7️⃣2️⃣
*🛕🔔భగవద్గీత🔔🛕*
_(సరళమైన తెలుగులో)_
*మూడవ అధ్యాయము*
*కర్మయోగము.*
*24. ఉత్సీదేయురిమే లోకా న కుర్యాం కర్మ చేదహమ్l*
*సంకరస్య చ కర్తా స్యాముపహన్యామిమా: ప్రజా:ll*
ఓ అర్జునా! నేను కర్మలను చేయకుండా మానేస్తే ఈ లోకములు అన్నీ నశించిపోతాయి. అల్లకల్లోలము అవుతాయి. ప్రజలకు నష్టం కలుగుతుంది. వీటి కంతా నేను కారకుడను అవుతాను కాబట్టి నేను నిరంతరముకర్మలు చేస్తూనే ఉంటాను.
అర్జునా! నేను కూడా ఏ పనీ చేయకుండా సన్యాసిలాగా ఉంటే, ఈ ప్రపంచం కూడా నన్నే అనుసరిస్తుంది. లోకమంతా నిర్వీర్యం అవుతుంది. కాబట్టి నేను కూడా సామాన్య మానవుని వలె కర్మలు చేస్తున్నాను. అలా చేయకపోతే నన్ను అనుసరించే వాళ్లు కూడా చేయవలసిన కర్మలు చేయకుండా సోమరులు అవుతారు. ఆ కారణంగా ఈ లోకములు నిర్వీర్యం కావడానికి నేనే కారణం అవుతాను. నా వలననే ఈ లోకంలో ఉన్న మానవులు సందిగ్ధంలో పడి కర్మలు మానివేసి పతితులవుతారు. లోకంలో అశాంతి ఏర్పడుతుంది. ప్రజలు అన్యాయాన్ని, అధర్మాన్ని ఆశ్రయిస్తారు. దాని ఫలితంగా ఉత్పాతాలు ఉపద్రవాలు సంభవిస్తాయి. ఈ విధంగా నేను లోకుల యొక్క వినాశనానికి కారణం అవుతాను, లోకులను చెడగొట్టినవాడిని అవుతాను. కాబట్టి లోక క్షేమం కోరి నేను కర్మలు చేస్తున్నాను. నేను లోకం క్షేమం చూడాలి కానీ లోకాలను సంక్షోభంలోకి నెట్టకూడదు. ఇదే విధంగా జీవన్ముక్తులు అయిన వారు కూడా లోక కళ్యాణం కొరకు సాటి మానవుల క్షేమం కొరకు కర్మలు చేయక తప్పదు. ఎందుకంటే పుట్టిన ప్రతివాడూ కర్మలు చేయడం అతని సహజ ధర్మం. కాబట్టి నీవు కూడా నీ విద్యుక్త కర్మ అయిన యుద్దం చెయ్యి. అని కృష్ణుడు తననే ఉదాహరణగా చెప్పుకుంటూ అర్జునుడికి శతవిధాలా బోధించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. (ఇంతకు ముందు అర్జునుడు మాట్టాడినప్పుడు తాను యుద్ధం చేస్తే, ఆ యుద్ధంలో అందరూ చనిపోతే, వర్ణసంకరం అవుతుంది అని అంటే ఇప్పుడు కృష్ణుడు, ఎవరి ధర్మం వారు నిర్వర్తించకపోతే అంటే నా ధర్మం నేను నిర్వర్తించకపోతే కూడా సంకరం అవుతుంది అని మాటకు మాట బదులు చెప్పాడు.)
ఈ శ్లోకంలో సంకరం అనేమాట వాడారు. అంటే ఏం చెయ్యాలో ఏం చెయ్యకూడదో అనే స్థితి (కన్ఫ్యూజన్). అప్పుడు చేయకూడని పనులే సాధారణంగా చేస్తారు. చేయాల్సిన పనులు చేయరు. సాధారణంగా వర్ణ సంకరము, జాతి సంకరము అని వింటూ ఉంటాము. వాటి గురించి చిన్న వివరణ. మనిషి పుట్టిన తరువాత, ఆడ కానీ మగ కానీ ఏదో ఒకపని చేయాలి. ఏ పని చేయాలో ఎవరికి వారు ఎన్నుకోవాలి. అది వారి వారి సామర్ధ్యము, అర్హత, అభిరుచి అంటే ఆసక్తి, వీటి మీద ఆధారపడి ఉంటుంది. దీనినే ఎవరి గుణములను బట్టి వారు కర్మలుచేయడం అంటారు. ఎందుకంటే ఎవరైతే ఆసక్తితో పని చేస్తారో వారు ఆ పని చేయడంలో ఆనందం అనుభవిస్తారు.