Monday, February 10, 2020

నువ్వు తక్కువ వాడివి కావు సామీ

సామీ నువ్వు తక్కువ వాడివి కావు.

పుల్లమామిడి,నిమ్మ,ఉసిరి ,ఉప్పు,కారం,మొ. సృష్టించావు.ఊరగాయ పెట్టుకునే తెలివి ఇచ్చావు ,కానీ ఆశపడి తింటే అల్సర్,బి.పి బహుమతిగా ఇస్తున్నావు. నువ్వు తక్కువ వాడివి కాదు సామీ.

పంచదార, బెల్లం,తియ్యటి పళ్ళు ఇచ్చావు ,కానీ సామీ! ఆత్రపడి తింటే షుగర్ వ్యాధి బహుమతిగా ఇస్తావు నువ్వు తక్కువ వాడివి కాదు సామీ.

మా కాలి గోటికి సరిపోని దోమలను సృష్టించావు.శుచి శుభ్రత లేకపోతే,మాచెమట వాసనతోనే గుర్తుపట్టి మానెత్తురు తాగుతూ మాకు నిద్రపట్టని స్థితి కల్పించావు. నువ్వు తక్కువ వాడివి కావు సామీ.

సంపదలు,ఆస్తులు మా చేత కల్పించి మాలో మేము తన్నుకునేటట్లు,చంపుకునేటట్లు చేస్తున్నావు. నువ్వు తక్కువ వాడివి కావు సామీ.

వేల ఎకరాల స్థలాలు ఆక్రమించిన అసామి దేహాన్ని వదలగానే ఆరు అడుగుల స్థలాన్ని మాత్రమే మిగులుస్తావు. నువ్వు తక్కువ వాడివి కావు సామీ.

రాజ్యాలతో పాటు రాజకీయాలు సృష్టించి ఆప్త మిత్రులకు,అన్నదమ్ములకు,భార్యాభర్తలకు ఎడబాటు చేస్తున్నావు. నువ్వు తక్కువ వాడివి కావు సామీ.

కాషాయం కట్టిస్తావు,ఆస్తులపై బ్రమపుట్టిస్తావు ఆఖరికి బ్రష్టు పట్టిస్తావు. నువ్వు తక్కువ వాడివి కావు సామీ.

నేను,నేను అనే అహం కలిగిస్తావు. అది వదిలితేగాని దగ్గరకు రానీయనంటావు. నువ్వు తక్కువ వాడివి కావు సామీ.

ముప్పయి మూడు కోట్ల దేవతలను సృష్టించావు, నన్నొక్కడినే పూజించమంటావు. నువ్వు తక్కువ వాడివి కావు సామీ.

ఇంద్రియాలను ఇచ్చావు,వాటికి రుచులు పుట్టించావు.అన్నిటిని వదిలితేగాని దగ్గరకు రానియనంటావు. నువ్వు తక్కువ వాడివి కావు సామీ.

పాము పడకపై, శయనించే,అమ్మ చేత కాళ్ళోత్తించకుంటూ మమ్ములను చూసి నవ్వుకుంటావు. నువ్వు తక్కువ వాడివి కావు సామీ.

కానీ సామీ. ఇలా అన్నింటినీ వదలడం నా వల్ల కాదు. నీ పాదాలు పడితే నీవే నన్నెెత్తుకుంటావు సామీ!.

నేనూ తక్కువ వాడిని కాదు సామీ .

No comments:

Post a Comment