త్వరలో అంతరించబోయే మా తరం గురించి ఓ మాట సెప్పాలనుకున్నా బాబా. మేమెంతో కష్టపడి ఈ స్థాయి కొచ్చాం. మాకు అమ్మమ్మ నాన్నమ్మ ల ఆప్యాయత తెలుసు. తాతతో కలిసి పొలం గట్ల మీద తిరగటం తెలుసు. రాత్రి తొమ్మిదింటికి తొలినిద్ర చేసేవాళ్ళం తెల్లవారుజామున తొలికోడి కూతతో నిద్ర లేచే అలవాటు పడినవాళ్ళం. సూర్యోదయానికి ముందు ఇంటి ముందు పేడ కల్లాపు వాకిటినిండా ముగ్గులు,ఇంట్లో దేవుని ముందు దీపం వెలిగిస్తే గానీ ఏమీ తినని అమ్మలను చూసాం అలా పొలం గట్టుకు వెళ్ళొస్తా అని ఉదయాన్నే నడక ప్రారంభించే తండ్రుల తరం తెలుసు.పెద్దవాళ్ళు కనిపిస్తే చేతులు జోడించి నమస్కరించిన బాల్యం తెలుసు.వేపపుల్ల, గానుగ పుల్ల తో ముఖం కడిగి కుంకుడు కాయలు కొట్టుకుని తలంటుకొని నుదుట కుంకుమ బొట్టు పెట్టుకునే అలవాటు ఉన్న రోజులు తెలుసు. పండుగ వస్తే ఆప్యాయంగా ఇంటికి పిలిచిన బంధువులు, ఊరిలో ఏదైనా జరిగితే ఊరంతా వచ్చి ఆ ఇంటి దగ్గర చేరి తలా ఒక పనిచేసే జనం తెలుసు, ఎడ్ల బళ్ళు మీద తీర్ధాలకు వెళ్లిన వాళ్ళం ఇప్పటిలా వస్తువులతో కాకుండా మనుషులతో ఎక్కువగా గడిపే తరం తెలుసు .ఉత్తరం తెచ్చే పోస్టుమాన్, ఊళ్ళో చాటింపు వేసే గ్రామ తలారి,తెలుగు పంచాంగం తో క్యాలెండర్, ప్రతి ఇంటి ముందు పూల మొక్క ఏ వీధిలో చూసినా తలంటుకొని పూలు కోస్తూ పొద్దుటే కనిపించే స్త్రీ మూర్తులు,శ్రీరామ నవమి కి పానకాలు,వినాయక చవితికి అన్న సంతర్పణ, అట్ల తద్ది కి ఉయ్యాల, కృష్ణాష్టమి కి ఉట్టి కొట్టడం భోగి మంట వెయ్యాలంటే ఇంటింటికీ వెళ్లి పుల్లలు పిడకలు పోగేయ్యటం ఎన్ని పోగుచేసినా ఎత్తుకొచ్చిన పుల్లలు మంటలో వెయ్యటం గురించి తెలుసు.బ్లాక్ అండ్ వైట్ సినిమాలో సైడ్ వీరో,సైడ్ వీరోయిన్ గురించి సినిమా చూడకుండా కూడా చెప్పిన కబుర్లు.....ఇలా ఎన్ని చెప్పుకున్నా తరగని జ్ఞాపకాలు. ఇప్పుడవేవి కనబడటం లేదు.చల్ల కవ్వం ,పప్పు గుత్తి, అట్ల కాడ, చురకత్తి,చేతి కర్ర ......రాబోయే కాలంలో ఇవేంటో చెప్పగలరా. వీటన్నింటినీ చూసిన పెద్దవాళ్లను గుండెల్లో పెట్టి చూసుకుందాం.
No comments:
Post a Comment