Wednesday, March 18, 2020

స్త్రీ నిజంగా కోరుకునేదేంటి?

స్త్రీ నిజంగా కోరుకునేదేంటి?
-------------------------------------------

అనగనగా ఒక యువరాజు. శత్రుదేశపు రాజు చేసిన దండయాత్రలో రాజ్యాన్ని పోగొట్టుకుని, అతని చేతికి బందీగా చిక్కాడు. అలా తన చేతికి చిక్కిన యువరాజును శత్రుశేషం లేకుండా చంపేద్దామనే అనుకున్నాడు శత్రురాజు. కానీ ఆ యువరాజుకు అశేష అభిమానులు ఉన్నారు. అప్పటికే ప్రజల్లో తిరుగుబాటు సంకేతాలు కనబడుతున్నాయి. అందుకని ఒక షరతు పెట్టాడు శత్రురాజు.

షరతు ప్రకారం రాజు అడిగే ఒక క్లిష్టమైన ప్రశ్నకు యువరాజు సమాధానం చెప్పాలి. కఠినమైన ప్రశ్న కాబట్టి, ఒక సంవత్సరం గడువు కూడా ఇచ్చాడు. పైగా మరో వెసులుబాటు కూడా ఉంది. రాజ్యమంతా కలియతిరుగుతూ ఆప్తులను, మేధావులను, పండితులను, అనుభవజ్ఞులను ఎవరినైనా సంప్రదించి సలహా తీసుకోవచ్చు. సంవత్సరం తర్వాత ఆ ప్రశ్నకు సరైన సమాధానం చెప్తే యువరాజుకు ప్రాణాలతో పాటు, స్వేచ్ఛ కూడా లభిస్తుంది. చెప్పలేకపోతే మరణదండన తప్పదు. ఈ షరతుకు యువరాజుతో పాటు, ప్రజలందరూ అంగీకరించారు. అప్పుడు శత్రురాజు ప్రశ్న ఏమిటో చెప్పాడు.

ప్రశ్న: " స్త్రీ నిజంగా కోరుకునేది ఏమిటి? "

మొదట ఓస్ ఇంతేనా! అనిపించిన ప్రశ్న కాస్తా, ఆలోచించేకొద్దీ జటిలమనిపించింది.

'అవును! కష్టమైన ప్రశ్నే' అన్నారు మేథావులు.

'ఊహకు అందడం కష్టం' అన్నారు కవులు.

ఇంక లాభం లేదని యువరాజు నగరం మీద పడ్డాడు. ఏకంగా ఆడవాళ్ళనే అడిగి చూసాడు. చర్చాగోష్టులు నిర్వహించాడు. అయినా సరైన సమాధానం దొరకలేదు. మరోవైపు సమయం మించి పోతోంది.

చివరికి ఎవరో పెద్దమనిషి సలహా ఇచ్చాడు. ఆ రాజ్యంలో జనావాసాలకు దూరంగా నివసించే మంత్రగత్తె మాత్రమే ఈ ప్రశ్నకు సరైన సమాధానం చెప్పగలదు అన్నాడు.
ఆమె గురించి తెలిసిన వాళ్ళంతా ఔను నిజమే! అంటూ అతనితో ఏకీభవించారు. యువరాజు కూడా ఆమె గురించి గతంలో విన్నాడు. అయితే ఆమెతో లావాదేవీలు చాలా కష్టం. భారీ ప్రతిఫలాన్ని కోరుతుంది. అసలే రాజ్యం పోగొట్టుకుని ఉన్న తాను ఆమె కోరినంత ఇవ్వడం అయ్యేపని కాదు. అందుకని ఆ ప్రయత్నాన్ని చేయలేదతను.

