Thursday, October 23, 2025

 7️⃣6️⃣

*🛕🔔భగవద్గీత🔔🛕*
  _(సరళమైన తెలుగులో)_

  *మూడవ అధ్యాయము* 

    *కర్మయోగము.*  

*30. మయి సర్వాణి కర్మాణి సన్న్యస్యాధ్యాత్మ చేతసాl*
 *నిరాశీర్నిర్మమో భూత్వా యుధ్యస్వ విగతజ్వర:||*

ఓ అర్జునా! నీ చిత్తమును పరమాత్మ యందు నిలిపి, కర్మలను అన్నిటినీ అధ్యాత్మ చిత్తముతో ఆ పరమాత్మకు అర్పించి, ఆశ, మమకారము, మమత, అనురాగము మొదలగు ఆశాపాశములను వదిలిపెట్టి, క్షత్రియ ధర్మము అయిన యుద్ధం చెయ్యి.

ఇందులో అధ్యాత్మ చేతసా అనే పదం వాడారు. అంటే మనసు ఆత్మయందు నిలపాలి. ఆత్మయందు నిలిపిన మనసుతో అంటే భగవంతుని మీద నిలపబడిన మనసుతో అని అర్ధం. నిర్మలమైన మనసు ఎల్లప్పుడూ భగవంతుని మీద నిలిచి ఉంటుంది అని అర్ధం. ఎందుకంటే మానవులు సాధారణంగా ప్రాపంచిక విషయములనే ఆలోచిస్తుంటారు. వాటి యందే ప్రవర్తిస్తుంటారు. ఎన్నో విషయాలను చూస్తుంటారు, వింటుంటారు, తాకుతుంటారు. వాటి యందు ఆసక్తి కలిగి ఉంటారు. అటువంటి మనసును పరమాత్మ యందు నిలపడం చాలా కష్టం. మనసు ప్రాపంచిక విషయములలో లీనం కావడం వలన మలినమైన చిత్తమును ఆధ్యాత్మికమైన చిత్తముగా మార్చడం అంటే మనస్సు భగవంతుని మీద నిలపడం, మనసును నిగ్రహించడం ప్రతి సాధకుడి కర్తవ్యం. కాబట్టి ప్రతిరోజూ కొంచెం సేపు అయినా ప్రాపంచిక విషయములను వదిలిపెట్టి, భగవంతుని ముందు కూర్చుని కళ్లు మూసుకొని మనస్సును నిగ్రహించి భగవంతుని మీద నిలపడం మానవుని కర్తవ్యం. ఎల్లప్పుడూ మనస్సు పరమాత్మ భావముతో నిండి ఉండాలి. మమత, మమకారమములను, ఆశలను, సంతాపములను దూరంగా ఉంచాలి. దానినే ఆధ్యాత్మ చిత్తము అని అంటారు.

సర్వాణి కర్మాణి అనే పదం కూడా వాడారు. అంటే ఏదో ఒక కర్మ అని కాకుండా అన్ని కర్మలను పరమాత్మ పరంగా చేయాలి. అన్ని కర్మలను పరమాత్మకు అర్పించాలి. నిరాశీ నిర్మమో అంటే ఆశ లేకుండా, మమత మమకారములు లేకుండా కర్మలు చేయాలి. ఒక్క మాటలో చెప్పాలంటే పరమాత్మ అనే మాట తప్ప మరొక మాటకు మన మనసులో చోటు ఉండకూడదు అని భావన, ఎందుకంటే ఈ ప్రపంచంలో ఆత్మ ఒకటే సత్యము మిగిలినవి అన్నీ అసత్యములు, కల్పితములు, అశ్వరములు. అటువంటి ప్రాపంచిక విషయముల మీద ఎవరైనా ఆశ మమకారము ఎందుకు ఉంచాలి అని భగవానుడు అడుగుతున్నాడు. కాబట్టి మన మనసులలో నుండి ఆశ మమకారము బయటకు నెట్టెయ్యాలి.

