Thursday, March 26, 2020

ఉగాది విశేషాలు

-----//ఉగాది విశేషాలు/- /---
వసంతకాలంలో చైత్ర శుక్ల పాడ్యమి నాడు నూతన సంవత్సరాది.ఈ సంప్రదాయం కన్నడ, మహారాష్ట్రులకు కూడ ఉంది.వింధ్య పర్వతాలకు దక్షిణాన శాలివాహన శకం ఉత్తరాన విక్రమార్క శకము పాటిస్తారు.ఇందుకు ఓ ఆసక్తికరమైన కథ ఉంది.ఇది మహారాష్ట్రలో ప్రచారంలో ఉంది.

పురంధరపురంలో ఓ ధనవంతుడైన వర్తకుడు తాను చనిపోయేముందు తన నలుగురు కుమారులకు సీళ్ళు వేసిన డబ్బాలను ఇచ్చి ఆ ప్రకారం పిల్లలు ఆస్తులు పంచుకోవాలని సూచించాడు.
ఆ పాత్రలలో ఒక దానిలో మట్టి, మరొక దానిలో బొగ్గులు,ఇంకోదానిలో ఎముకలు, చివరి డబ్బాలో తవుడు ఉన్నాయి. దీని భావం తెలియక సోదరులు నలుగురు విక్రమార్క చక్రవర్తి వద్దకు పరిష్కారం కోసం వెళ్ళారు. కాని విక్రమార్కునికి దాని అంతరార్ధం అంతుబట్టలేదు.ఆ సోదరులు పరిష్కారం కోసం ప్రతిష్ఠానపురం వెళ్ళారు. ఎవ్వరూ పరిష్కారం చెప్పలేకపోయారు. కాని ప్రతిష్ఠానపురం లోని ఓ బాలుడు ఆ చిక్కుముడిని విడదీసాడు.

ఆ బాలుడు వారి సమస్యను విని మట్టితో నిండిన పాత్ర వచ్చిన కుమారుడు భూమిని, బొగ్గులతో నిండిన పాత్రను పొందిన కుమారుడు కలపనూ,ఎముకలతో నిండిన పాత్ర కలిగిన కుమారుడు ఏనుగులు, గుఱ్ఱాలు మొదలైన జంతువులను,తవుడు తో నిండిన పాత్రను పొందిన కుమారుడు ధాన్యాలనూ పంచుకోవాలని వర్తకుని తాత్పర్యమని చెప్పాడు. ఆ బాలుని పేరే శాలివాహనుడు.

శాలివాహనుని సంగతి విన్న విక్రమార్కుడు ఆ బాలుడిని చూడాలని కుతూహలపడి కబురు చేశాడు. అందుకు శాలివాహనుడు తిరస్కరించి విక్రమార్కుడే తన దర్శనానికి వచ్చే రోజు వస్తుందన్నాడు.విక్రమార్కుడు కోపించి శాలివాహనునిపై సమరానికి వచ్చాడు.ఇది విని శాలివాహనుడు మట్టితో మనిషి బొమ్మలు చేసి తన మంత్రశక్తితో వాటికి జీవం పోసి విక్రమార్క చక్రవర్తి సేనలను సమ్మోహనాస్త్రంతో నిదురపోయేటట్లు చేశాడు. అప్పుడు ఆకాశవాణి ఆ ఇద్దరినీ ఉద్దేశించి నర్మదానదీ ఉత్తరాన విక్రమార్కుని,దక్షిణాదిని శాలివాసనునీ రాజ్యం చేయమని ఆజ్ఞాపించింది.
ఆ విధంగా చైత్ర శుక్ల పాడ్యమి నాడు శాలివాహనుడు తన రాజ్య పట్టాభిషక్తుడయ్యాడు.శాలివాహన శకారంభకుడయ్యాడు.ఆ రోజు యుగాది అయ్యింది.