ఇక ఆఖరు రోజు రానే వచ్చింది. మరణదండన తప్పేట్టులేదు. ఏం చేయడమా అని ఆలోచిస్తుంటే అతని ప్రాణ స్నేహితుడు వచ్చాడు. అతను గతంలో యువరాజు సైన్యంలో ఒక ముఖ్యుడుగా ఉండేవాడు. అతను అందగాడు, ధీరుడు, వీరుడు, నవయవ్వనుడు.

"ఉన్న ఒకే ఒక అవకాశం మంత్రగత్తెను కలవడం. అసలామెను కలిస్తేనే కదా ఆమె అడిగే ప్రతిఫలం గురించి తెలిసేది. అంతగా ఆమె అడిగింది మనం ఇవ్వలేనప్పుడు చూద్దాం. ముందు వెళ్దాం పద!" అన్నాడు.

ఇద్దరూ ఆమె దగ్గరికి వెళ్ళారు. ప్రశ్న విన్న ఆమె సమాధానం చెప్పడానికి అంగీకరించింది. అయితే ప్రతిఫలంగా డబ్బుకు బదులు మరొకటి అడిగింది. అదేమిటంటే యువరాజుతో పాటుగా వచ్చిన స్నేహితుడు ఆమెను పెళ్ళి చేసుకోవాలి.

ఉలిక్కిపడ్డాడు యువరాజు.
పళ్ళన్నీ రాలిపోయిన పండు ముసలిది. చూస్తేనే అసహ్యం వేసే కురూపి. దానికి తోడు మాటకు మాటకు మధ్య ఏదో జబ్బువల్ల నోటినుంచి వస్తున్న జుగుప్సాకరమైన శబ్దాలు. శరీరం నుంచి భరింప లేనంతగా దుర్వాసన. అలాంటి స్త్రీని పెళ్లి చేసుకోమని ఎలా అనగలడు? తన ప్రాణం కోసం స్నేహితుడి జీవితాన్ని నరకంలోకి తోయాలా?

'కుదరదు' అంటూ వెనుతిరిగాడు యువరాజు. స్నేహితుడు ఆపాడు.

'నీ ప్రాణం కంటే నాకేదీ ఎక్కువ కాదు. నీకు సాయం చేయగల అవకాశం వచ్చాక కూడా, దాన్ని వదులుకుంటే, నా స్వార్థం నేను చూసుకుంటే, స్నేహానికి విలువేంటి?' అన్నాడు.

'అలాగని ఆమె షరతును అంగీకరించడం నా స్వార్థం చూసుకున్నట్టు అవుతుంది.' అన్నాడు యువరాజు.

పట్టుపట్టాడు స్నేహితుడు.

'అలాగైతే ఒక షరతు. నీ జవాబు సరైనది అయి నాకు మరణశిక్ష తప్పిన తర్వాతే మీ పెళ్లి.' అన్నాడు యువరాజు.

మంత్రగత్తె అందుకు అంగీకరించి సమాధానం చెప్పింది.

జవాబు :

" ఏ స్త్రీ అయినా నిజంగా కోరుకునేది ఒక్కటే. తన జీవితానికి సంబంధించిన ప్రతి విషయం తన చేతుల్లోనే ఉండాలి."

అదే సమాధానాన్ని శత్రురాజుకు చెప్పాడు యువరాజు. మరణదండన తప్పింది. యువరాజుకు స్వేచ్ఛ లభించింది. అంతేకాదు వారి స్నేహానికి ముచ్చటపడిన శత్రురాజు, రాజ్యాన్ని కూడా తిరిగి ఇచ్చేసాడు. మంత్రగత్తెకు ఇచ్చిన మాట ప్రకారం వారిద్దరికీ ఘనంగా వివాహం జరిపించాడు యువరాజు.

మొదటిరాత్రి...

తన స్నేహితుడి కోసం ఎదురుచూస్తోన్న ఓ భయంకర అనుభవాన్ని తలచుకుని యువరాజు లోలోన కుమిలిపోతుండగా , స్నేహితుడు మాత్రం చిరునవ్వుతో శోభనపు గదిలోకి అడుగుపెట్టాడు.