ఇక్కడ మరొక మాట కూడా వాడారు. విగత జ్వరః జ్వరము అంటే తాపము. సంతాపము, ఎందుకంటే జ్వరం వస్తే మనకు ఒళ్లు వేడెక్కి తాపం ఎక్కువ అవుతుంది. ఇది పైకి వచ్చే జ్వరము. మరి లోపల జ్వరము అంటే ప్రాపంచిక విషయముల మీద మమకారము, మమత కలిగి, వాటికి ఆటంకము కలిగితే తాపం ఎక్కువ అవుతుంది. అటువంటి తాపమును పోగొట్టుకోవాలి. కాబట్టి మానవునికి ఉండవలసిన నాలుగు లక్షణాలు భగవంతుడు చెబుతున్నాడు. 1. ఎల్లప్పుడు అధ్యాత్మ చిత్తము కలిగి ఉండటం, 2. నిర్మల చిత్తముతో కర్మలు చేయడం, ఆ కర్మల ఫలితములను పరమాత్మకు అర్పించడం. 3. ఆశాపాశములను వదిలిపెట్టడం. 4. ప్రాపంచిక విషయముల మీద మమకారము వదిలిపెట్టడం. మనలో కలిగిన ఈ ఆశలు, మమతా మమకారాలు అనే జ్వరానికి పైన చెప్పిన నాలుగు మందు గుళికలను సేవిస్తే జ్వరము తగ్గిపోతుంది కాబట్టి అర్జునా! నీవు కూడా నేను, నా వాళ్లు, నా బంధువులు, తాత, తండ్రులు, అన్నదమ్ములు అనే మమత, అనురాగము, ఆశ, మోహము అనే జ్వరమును వదిలిపెట్టి యుద్ధము చెయ్యి అంటున్నాడు పరమాత్మ.

ఇంకొంచెం వివరంగా చెప్పుకోవాలంటే ఈ శ్లోకంలో పరమాత్మ కర్మయోగ సారాన్ని వివరించాడు. కర్మయోగము అంటే ప్రత్యేకంగా ఏమీ లేదు. మనం కర్మ చేసే విధానమునే కర్మయోగము అంటారు. యోగము అంటే కలపడం అని చెప్పుకున్నాము. కర్మలను జ్ఞానంతో కలపడం. జ్ఞానయుక్తంగా అంటే విహితంగా, చేయవలసిన పద్ధతిలో, చేయవలసిన విధానంలో కర్మలు చేయడం. దానికి మొదటి లక్షణం అధ్యాత్మ చేతసుడు అయి ఉండాలి. అంటే వివేకముతో కూడిన బుద్ధి కలిగి ఉండాలి. విచక్షణా జ్ఞానం కలిగి ఉండాలి. ఆధ్యాత్మికంగా ఉన్నతిని సాధించడమే లక్ష్యంగా కలిగి ఉండాలి. అంతే కానీ గొప్ప ధనవంతుడు, ఆస్తిపరుడు, గొప్ప వ్యాపారవేత్త కావడం కాదు. శరీరం నిలబడడానికి ఆహారం తీసుకోవాలి. దానికి కర్మ చేయాలి. శరీరంతో శ్రవణం, మననం, ధ్యానం చేయాలి. ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలి. దీనినే అధ్యాత్మచేతన అని అంటారు. అంతేకానీ నాకు, నా పిల్లలకు, వారి సంతానానికి, వారి వారి సంతానానికి సంపాదించడం కూడబెట్టడం కాదు. ఇది జీవన విధానం కాదు. ఎంతవరకు అవసరమో అంటే సంపాదించుకోవాలి, దొరికిన దానితో తృప్తి చెందాలి అని చెప్పాడు పరమాత్మ.