ఆదిలో ఈనాడే బ్రహ్మ దేవుడు సృష్టిని ప్రారంభించాడు.ఈ కారణంగానే ఉగాది నాడు కొత్త లెక్కలు ప్రారంభించే ఆచారం వచ్చింది. వనవాసానంతరం సీతారాములు అయోధ్యకు ఈనాడే తిరిగి వచ్చారు.వసుమహారాజు తపస్సు చేసి ఈనాడే రాజ్యాధికారం సాధించాడు. అందుకే ఉగాదికి అంత ప్రాశస్థ్యం.ఉగాది నాడు చేయవలసినవి:
1.ప్రతిగృహ ధ్వజారోహణం:
ఉగాది నాడు ప్రతీ ఇంటిపైన బ్రహ్మధ్వజాన్ని ఎగురవేయాలి.కొత్తగా ఇల్లు కట్టేవారు ఉగాది నాడు కట్టుబడి ప్రారంభించాలి.మనమైతే మానేశాం కానీ మహారాష్ట్రులు ఇప్పటికీ ఈ ఆచారాన్ని పాటిస్తున్నారు. వారు ఈ పండుగను" గుడిపర్వా" గా వ్యవహరిస్తారు.

2.తైలాభ్యంఖనము:
ఉగాది నాడు తొలిఝాములోనే నువ్వులనూనెతో తలంటు పోసుకోవాలి.

3.నవ వస్త్రాభరణ ధారణ,ఛత్రచామరాది స్వీకరణ:
ఉగాది నాడు ఉదయాన్నే శుచి అయి కొత్తబట్టలు‌,కొత్త నగలూ ధరించాలి. ఎండాకాలం ప్రారంభమవుతుంది కాబట్టి కొత్త గొడుగు,విసనకఱ్ఱలను సమీకరించుకోవాలి.

4.దమనేన బ్రహ్మ పూజనం:
ఈనాడు బ్రహ్మను దమనంతో పూజ చేయాలి. ఈ పక్షంలోని పదిహేను దినాలు ఆయా దేవతలకు దమనంతో పూజలు చేయాలి. ఆ దమనపు ఆకులను స్త్రీలు తమ శిరస్సుపై ధరించాలి.

5.సర్వ పచ్చాంతికర మహాశాంతి:
ఈరోజు చేసే శాంతి కార్యక్రమాన్ని'సర్వ పచ్చాంతికర మహాశాంతి' అంటారు.ఈ శాంతిలో భాగంగా వినాయకుని,నవగ్రహాలను,బ్రహ్మాది దేవతలను పూజించాలి.

6.నింబ కుసుమ భక్షణం;
ఉగాది ఋతుసంబంధమైన పండుగ. ఆయా పండుగలలో ఆయా ఋతువుల్లో లభ్యమయ్యే ప్రకృతి పదార్ధాలను సేవించాలి. ఈ ఋతువులో మాత్రమే లభ్యమయ్యే నింబ కుసుమాన్ని(వేప పూవును) తినాలి.
ఉగాది నాటికి వేప చెట్లు ముమ్మరంగా పూతపూసి ఉంటాయి. వేప పువ్వు ఓషధి.రక్తాన్ని శుద్దిచేసి వృద్ది పరుస్తుంది.పంచాంగంలో 'నింబ కుసుమ భక్షణం'అని ఉన్నా ధర్మసింధువు మాత్రం'నింబ పత్రాశనం'అని చెబుతోంది. దీనిని బట్టి వేప ఆకులను తినాలి.
వేప పువ్వు, అప్పుడే తొడుగుతున్న మామిడి పిందెలు,చెఱకు, అరటిపండు లతో చింతపండు కలిపి పచ్చడి చేసుకొని తింటారు. ఇది కన్నడ దేశంలో కూడ పాటిస్తారు. తమిళ సోదరులు వారి సంవత్సరాది విసు పండుగ నాడు వేప పువ్వును పంచదార తో కలుపుకుని తింటారు.

శ్లో.యద్వర్షాదౌ నింబసుమం
శర్కరామ్ల ఘృతైర్యుతమ్
భక్షితం పూర్వాయామేస్యా
త్తద్వర్షం సౌఖ్యదాయకం

ఉగాది నాడు వేపపువ్వు,చక్కెర,చింతపండు, నెయ్యి కలిపిన మిశ్రమాన్ని తొలిఝాములోనే తినమని ఈ శ్లోక భావం.

