Saturday, October 18, 2025

 ఓం నమో భగవతే శ్రీ రమణాయ

  ఓసారి విళ్ళిపురంలో రాత్రి రైలు వెళ్ళిపోయింది. మధ్యాహ్నందాకా రైలు లేదు. తెల్లారకట్ట భగవాన్ని చూడడానికి వీలులేకపోయిందే అని విచారపడుతున్నాను. ఆ స్టేషన్ మాష్టారు నా మిత్రుడు. నన్ను గూడ్సురైలు ఇంజన్లో ఎక్కించి పంపాడు. నేను దిగేందుకు రైలు నెమ్మదిగా పోనిచ్చారు. దిగుతూ కింద పడ్డాను. దెబ్బలు తగిలాయి. రోడ్డు కనపడదు. ముళ్ళల్లో, కంచల్లోపడి ఆశ్రమం చేరుకున్నాను. 

  భగవాన్ నా దెబ్బలు చూసి “ఏమిటని?” అడిగారు. తెలుసుకొని “ఎందుకా తొందర?” అని కోప్పడ్డారు. “నీ దర్శనం చేసుకోడానికి” అన్నాను. “దర్శనం కన్న, దర్శనం కోసం ఆవేదన ముఖ్యం” అన్నారు.

   *******

  ఓం నమో భగవతే శ్రీ రమణాయ

భగవాన్ ఎప్పుడూ చెప్పులు వేసుకుని నడవలేదు. భోజనం చేసిన విస్తరి కొత్త విస్తరిలా శుభ్రంగా ఉంటుంది. ఏ పదార్ధము వృధా చేయరాదని అంటారు. ఇంకొక విశేషము ఏమిటంటే అన్ని ఆహార పదార్థాలు కలిపి ఒకటిగా తినేవారు. అందరికీ పెట్టిందే తనకూ పెట్టాలి. తనను ప్రత్యేకంగా చూస్తే ఒప్పుకునేవారు కారు. సన్నిధిలో ఎప్పుడూ అగరు బత్తులు వెలిగించేవారు. శ్రీరమణులు ప్రతి రోజూ బ్రహ్మ ముహుర్తాని కల్లా నిద్ర లేచేవారు.

*******

     ఓం నమో భగవతే శ్రీ రమణాయ

  ఉదయం కాఫీ సమయంలో భగవాన్ తనకు ఒక ఇడ్లీ మాత్రమే వేయించుకునేవారు. భక్తులకు రెండు ఇడ్లీలు వేయమనేవారు. “ఇదేమి అన్యాయం?” అని భక్తులు అంటే, భగవాన్ నవ్వుతూ, “మీరంతా పని చేస్తున్నారు. నేను ఏమి చేస్తున్నాను? ఊరికే కూర్చోవటమే కదా? అనేవారు.

“మేము ఊరికే కూర్చోవటం చేతగాకే ఈ పనులన్నీ పెట్టుకున్నాం. ఊరికే కూర్చోవటం జ్ఞానులకు మాత్రమే సాధ్యం" అని బదులు పలికారు భక్తులు.

   ******

  రాత్రులు నేనూ, భగవాన్ పాలి తీర్థం ఒడ్డున వున్న ఓ పెద్ద చెట్టుకింద తీర్థంలోకి దిగే మెట్ల దగ్గిరగా పడుకుని నిద్రపోయేవారం. “రెండు ఇటిక రాళ్ళు తలకింద పెట్టుకుని తువ్వాలు పరచుకు పడుకో” అనేవారు నన్ను భగవాన్. ఆ మెట్లు సరిగా వుండేవి కావు. ఎగుడు దిగుడు. వాటిమీద పడుకోటానికి వీలయ్యేదికాదు, 

  ఓ రాత్రి భగవాన్ “ఈ మెట్లు సరిగాలేవు. వెళ్ళి ఆ మర్రిచెట్టుకింద వున్న సాధువుల్ని పిలుచుకురా!" అన్నారు. వాళ్ళ సహాయంతో నేనూ, భగవాన్ ఆ పెద్ద రాళ్ళని ఎత్తి సరిగా వరసగా పెట్టి చదునుగా చేశాము. రాత్రి ఎనిమిదికి ప్రారంభించి 12 గంటలకు పూర్తిచేశాము. తెల్లారి చూస్తే బేల్దారీ వాళ్ళు కట్టిన దానికన్న బాగున్నాయి మెట్లు.

*******
    ఓం నమో భగవతే రామకృష్ణాయ
  
   నరేన్ , శారదాదేవితో, 'అమ్మా! ప్రస్తుతం నా వద్ద నుండి సమస్తం ఎగిరిపోతూవుంది. అన్నీ మాయమైపోవడం నేను చూస్తున్నాను' అని చెప్పాడు. అందుకు శారదాదేవి వెంటనే, 'నాయనా! నేను కూడా ఎగిరిపోకుండా చూసుకో!' అన్నది. (మాతృదేవి నవ్వుతూ ఇలా చెప్పారు) 

  అందుకు నరేన్, 'అమ్మా, మిమ్మల్ని ఎగిరిపోనిస్తే నేను ఎవరిని ఆలంబన చేసుకొని జీవించగలను? గురువు పాదపద్మాలను విస్మరించేలా చేసే జ్ఞానం, జ్ఞానం కాదు. అది అజ్ఞానం. ఆ పాదపద్మాలను తీసివేస్తే, ఇక దేనిని ఆలంబన చేసుకొని జీవించడం?' అన్నాడు.