మానవులు ఏ కర్మచేసినా దాని ఫలితాన్ని పరమాత్మకు అర్పించాలి. అన్ని కర్మలు పరమాత్మ కోసమే చేయాలి. కర్తృత్వభావన ఉండకూడదు. నేను ఈ కర్మ చేస్తున్నాను అనే అహంకారము ఉండకూడదు. నీవు సమర్పించినా సమర్పించకపోయినా అన్ని కర్మల ఫలములు భగవంతునికే చెందుతాయి. కాని మనం అర్పిస్తే మన బరువు తగ్గుతుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది. లేకపోతే ఆ కర్మల ఫలములు మన మనసుకు దుఃఖమును కలిగిస్తాయి. ఇదే ఇందులో రహస్యం.

ఆశ, మమకారము, ప్రతి వాడికి ఉంటాయి. ఆశ లేనివాడు బతకలేడు అని మనందరికీ తెలుసు. కాకపోతే ఆశతో పని చేయాలి. చేసే పని మీద మమకారం ఉండాలి. కాని ఆ ఆశ, మమకారము శృతి మించకూడదు. పరిమితంగా ఉండాలి. దాని గురించి తాపత్రయపడకూడదు. అందరూ నా మాట వినాలి. నేను చెప్పినట్టు చేయాలి నేను చేసిన కర్మలకు మంచి ఫలితాలు రావాలి అని అనుకోకూడదు. ఎందుకంటే కోరుకున్న ఫలితాలు రాకపోతే నిరాశ చెందవలసి వస్తుంది. నిర్మమో అంటే మమ అనే భావన లేకుండా కర్మ చెయ్యాలి. 'మమ' అంటే నేనే ఈ పని చేస్తున్నాను. నా వలననే ఈ పని జరుగుతూ ఉంది అనే భావనతో చెయ్యడం. అందుకే కర్మ చెయ్యి ఆ కర్మను పరమాత్మ పరంగా చెయ్యి ఆ కర్మ ఫలితం ఆశించకు. సక్సెస్ వస్తే సంతోషపడు అంతే కానీ నా వలననే వచ్చింది అని విర్రవీగకు. ఎందుకంటే ఆ ఫలితం ఏ ఒక్కరిదీ కాదు. అందరిదీ. అందరూ కలిసి పనిచేస్తేనే ఆ విజయం దక్కింది అని తెలుసుకోవాలి.

తరువాత మనలను పట్టి పీడించేది మరొకటి ఉంది. అదే మానసిక జ్వరము. శరీరానికి జ్వరం వస్తే మందు వేసుకోవచ్చు. మనస్సుకు జ్వరం వస్తే శాంతి ఉండదు. టెన్షన్, వర్రీ, కంగారు, ఏం చేయ్యాలో తోచదు. కోపం వస్తుంది. ఇదంతా మానసికంగా ఏదో జరుగుతోంది అనే సూచన. నచ్చని పని చేయడం, చేసిన పని నచ్చకపోవడం, నచ్చిన ఫలితం రాకపోవడం, వచ్చిన ఫలితం నచ్చకపోవడం ఇలాంటివి మానసిక అశాంతికి కారణాలు. అలా కాకుండా ఈ ఫలితం నాది కాదు ఏ ఫలితం వచ్చినా అది పరమాత్మ ప్రసాదము అని అనుకుంటే ఎటువంటి అశాంతి ఉండదు. వచ్చిన ఫలితాన్ని పరమాత్మకు అర్పిస్తే ఏ చిక్కు ఉండదు. దానినే విగతజ్వరః అని అన్నారు. పరమాత్మ కాబట్టి నీలో చెలరేగిన ఆశాపాశాలు మమతా మమకారాలు అనే జ్వరాన్ని విడిచిపెట్టి యుద్ధం చెయ్యి అని బోధించాడు.
(సేకరణ)

*🌹యోగక్షేమం వాహామ్యహం 🌹*

 (రచన: శ్రీ మొదలి వెంకట సుబ్రహ్మణ్యం, రిటైర్డ్ రిజిస్ట్రార్, ఏ. పి. హైకోర్టు.)
                                 P191

No comments:

Post a Comment