జిహ్వని బట్టి జీవితం
ఒంటె బ్రహ్మజెముడు మొక్కల్ని ఇష్టంగా తింటుంది. ముళ్లు గుచ్చుకుని నోట్లోంచి రక్తం కారుతున్నా తినడం మానదు. మనమూ ఒంటెల్లాంటి వారమే. శరీరతత్వానికి పడని, డాక్టరు కచ్చితంగా కూడదు అన్నవి- నాలుకను అదుపులో పెట్టుకోలేక తింటూ ఉంటాం. కడుపులో మంట, అల్సర్లు వస్తే మందులు వాడతాం, అదుపులోకి రాగానే మళ్లీ అదే తిండి. రక్తపోటు, మధుమేహం... ఏ జబ్బైనా సరే, మందులతో కాస్త తగ్గిందంటే చాలు మళ్లీ నాలుక రుచుల్నే కోరుతుంది. దానివల్ల ఆరోగ్యం, మనసుపైన నియంత్రణ పోతాయి. చేప జిహ్వ చాపల్యంతో ఎరకు చిక్కి ప్రాణాలు కోల్పోతుంది. నాలుకను ఒక్కదాన్ని నియంత్రించగలిగితే, అన్ని ఇంద్రియాలపై నియంత్రణ సాధించవచ్చు.
గుర్రం పరుగును నియంత్రించేందుకు రౌతు దానికి కళ్లెం వేసినట్లే, మనం కూడా నాలుకకు పగ్గాలు బిగించాలి. తప్పు దోవ పట్టకుండా మనసును నియంత్రించాలంటే-ముందుగా ఆహారపు అలవాట్లపై నియం త్రణ తెచ్చుకోవాలి. తినకూడదు అనుకున్న వాటికి దూరంగా ఉండగలగాలి. మాట మీద అదుపుండాలి. ఇతరులను నిందిస్తున్న మనిషిని చూసి సాయిబాబా ఈ విషయమే మరోలా చెప్పారు- 'నువ్వు ఎదుటి మనిషిని నిందిస్తున్నావు అంటే అతని మలినాన్ని నీ నాలుకతో శుభ్రం చేస్తున్నావని అర్థం. రుచులకోసం పాకులాడవద్దు. ఏదో ఒక పదార్థంతో సరిపెట్టుకో' అని తన ముఖ్య సేవకుడైన అబ్దుల్ అన్నారు. సాయి రోజూ అయిదు ఇళ్లలో భిక్షాటన చేసి మసీదులోని పాత్రలో వేసేవారు. మసీదును శుభ్రం చేసేవారు అందులోంచి కొంత తీసుకెళ్లేవారు. ఆపైన పిల్లులు, కుక్కలు తీసుకుని తినేవారు సాయిబాబా. అంతటా తానే అయినవారికి, అన్ని జీవుల్లో ఉన్నదీ తామేనని తెలిసినవారికి అదేం పెద్ద విషయం కాదు. మహాత్ములకు, సాక్షాత్తూ ఆ పరబ్రహ్మ స్వరూపులకే ఇది చెల్లుబాటు అవుతుంది కానీ, మనలాంటి వారికి కాదు. కంచి పరమాచార్య జగద్గురు శ్రీచంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి దాదాపు నూరేళ్లు జీవించారు. ఒకపూట ఎవరో ఆయనకి భోజనం వడ్డిస్తున్నారు. స్వామీజీ ఓ పదార్థాన్ని హితవుగా తినడం చూసి దాన్ని ఒకటికి రెండుసార్లు వడ్డించారు. తరవాత మూడు రోజులు ఆయన తన గదిలో నుంచి బయటికి రాలేదు. ఏం అపరాధం జరిగిందోనని కంగారుపడిన భక్తులు ఆయన నాలుకపై వాత చూసి కన్నీటి పర్యంతమయ్యారట. 'బాధపడకండి. మీ తప్పు లేదు. మీరు వడ్డిస్తే మాత్రం సర్వసంగ పరిత్యాగులమని చెప్పుకొనే మేమెందుకు తినాలి? అందుకే ఈ దండన' అన్నారట స్వామీజీ
వైద్యుడు మన నాలుకను చూసి ఆరోగ్య స్థితిని తెలుసుకున్నట్లే, నాలుక మన ఆత్మీయ స్థితిని చెబుతుందని పెద్దల మాట. ఎంతో చిన్నదైన నిప్పురవ్వ విస్తారమైన అడవిని తగులబెడుతుంది. నాలుక కూడా అగ్ని వంటిదే. ప్రపంచాన్నంతటినీ వశపరుచుకోవడా నికి ప్రయత్నించే మనిషి- ముందు తన నాలుకని స్వాధీనంలో ఉంచుకోవడం అవసరం.
తరిగొప్పుల విఎల్లెన్ మూర్తి
Forwarded useful message
🙏🙏🕉️👆
No comments:
Post a Comment