Friday, January 31, 2020

పిల్లలు - సంస్కారం

పిల్లలకు మంచి సంస్కారం నేర్పించాలని, వారిని గొప్ప వ్యక్తులుగా తీర్చిదిద్దాలని మనం సహజంగా కోరుకుంటాం. విద్యకు ప్రాధాన్యమిచ్చిన సంస్కృతి మనది. పిల్లలు ఏ వయసు నుంచి నేర్చుకోగలుగుతారు, ఏ వయసులో వారికి ఏం నేర్పించగలం అని తరచూ తల్లిదండ్రులు ఆలోచించే ప్రశ్న. పిల్లలు తల్లి కడుపులో ఉండగానే కొన్ని విషయాల్ని గ్రహించగలరని ఇటీవల అనేక పరిశోధనల్లో తేలింది. దీన్ని prnatal learning అన్నారు. ఈ విషయంపై మన పూర్వీకులు పరిశీలించిన విధానాన్ని మహాభారత కాలం నుంచి చూడగలం. తల్లి గర్భంలోని పిల్లలు విషయాల్ని ఎలా గమనిస్తారన్న అంశంపై మన సంస్కృతిలో అనేక కథలున్నాయి.
మనందరికీ తెలిసిన కథ అభిమన్యుడి గురించి. అతడు గర్భంలో ఉండగానే ఒకానొక సమయంలో తల్లిదండ్రుల సంభాషణను విన్నాడట. అర్జునుడు.. సుభద్రతో యుద్ధంలోని వ్యూహాల్ని గురించి ముచ్చటిస్తూ సైన్యాన్ని పద్మవ్యూహంలో ఎలా నిలపాలి అనే విషయంపై చర్చించాడట. మాట్లాడుతూ ఆ మాటల్ని మధ్యలో ఎందువల్లనో ఆపినట్లు.. అందువల్ల అభిమన్యుడికి పద్మవ్యూహంలో ప్రవేశించడం మాత్రమే తెలిసినట్లు భారతంలో గమనిస్తాం. అలాగే భారతంలోని వనపర్వంలో అష్టావక్రుడు అనే మహర్షిని గూర్చి మరొక కథ ఉంది (అధ్యా: 132-34). అష్టావక్రుడు చరిత్రలోని వ్యక్తియే. ఇతడు రాసిన అష్టావక్రసంహిత (అష్టావక్ర గీత) అనే వేదాంత గ్రంథం ప్రసిద్ధమైంది. ఇతని తండ్రి కహూలుడు. అష్టావక్రుడు తల్లి గర్భంలో ఉండగానే తన తండ్రి, తాతలు వేదాన్ని వల్లెవేయడం జాగ్రత్తగా విన్నాడట. ఒకానొక సందర్భంలో అతని తండ్రి ఒక స్వరాన్ని తప్పుగా పలికినపుడు గర్భంలో ఉన్న అష్టావక్రుడు ఆ తప్పును సూచించాడట. ఆ సమయంలో మిగతా శిష్యులు కూడా ఉండటంతో తండ్రి దాన్ని అవమానంగా భావించి గర్భస్త శిశువుకి శాపం పెట్టాడు. దానివల్ల ఆ శిశువు ఎనిమిది వంకరలతో పుట్టాడని, అందువల్ల అతడికి అష్టావక్రుడు అనే పేరు వచ్చిందని చదువుకున్నాం. కాలక్రమేణ అష్టావక్రుడు గొప్ప పండితుడయ్యాడనీ, తండ్రి అనుగ్రహంతో మళ్లీ సాధారణ రూపాన్ని పొందాడని సుదీర్ఘమైన కథ.