7.పంచాగ శ్రవణం:
సంవత్సరాది నాడు పంచాంగానికి పూజచేసి పంచాంగ శ్రవణం చేయాలి. తిధి,వార,నక్షత్ర,యోగ,కరణాలనే పంచాంగముల సమూహమే పంచాంగం.ఆ సంవత్సరం ఏవిధంగా గడుస్తుందో తెలియజెప్పేదే ఈ పంచాంగశ్రవణం.

సంపద కోరేవాడు తిధి విషయంలోనూ...
దీర్ఘాయువును కోరేవారు వారం విషయంలోనూ.....
పాపవిముక్తిని కోరేవారు నక్షత్ర విషయంలోనూ.....
రోగాలనుండి రక్షణ కొరకు యోగ విషయంలోనూ....
పనులలో విజయం కొరకు కరణం విషయంలోనూ...
జాగ్రత్తగా ఉండాలి. వాటి గురించి తెలుసుకోవటానికి ఈ పంచాంగ శ్రవణం చెయ్యాలి.

8.ప్రపాదాన ప్రారంభం:
ఉగాది నాడు తప్పనిసరిగా ఆచరించవలసిన విద్యుక్త ధర్మం ప్రపాదానం.
ప్రప అంటే చలిపందిరి.ప్రపాదానం అంటే చలివేందర ఏర్పాటు చేసి మంచినీరు పంచడం.
దప్పిక కొన్నవారికి మంచినీటిని ఇచ్చి దాహార్తిని తీర్చాలి.తొలకరించే వరకూ ఈ ప్రపాదానాన్ని నిర్వహించాలి.ఇప్పుడు మనం నీరిచ్చినా అది మినరల్ వాటర్ కాకుంటే పుచ్చుకోరు.ఇప్పుడు కూడ చలివేందరలు పెడుతున్నారు.

9.రాజదర్శనం:
స్వప్నంలో అయినా రాజదర్శనం కావడం శుభప్రదమంటారు.
నూతన సంవత్సరాది రోజున రాజదర్శనం చేస్తే శ్రేయోదాయకం.

10.వాసంత నవరాత్రి ప్రారంభం:
ఉగాది చైత్రమాసపు తొలిరోజు. ఆనాడు కలశ స్థాపన చేసి తొమ్మిది రోజులు వసంత నవరాత్ర పూజలు చేసినట్లయితే అపమృత్యు భయం ఉండదని ధర్మసింధువు చెబుతోంది. రెడ్డిరాజులు,విజయనగర ప్రభువులు ఈ వసంతోత్సవాలను ఘనంగా నిర్వహించేవారని చరిత్ర చెబుతోంది.
మామిడి చెట్టు కింద మంటపమేర్పరచి
, దానిపై పూర్ణకలశాన్ని నెలకొల్పి,కస్తూరి,కర్పూరం,మొదలైన సుగంధ ద్రవ్యాలు, దవనం,మరువం మొదలైన సువాసనా పత్రాలనతో కలశను నింపి పూజాపీఠం మీద
వసంతుని,రతీ మన్మధులను,లక్ష్మీనారాయణులను,గౌరీశంకరులను,శచీపురందరులను నెలకొల్పుతారు.
దేశపు రాజు హయారూఢుడై వచ్చి ఈ దేవతలను పూజించి ప్రజలందరిపై పన్నీరు,వసంతాలను జల్లుతాడు.ఆ సందర్భంగా విద్యావినోదాలు,వినోద క్రీడలు ప్రదర్శిస్తారు.

ప్రాయకంగా ఇవీ ఉగాది నాడు చేయవలసినవి.
వీటిలో చాలవాటికి గోవింద కొట్టేశాము.ఒకటో రెండో మిగిలితే వాటిని ఈ సారి కొరోనా తుడిచేసింది.
కొరోనా పుణ్యమా అని ఇంటితెరకూ‌,ఇంటర్నెట్ కూ అతుక్కుపోయిన వారికి ఈ ఉగాది వేడుకల వివరణ.
(ఆండ్ర శేషగిరిరావు గారి పండుగలు పరమార్ధాలు నుండి సేకరణ)
_చక్రావధానుల రెడ్డప్ప ధవేజి
శార్వరి ఉగాది సందర్భంగా...

No comments:

Post a Comment