  
*******
మహాభారతం 
ధృతరాష్ట్రుడు 'విదురా! నీ మాటలలో కల్మషం లేదు. నీతివేత్తలందరూ మెచ్చుకొనేవే. రాజనీతిమార్గాన్ని చక్కగా బోధిస్తాయి. అయినా నేను నా కొడుకును వదలలేను. ధర్మం జయిస్తుందని ఊరుకుంటాను" అని అంటాడు.  రాజ్యభాగాలకోసం కొట్టుకొనిగానీ చావరాదా ఏమి? శరీరాలు నశించటానికి మనోవేదనలూ, రోగాలూ, ముసలితనం ఉన్నాయి. మెలకువగా చూస్తే అందరికీ చావు సహజమే కదా!

  ******

ఓం నమో భగవతే శ్రీ రమణాయ

  ఒక భక్తుడు, భగవాన్ని నామాలు పెట్టుకుంటే చూడాలని వుందని చాలాచాలా అడిగారు. భగవాన్ సరేనన్నారు. నాయన(కావ్యకంఠ గణపతి ముని) గారిచేత ముందు పెట్టించాలి అన్నారు భగవాన్. నాయనగారి పక్కన నామమూ, తిరుచూర్ణమూ పెట్టారు. భోజనం దగ్గర ఏదో మాట్లాడుతో ఆయన తెలీకుండానే నామం పెట్టేసుకున్నారు. తరువాత భగవాన్ పెట్టుకున్నారు. కొంచెం సేపటికి నాయనగారు భగవాన్ వంకచూసి - “అదేమిటి? ఆ వేషం ఎప్పుడు వేశారు?" అని నవ్వారు. అందుకు భగవాన్ “నాయనగార్ని చూసి నేనూ వేసుకున్నాను” అన్నారు. “నేనా!” అని అద్దంలో చూసుకుని గణపతిముని తెల్లబోయినారు. అందరూ నవ్వుకున్నారు.

     *******

   ఓం నమో భగవతే శ్రీ రమణాయ

  ఒకసారి మహర్షి సన్నిధిలో ఒక భక్తుడు ఆనందంతో మహర్షికి నమస్కరించి,“మీ దయవల్ల నాకోర్కె నెరవేరింది” అన్నాడు. మహర్షి, భక్తులతో, " అతను గతంలో మనఃస్పూర్తిగా కోరుకున్న కోరిక ఇప్పుడు నెరవేరింది. కర్త(భగవంతుడు) ఏజెంటుగా ఉండి అతను గతంలో కోరిక కోరికనే ఫలింప చేశాడు. ఇందులో మనదేమీ లేదు. అతని కోరికే అతనికి ఫలించింది. 

  ఇంకొక వ్యక్తి కోరుకున్న కోరికలో బలం లేక అది వెంటనే ఫలించదు. అతను భగవాన్ దయ లేక ఫలించ లేదనుకుంటాడు. అతను మనల్ని నిందిస్తాడు. అతని కోరిక ఆలస్యంగా ఫలిస్తుంది. ప్రతి కోరికా ఎప్పటికైనా ఫలిస్తుంది. మనకు రెండిటితో సంబంధం లేదు. నిజం ఇంతే.

  కాబట్టి కోరిక ఫలించినవాడు సంతోషించి పొగిడినా, ఫలించనివాడు బాధతో దూషించినా పడాల్సిందే. తప్పదు” అన్నారు. 

  ఇష్టదేవతలు, గురువులు వరాలు ఇవ్వటం ఇలాంటిదే. మంచి అయినా, చెడు అయినా ఎవరి ఖర్మ వారు అనుభవించ వలసిందే. అదే వరాల, శాపాల రూపంలో ఇష్ట దేవతల, మరియు గురువుల నుండి ఎవరు కోరింది-చేసింది వారికి లభిస్తుంది.

   ******
ఓం నమో భగవతే శ్రీ రమణాయ 

  “నీకు మధురలో ఉండగా జ్ఞానోదయం అయిందన్నమాట. అవునా?” అని అడిగాను భగవాన్ని. అందుకు భగవాన్  "నేను చదువుకుంటుండగా ఓసారి వూరికెనే “అరుణాచలం” నా స్మృతిలోకి వొచ్చింది. నా వొళ్ళంతా మంటలెత్తినట్టయింది. ఆ నిమిషం నుంచి నేను సమాధిలో వున్నాను. నేను మీతో ఆడుకుంటో, మాట్లాడుతో వున్నా, సమాధిలోనే వున్నాను” అన్నారు.

   ******
ఓం నమో భగవతే శ్రీ రమణాయ 
 
  ఒక భక్తురాలు "భగవాన్! నాకేమన్నా మంచిమార్గం చూపండి" అని అడిగింది. అందుకు మహర్షి "ఇప్పుడేం చేస్తున్నారు?" అని అన్నారు. అందుకు ఆమె “మనసు పొంగినప్పుడు త్యాగయ్య కీర్తనలు పాడుకుంటాను, గాయత్రి జపం చేస్తాను" అని అన్నది. అందుకు మహర్షి “సరే. అట్లాగే గాయత్రి జపం చేసుకొనండి. ప్రాణాయామం చెయ్యండి!” ఆమె వెడుతూ వుండగా నా వెనకే, “అద్వైత దృష్టి మానకండి” అన్నారు మహర్షి. ఆ మాటలు నాకర్థం కాలేదు అప్పుడు.    

No comments:

Post a Comment