ఆశ్చర్యం!

అక్కడ పడక మీద ఓ అద్భుత సౌందర్యరాశి అతనికి స్వాగతం పలికింది. ఏమిటిదని అడిగాడు.

'నీ స్నేహితుడైన యువరాజు ప్రాణాలను కాపాడడం కోసం నువ్వు చేసిన త్యాగానికి ప్రతిఫలం... నీ భార్యగా నాకు సగం దక్కింది. అందుకే నాకీ రూపం ప్రాప్తించింది. అయితే ఈ అందం రోజులో సగకాలం మాత్రమే ఉంటుంది. మిగిలిన అర్థకాలం నేను నా అసలు రూపంతోనే ఉంటాను. ఇప్పుడు నువ్వు చెప్పు. నేనెప్పుడు ఏ రూపంతో ఉండాలి.

పగలు అందగత్తెగా కనిపిస్తే...

గొప్ప అందగత్తెకు భర్తగా నీకు గౌరవం ఉంటుంది. కానీ రాత్రి వేళ ఒక కురూపితో కాపురం చేయాల్సి ఉంటుంది.

రాత్రిళ్ళు అందగత్తెగా కనిపిస్తే ...

ప్రతి రాత్రీ స్వర్గసుఖాలు అనుభవించవచ్చు. కానీ పగటిపూట ఎక్కడికి వెళ్ళినా నీ వెంట ఉండే కురూపిని చూసి అందరూ నిన్ను ఎగతాళి చేస్తారు.నిర్ణయం నీది. నీకు ఎలా కావాలో చెప్పు.' అంది మంత్రగత్తె.

'ఇది నాకు మాత్రమే సంబంధించిన విషయం కాదు. నా భార్యగా నీకు కూడా సంబంధించినది. ఏ స్త్రీ అయినా తనకు సంబంధించిన విషయాలపై తనే నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటుందని నువ్వే చెప్పావు. అలాంటి సహజసిద్ధమైన స్త్రీ కోరికను నీ విషయంలో నేను తీర్చాలనుకుంటున్నాను. భర్తగా అది నా బాధ్యత కూడా. కాబట్టి ఈ విషయంలో నువ్వే నిర్ణయం తీసుకో. దానికి నేను మనస్పూర్తిగా కట్టుబడి ఉంటాను.' ఏమాత్రం తడబడకుండా అన్నాడు.

మంత్రగత్తె మనసు ఉప్పొంగిపోయింది. 'నీ స్నేహితుడి ప్రాణాలను కాపాడడం కోసం నా లాంటి కురూపిని పెళ్లి చేసుకోడానికి సిద్ధపడితే, అది కేవలం త్యాగమే కదా అనుకున్నాను. పెళ్లి అయిన తర్వాత నన్ను భార్యగా గౌరవిస్తావో లేదో అన్న సందేహం కలిగింది. అందుకే ఈ విధమైన ప్రశ్న నీ ముందుంచాను. భార్య రూపంతో నిమిత్తం లేకుండా ఆమెను స్త్రీగా గౌరవించే నీ లాంటి భర్తను పొందాక నాకీ మంత్రశక్తులతో పనేముంది? నా జీవితమంతా తపించింది నీలాంటి భర్తకోసమే. అందుకే నేను అన్ని వేళల్లోనూ సౌందర్యవతి గానే, యవ్వనంతో ఉండేందుకు నా శక్తులన్నీ ధారపోస్తున్నాను.' అన్నదామె.

భర్త నుంచే కాదు, సమాజం నుంచి కూడా స్త్రీ ఆశించేది ఒక్కటే!

తన జీవితం తన చేతుల్లో ఉండాలి. ఆ స్వేచ్ఛను ఆమెకు ఇవ్వనప్పుడే పరిస్థితులు వికృతంగా మారుతాయి!

No comments:

Post a Comment