మనకు పరిచయం ఉన్న మరొక పురాణగాథ ప్రహ్లాదుడిది. ప్రహ్లాదుడి తండ్రి హిరణ్యకశిపుడు తీవ్రమైన తపస్సు చేస్తున్న సమయంలో అదను చూసి ఇంద్రుడు రాక్షసులపై దాడికి వెళ్లాడట. రాక్షసుల్ని తరిమిన తర్వాత హిరణ్యకశిపుడి భార్య గర్భవతి అని తెలిసిందట. ఆమెకు పుట్టబోయే బిడ్డను కూడా రాక్షసుడే కాబట్టి అతడ్ని సంహరించాలని ఆమెను కూడా బందీగా తీసుకున్నాడట. ఆ సమయంలో నారదుడు ఇంద్రుడ్ని అడ్డుకుని ఆమెకు కలగబోయే సంతానం గొప్ప విష్ణుభక్తుడు అవుతాడనీ, హిరణ్యకశిపుడిని అణచడానికి కూడా కారణమవుతాడని చెప్పడంతో ఇంద్రుడు ఆమెను వదిలాడట. నారదుడు ఆమెను తన ఆశ్రమంలో ఉంచి విష్ణుభక్తి బోధించాడట. నారదుడి విష్ణుభక్తి గానాన్ని గర్భంలో ఉన్న ప్రహ్లాదుడు కూడా విని గొప్ప విష్ణు భక్తుడయ్యాడని భాగవతంలో చూస్తాం.

గర్భంలోనే విద్యను నేర్చిన పై కథల్లాగానే పూర్వ జన్మ సంస్కారంతో జ్ఞానిగా పుట్టిన మరొక కథ కపిలుడు అనే మహర్షిని గూర్చి. కపిలుడు కూడా చరిత్రలోని వ్యక్తే. ఇతణ్ణి సాక్షాత్తు విష్ణువు అవతారంగా భాగవతం వర్ణిస్తుంది. ఇతని తల్లి పేరు దేవహూతి. ఇతడు పుట్టుకతోనే గొప్ప జ్ఞానియైు బాల్యంలోనే తన తల్లికి వేదాంత శాస్త్రంలోని గంభీరమైన విషయాల్ని బోధిస్తాడు.

పిల్లలు ఏ విధంగా తయారు కావాలని తల్లిదండ్రులు తీవ్రమైన విశ్వాసంతో కోరుకుంటే వారు అలాగే అవుతారని చెప్పడానికి మరొక కథ ఉంది. ఇది మార్కండేయ పురాణం (అధ్యా: 21-22) లోనిది. రుతధ్వజుడు గొప్ప ధార్మికుడైన రాజు. గంధర్వ రాజకుమారి అయిన మదాలస అతని భార్య. తన పిల్లలు కూడా మంచి పరాక్రమవంతులైన, ధార్మికులైన రాజులు కావాలని రుతధ్వజుడి కోరిక. తన పిల్లలకి విక్రాంతుడు, శత్రుమర్ధనుడు మొదలైన పేర్లు పెట్టాడు. మదాలస మాతరం ఆ పిల్లల్ని ఆడించే సమయంలో జోలపాటలు పాడుతూ వేదాంతాన్ని చెప్పింది. నీకు జరిగిన నామకరణం కేవలం కల్పన మాత్రమే. నీవు పరిశుద్ధుడైన బ్రహ్మవి, పంచభూతాల వల్ల నీ దేహం ఏర్పడింది, శుద్ధచైతన్య రూపుడైన నీకు ఈ దేహం ఒక తొడుగు మాత్రమే అంటూ జోలపాటలు పాడేదట. ఆ పిల్లలు దానికి అనుగుణంగా బాల్యంలోనే విరక్తిని పొంది రాజ్యాన్ని వదిలి వెళ్లారు. రాజు చాలా బాధపడ్డాడు. నాలుగో కొడుకు పుట్టిన తర్వాత రాజు తన అసహనాన్ని ఆపుకోలేక మదాలసను గతంలోలా చేయకుండా వారించాడు. మదాలస ఆ బాలుడిని లాలించే క్రమంలో నీవు గొప్ప జ్ఞానివై ప్రజారంజకంగా రాజ్యాన్ని పాలిస్తావు అని కోరుతూ జోలపాట పాడిందట. ఆ బాలుడు వారు ఆశించిన విధంగా గొప్ప చక్రవర్తి అయ్యాడట.

