాది చందా 120/-, ఫోన్ పే & గూగుల్ పే నెంబర్ 9849656434*
*1 YEAR* *SUBSCRIPTION 120/-*
*phone pe & Gpay to 9849656434*
꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂
No comments:
Post a Comment