Thursday, February 13, 2020

అభిమన్యుడు పద్మవ్యూహాన్ని ఎందుకు ఛేదించలేకపోయాడు?

అభిమన్యుడు పద్మవ్యూహాన్ని ఎందుకు ఛేదించలేకపోయాడు?
పద్మవ్యూహం .. మనకు తెలియకుండానే ఈ పదం మనం చాలాసార్లు వాడుతుంటాం . పద్మవ్యూహంలో చిక్కుకుపోయామని అంటుంటాం .. ఏదైనా సమస్యల్లో చిక్కుకుంటే .. పద్మవ్యూహంలో అభిమన్యుడిలా నా పరిస్థితి ఉందని చెబుతాం . కానీ అసలు ఈ పద్మవ్యూహం ఏంటి .. దీని వెనుక ఉన్న రహస్యం ఏంటి .. అభిమన్యుడి దాన్ని ఎందుకు చేధించలేకపోయాడు .. చూద్దాం ..

పద్మవ్యూహం అనేది యుద్ధంలో సైన్యం అనుసరించే వ్యూహాల్లో ఒక వ్యూహం . ఇది శత్రు దుర్భేద్యం . అతిరథ మహారథులకే అంతుపట్టని పరమ రహస్యం . సైన్యం దీన్ని అనుసరిస్తే .. ఎదుటి సైన్యానికి చెందిన ఎంతటి వీరులైనా ఇందులోకి ప్రవేశించడం దుర్లభం . ఒకవేళ ప్రవేశించినా మళ్లీ ప్రాణాలతో వెనక్కి వెళ్లలేరు . మహాభారతంలో పద్మవ్యూహం చేధించడం తెలిసిన వారు నలుగురే .. శ్రీ కృష్ణుడు , అర్జునుడు , ప్రద్యుమ్ముడు , అభిమన్యుడు . అయితే తల్లి కడుపులో ఉన్నప్పుడే తండ్రి చెప్పడం వల్ల అభిమన్యుడికి పద్మవ్యూహ ప్రవేశం మాత్రం తెలుసు .

ఈ పద్మవ్యూహంలో ఏడు వలయాల్లో రథ , గజ , తురగ , పదాతి సైన్యాలతో రూపొందిస్తారు . తామరపువ్వు ఆకారంలో సైన్యాన్ని నిలుపుతారు . ఎంత ధీశాలి అయినా పద్మవ్యూహాన్ని చేధించడం కష్టం .. ఒకవేళ చేధించినా మళ్లీ వెనక్కు వెళ్లలేరు . అభిమన్యుడి విషయంలోనూ అదే జరిగింది . పద్మవ్యూహాన్ని చేధించడం గజ వధ ద్వారా జరగాలని అర్జునుడు సుభద్రకు చెప్పాడు . ఆమె గర్భంలో ఉన్న అభిమన్యుడు దాన్ని విన్నాడు కాబట్టి పద్మవ్యూహాన్ని చేధించ లోపలికి చొచ్చుకెళ్లి కౌరవ సైన్యాన్ని కకావికలం చేశాడు .

అభిమన్యుడి ధాటికి కౌరవ సేన బెంబేలెత్తిపోయింది . అభిమన్యుడికి తోడుగా భీముడు , దృష్టద్యుమ్నుడూ , ద్రుపదుడూ , సాత్యకీ , విరాటుడూ పద్మవ్యూహంలోకి ప్రవేశించారు . అయితే వారిని సైంధవుడు అడ్డుకున్నాడు . అర్జునుడిని తప్ప ఎవరినైనా ఒక రోజు పాటు నిలువరించే వరం సైంధవుడికి ఉంది . దీంతో పాండవసైన్యం .. సైంధవుడి ధాటికి కకావికలమైంది .

అభిమన్యుడు కర్ణుడిని మూర్ఛిల్లపోయేలా చేశాడు . శల్యుణ్ణీ , దుశ్యాసనుణ్ణీ కూడా స్పృహ తప్పేలా చేశాడు . పలువురు వీరులను సంహరించాడు . అభిమన్యుడిని కపటోపాయంతో తప్ప మరో విధంగా నిలువరించలేమని ద్రోణుడు చెబుతాడు . యుద్ధనీతికి వ్యతిరేకంగా అభిమన్యుడిపై కౌరవ యోధులంతా మూకుమ్మడిగా ధాటి చేస్తారు . అతని రధాన్ని విరగ్గొడతారు . నిరాయుధుడిని చేసి బాణాల వర్షం కురిపించారు .

అయినా వెరువని అభిమన్యుడు రథం చక్రం తీసుకుని గిరగిరా తిప్పుతూ రెచ్చిపోతాడు . కౌరవ యోధులు దాన్ని కూడా ముక్కలు చేస్తారు . చివరకు గదతోనూ పోరాడుతాడు . కానీ ఒక్కడు ఎంత సేపని పోరాడగలడు . చివరకు దుశ్శాసనుని కుమారుడితో జరిగిన ముఖాముఖి యుద్ధంలో ఇద్దరూ ప్రాణాలు కోల్పోతారు . ఈ పద్మవ్యూహం గురించి పురాణాల్లో ఉంది . అలాగే .. కర్ణాటకలోని హలిబేడు హోయసలేశ్వర దేవాలయంలోని శిల్పాల్లో అభిమన్యుడు పద్మవ్యూహంలో అడుగుపెడుతున్న దృశ్యం ఇప్పటికీ ఉంది .

No comments:

Post a Comment