ఇష్టం లేని పని, ఆసక్తి లేని పని ఏడుస్తూ చేస్తారు. ఇది ప్రాధమిక సూత్రము. ఈ సూత్రము ఆధారంచేసుకొని వర్ణవ్యవస్థ(ఈ నాటి భాషలో చెప్పుకోవాలంటే కులవ్యవస్థ) ఏర్పడింది. ఈ వ్యవస్థలో మంచి చెడు రెండూ ఉన్నాయి. అది నిర్వివాదాంశము. అందరికీ అన్ని పనులు చేసే సామర్థ్యము, ఆ పనులలో ఆసక్తి ఉండటం కుదరదు కాబట్టి పూర్వీకులు మానవులను నాలుగు భాగాలుగా విభజించి ఒక్కోభాగానికి ఒక్కో వర్ణము అని పేరు పెట్టారు. సమాజం ఆయా వర్ణముల వారికి కొన్ని కొన్ని పనులు అప్పగించింది. ఆ పనులు వారే చేయాలని నిర్దేశించింది. కానీ కొంత మందికి మినహాయింపు కూడా ఇచ్చింది. ఒక వర్ణములో పుట్టినవాడు మరొక వర్ణముల వారు చేసే పనుల మీద ఆసక్తి, నైపుణ్యం ఉంటే ఆ వర్ణములోకి మారవచ్చును అని మినహాయింపు ఇచ్చింది. కాని కొన్ని నిబంధనలకు లోబడి ఆ మినహాయింపు వర్తిస్తుంది. క్షత్రియుడుగా పుట్టి బ్రాహ్మణులు అయిన వారు, బ్రాహ్మణులుగా పుట్టి క్షాత్రము అవలంబించిన వారు మనకు పురాణాలలో ఇతిహాసాలలో కనపడతారు. ఈ వర్ణవ్యవస్థ లేకపోతే అందరూ అన్ని పనులు చేసి ఏదీ సరిగా చేయకుండా అంతా అభాసుపాలయ్యే ప్రమాదం ఉంది. అందుకే వర్ణ వ్యవస్థ అందరూ విధిగా పాటించాలి అని నిర్దేశించింది.
ఇది ఒక్క భారతదేశానికే పరిమితం అని చాలామంది అపోహ పడుతుంటారు. కాని ఇది ప్రపంచవ్యాప్తంగా ఉంది. మనం బ్రాహ్మణ వర్ణము అంటే ఇతర దేశములలో వారు ప్రీస్ట్ క్లాస్ అంటారు. మనం క్షత్రియులు అంటే వారు వారియర్స్ క్లాస్ అంటారు. మనం వైశ్యులు అంటే వారు బిజినెస్ క్లాస్ అంటారు. మనం శూద్రులు అంటే వారు వర్కింగ్ క్లాస్ అంటారు. పేరు భేదం కానీ వ్యవస్థ ఒకటే. అంత దాకా ఎందుకు మనలో కూడా డాక్టర్ కొడుకులు కూతుళ్లు డాక్టర్లు అవుతున్నారు. అలాగే లాయర్ కొడుకు లాయర్, ఐఏయస్ ఐపియస్ ఆఫీసర్ల సంతానం అలాగే అవుతున్నారు. ఇంక రాజకీయనాయకుల సంగతి, సినీ హీరోల సంగతి చెప్పనక్కరలేదు. ఇవన్నీ తల్లి తండ్రుల నుండి పరంపరానుగతంగా సంక్రమించే వ్యవస్థలు. అలాగే వర్ణవ్యవస్థ కూడా జన్మను బట్టి కాకుండా వారి వారి అభిరుచులను బట్టి, గుణములను బట్టి, వారు చేసే కర్మలను బట్టి పెంపొందింది. కాని అది ఈనాడు మానవుల స్వార్ధముతో రాజకీకయంతో పెనవేసుకొని వెర్రితలలు వేసింది. ఈ వర్ణవ్యవస్థలో కూడా కొంత మందికి వారి వారి ఆసక్తి నైపుణ్యమును బట్టి ఆయాపనులు వారికి అప్పగించింది. అందుకే చాతుర్వణ్యం మయాసృష్టం గుణ కర్మ విభాగయో: అన్నాడు పరమాత్మ. వారి వారి గుణములు, వారు చేసే కర్మలు, అందులో వారు చూపే ఆసక్తి నైపుణ్యమును బట్టి వర్ణములుగా విభజింపబడ్డారు కానీ ఒకరు ఎక్కువ మరొకరు తక్కువ అని కాదు. వర్ణ వ్యవస్థను ఈ విధంగా అర్థం చేసుకుంటే ఏ ఇబ్బందీ ఉండదు.
ఈ వర్ణవ్యవస్థను సరిగా పాటించకపోతే సంకరం అంటే కంప్యూజన్ అవుతుంది. పెద్దలు వర్ణవస్థను, కర్తవ్యకర్మలను సరిగా పాటిస్తేవారిని చూచి తరువాతి తరం వారు నేర్చుకుంటారు. సమాజం సక్రమంగా నడుస్తుంది. లేకపోతే అందరూ అన్ని కర్మలు చేయడం మొదలుపెడితే సంకరం (కన్ఫ్యూజన్) అవుతుంది. మరి ఈ కర్మలు ఎలా చేయాలో తరువాతి శ్లోకంలో వివరిస్తున్నాడు పరమాత్మ.
(సేకరణ)
*🌹యోగక్షేమం వాహామ్యహం 🌹*
(రచన: శ్రీ మొదలి వెంకట సుబ్రహ్మణ్యం, రిటైర్డ్ రిజిస్ట్రార్, ఏ. పి. హైకోర్టు.)
P181
No comments:
Post a Comment