Saturday, October 25, 2025

 ప్రకృతి వైపుకు పయనం 
-----------------------------------
"ఆకాశం నీలి దుప్పటి కప్పుకుంది
నేల పచ్చని తీవాచీ పరుచుకుంది"
ప్రకృతే ఓ వింతయితే... 
కవి సృజన మనసుకు ఎంత తుళ్ళింత!
తొలకరి చినుకు కోడెదూడ పరుగు
పల్లె అందం పడసు సొగసు
ఎగిరేటి విహంగం జాలువారేటి సెలయేటి ప్రవాహం
మా వంపుసొంపుల కృష్ణవేణి వయ్యారి నడకలు,సంద్రపు అలలు
వాగులూ వంకలూ వసంత కోకిలల మధుర స్వరాలు మంచు తెరలు
వేకువ పసిడి కిరణం సంధ్యా సోయగం
చెట్టూ పుట్ట కొండా కోన 
పండు వెన్నెలా
అలా ఆస్వాదించే మనసు ఉండాలే కానీ
అబ్బురపరిచే ప్రకృతి అద్భుతాలు ఎన్నో ఈ ప్రపంచంలో! 
కవి చూపు చాలా నిగూఢమైనది తాను అనుభూతిని పొందటమే కాదు  
మైమరచే అందాలను మనోరహంగా వర్ణించి పాఠకునికి కనువిందు చేయిస్తాడు
అట్లే తనకూ  ప్రకృతికి మధ్య వారధిగా నిలుస్తాడు
అందుకే కవి ఎన్నటికీ వన్నె తగ్గని నిత్య యవ్వనునిగా
సాహితీ లోకంలో చిరంజీవిగా నిలిచిపోతాడు

కనుకనే సృష్టికర్త విషయమేమోగాని..
భావకవి పట్ల నాకు అపారమైన భక్తి భావం నాకు

మనిషి ప్రశాంతంగా జీవించాలంటే
తాను ప్రకృతి వైపుకు పయనించాలంటాను నేను

ఈ సృష్టిలో మిగిలిన జీవరాసుల కంటే ఎన్నో ప్రత్యేకతలున్న మానవుడు
అప్పుడప్పుడూ తన స్వలాభం కోసం ఎన్నో రంగులు మారుస్తూ ఉంటాడు
కానీ ఎన్నో  వినూత్నమైన రంగుల్ని తనలో నింపుకున్న
 ప్రకృతి ఎప్పటికీ మనిషికి ఎంతో సంతోషాన్ని నింపుతుంది 

సంపన్నుడు అనుభవించడానికి ఎన్నో ఉన్నా ఇంకేవేవో కావాలని పరితపిస్తూ ఉంటాడు
కానీ ప్రకృతి ప్రేమికుడు తనకు ఏమీ లేకున్నా అనుభూతిమయమైన ఆత్మసంతృప్తిని పొందుతాడు
 
ఒక విధంగా చెప్పాలంటే ప్రకృతి ప్రేమికుడు విశ్వ కుబేరుడు 
ఎందుకంటే ఆస్వాదనకు ఏ మూల్యం చెల్లించనవసరం లేదు గదా!
-----------------------------------
మోకా మాధవరావు 
 కడియాల రామయ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (ప్లస్) కాటూరు
💐💐💐💐💐💐💐💐

No comments:

Post a Comment