Saturday, February 29, 2020

Empty Mind – Open Mind

Empty Mind – Open Mind

” ఆధ్యాత్మిక శాస్త్రం మనకు మౌలికంగా రెండు విషయాలను గురించి తెలియజేస్తుంది. అవి .. ఒకటి ‘శ్రుతి’, రెండు ‘స్మృతి’.
” ‘శృతి’ అంటే తెలియని విషయాలను గురించి శ్రద్ధగా విని తెలుసుకోవటం. ‘స్మృతి’ అంటే మనకు తెలిసిన విషయాలను గురించి కూలంకషంగా ఆకళింపు చేసుకోవడం. వీటినే ఆంగ్లంలో “Empty Mind – Open Mind”
అంటాం.

“శూన్యపు మనస్సు .. Empty Mind .. గా వుంటే మనం ఏదైనా విషయాన్ని వినడానికీ మరి ఏదైనా ఒక అనుభవాన్ని పొందడానికీ సిద్ధంగా ఉంటాం. అలాగే Open Mind గా వుంటే అలా పొందిన అనుభవాన్ని చక్కగా ఆకళింపు చేసుకోగలుగుతాం.

అప్పుడే మనకు ప్రక్కవాళ్ళు అర్థం అవుతారు మరి సమస్త సృష్టి అంతా కూడా అవగాహనకు వస్తుంది. ఇదంతా కూడా ధ్యానం చేస్తేనే మనకు సాధ్యం అవుతుంది. ఎంత బాగా ధ్యానం చేస్తే అంత బాగా Empty Mind విస్తృతం చెందుతుంది. మరి ఎంత బాగా ధ్యానం చేస్తే అంత బాగా Open Mind అభివృద్ధి చెందుతుంది. అప్పుడే మనలో అత్యంత శక్తివంతమైన ‘సహజ అవబోధ’ అంటే ‘ Intution’అన్న ఆత్మశక్తి మేల్కొంటుంది.

“ఇందుకుగానూ మనం అన్ని ఆధ్యాత్మిక గ్రంథాలను చదవాలి, సకల చరాచర సృష్టిలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. మరణానికి ముందు మరి మరణం తరువాత ఉండే జీవితాన్ని గురించి తెలియజేసే సరస్వతీ విజ్ఞానాన్ని ఔపోసన పట్టాలి. ఒక ఆధ్యాత్మిక శాస్త్రజ్జుడిలా ఆయా సూక్ష్మ శరీర అనుభవాలను ప్రత్యక్షంగా పొందాలి. ఆయా రంగాలలో విశేషంగా కృషి చేసిన యోగుల జీవిత చరిత్రలను శ్రద్ధగా అధ్యయనం చెయ్యాలి.

“అలా చేసి .. ‘చూసేదీ- చూడబడేదీ ఒక్కటే అన్న ప్రత్యక్ష అనుభవాన్ని పొందాలి. అదే ‘నిర్వాణం’ అంటే! బుద్ధుడు చేసిందీ అదే, వేదవ్యాసుడు చేసిందీ అదే .. రాముడూ, కృష్ణుడూ, శిరిడీసాయిబాబా, ఏసుక్రీస్తు, రమణమహర్షి, అవతార్ మెహర్ బాబా, మేడమ్ బ్లావెట్‌స్కీ చేసిందీ అదే ! మరి మనం కూడా వాళ్ళ కోవలోకే చెందితే ఎంత బాగుంటుంది!

“తమోగుణిగా ఉంటూ ‘నా కెందుకులే’ అనుకుంటే లాభంలేదు. రజోగుణిగా ఉంటూ ‘అన్నీ నాకు తెలుసులే’ అనుకుంటే కూడా లాభం లేదు. శుద్ధ సాత్వికులుగా ఉంటూ, ‘అన్నీ తెలుసుకోవాలి’ అన్న స్ఫూర్తితో సంసారంలో ఉంటూనే ధ్యానసాధన, స్వాధ్యాయం మరి సజ్జన సాంగత్యం ఒక్కొక్కటిగా చెయ్యాలి. అప్పుడే అన్నీ అర్థం అవుతూ ఉంటాయి.

అందుకు గాను మనకు హిమాలయాల అంత వినయం ఉండాలి. మేరు పర్వతం అంత సహనం వుండాలి. మరి చెప్పనలవి కానంతగా నియమనిష్టలు ఉండాలి. లేకపోతే ‘చూసేది వేరే .. చూడబడేది వేరే’ అన్న గందరగోళంతో జీవితాన్ని అస్తవ్యస్తం చేసుకుంటూ ‘సంసారం’ లో మునిగిపోతాం!

“ఒకానొక నాణేనికి బొమ్మా, బొరుసూ ఉంటేనే విలువ ఉన్నట్లు Empty Mind మరి Open Mind రెండూ ఉంటేనే మన జీవితం కూడా సార్థకం అవుతుంది. కనుక సమయాన్ని వృధా చేసుకోకుండా కళ్ళురెండూ మూసుకుని ధ్యానంలో కూర్చుని వినియోగకరమైన మరి ఉభయకుశలోపరి అయిన ఆలోచనలతో మన గురించి మనం వెతుక్కోవాలి.

“అసలు కళ్ళు మూసుకోవడమే చేతకాకపోతే .. ఒక చోట కూర్చోవడమే చేతకాకపోతే .. మన గురించి మనం తెలుసుకునేదెప్పుడు? మన చుట్టూ ఉన్న వాళ్ళను అర్థం చేసుకునేదెప్పుడు? మరి ఈ సకల సృష్టిని అవగాహన చేసుకునేదెప్పుడు? మన జీవితకాలం సద్వినియోగం అయ్యేదెప్పుడు?

“కనుక విశేషంగా ధ్యానసాధన చెయ్యాలి; విశేషంగా స్వాధ్యాయం చెయ్యాలి .. మరి విశేషంగా సజ్జన సాంగత్యం చెయ్యాలి. కళ్ళు రెండూ మూసుకుని కూర్చునీ, కూర్చునీ ఒకానొక సిద్ధార్థుడు బుద్ధుడు అయినట్లు మనం అందరం కూడా బుద్ధుళ్ళం కావాలి!

No comments:

Post a Comment