పిల్లలు అతి చిన్న వయసు నుంచే అనేక విషయాల్ని గ్రహించగలరనే పరిశీలనను పై కథలో చూడగలం. కథలోనే కాక ఈ విషయంపై శాస్త్రీయ చర్చ చాలాచోట్ల ఉంది. భాగవతంలోనే కపిలుడు తన తల్లికి వేదాంత బోధ చేసిన సందర్భంలో (స్కంధం: 3, అధ్యా: 31) జీవుడు గర్భంలో పడిన సమయం నుంచి క్రమక్రమంగా ఎలా పెరుగుతుంది అన్న విషయాన్ని వర్ణించాడు. ఇదే విషయాన్ని గర్భోపనిషత్తు అనే ఉపనిషత్తు చెబుతుంది. గర్భం ఏర్పడినపుడు తొమ్మిది నెలల వరకు గర్భం ఎలా వృద్ధి చెందుతుంది, ఏయే దశలో ఏయే అవయవాలు ఏర్పడతాయి.. మొదలైన విషయాల్ని గూర్చి ఇది చెబుతుంది.

శిశువు గర్భంలో ఉండే చివరి మూడు నెలల్లో మనసు, శరీరంలోని అవయవాలు ఎలా సంపూర్ణంగా ఏర్పడతాయి అన్న వర్ణన ఇందులో ఉంది. ఆయుర్వేద గ్రంథాల్లోని గర్భసంస్కారం, గర్భిణీ వ్యాకరణం మొదలైన అధ్యాయాల్లో గర్భధారణ సమయంలో తల్లి ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలి, ఎలా మానసికంగా ఉల్లాసంగా ఉండాలి, మంచి పుస్తకాల్ని చదవాలి లేదా లలితమైన సంగీతాన్ని వినాలి మొదలైన వాటిని వివరంగా విశ్లేషించారు.
ఇటీవలి కాలం వరకూ సుమతీ శతకం, వేమన శతకం, భర్తృహరి సుభాషితాలు మొదలైనవాటిని తల్లిదండ్రులు పిల్లలతో వల్లెవేయించేవారు. శతక వాఙ్మయం ప్రపంచంలో మరే సంస్కృతిలోనూ లేదు. జీవితంలోని అనేక సమస్యల్ని అర్థం చేసుకోవడానికి, వాటిని అధిగమించడానికి ఈ సుభాషితాలు తోడ్పడతాయి. ఉదాహరణకు ‘కందుకమువోలే సుజనుడు’ అనే పద్యాన్ని జీర్ణించుకున్నవాడు జీవితంలో వైఫల్యాన్ని ధైర్యంగా ఎదుర్కోగలడు. అలాగే ‘ఆరంభింపరు నీచమానవులు’ అనే పద్యం వ్యక్తిలో ఎంతో ఉత్సాహాన్ని నింపుతుంది. పిల్లలు పెరిగేకొద్దీ వీటిలోని భావాన్ని మరింత లోతుగా జీవితానికి అన్వయించుకోగలరు. ర్యాంకు సాధించలేని విద్యార్థులు తమ జీవితాన్ని అంతం చేసుకోకుండా ధైర్యంగా ఆలోచించగలరు. అర్థం లేని నర్సరీ పాటలు వచ్చిన తర్వాత జీవిత సత్యాల్ని బోధించి మానసిక స్థైర్యాన్ని నింపే సాహిత్యం మనకు దూరమైంది. భారతీయ విద్యా విధానంపై పరిశోధనలు జరిపి అందులోని సూక్ష్మ విషయాల్ని ప్రపంచమంతా అనుసరిస్తున్న సమయంలో మనం వాటికి దూరం కాకుండా రక్షించుకోవడం చాలా అవసరం.

అర్థం లేని నర్సరీ పాటలు వచ్చిన తర్వాత జీవిత సత్యాల్ని బోధించి మానసిక స్థైర్యాన్ని నింపే శతక సాహిత్యం మనకు దూరమైంది.

No comments:

Post a Comment