Friday, March 13, 2020

బంధాలు- అనుబంధాలు

బంధాలు- అనుబంధాలు

బంధం అంటే ముడి. కనిపించని పాశం ఇద్దరు మనుషుల్ని కట్టిపడేస్తే అది అనుబంధం. అంటే పరస్పరం ఒకరిపై ఒకరికి ప్రేమాభిమానాలు కలిగి ఉండటం. ఇద్దరు యువతీ యువకుల మధ్య పెరిగే అనుబంధం ప్రేమానుబంధం. అక్కాచెల్లెళ్లు, అన్నదమ్ముల మధ్య పెరిగే బంధం అనురాగ బంధం. తల్లిదండ్రులు పిల్లలపై పెంచుకునే అనుబంధం పేగుబంధం.

అరవై వేల సంవత్సరాలు అయోధ్యా నగరాన్ని పరిపాలించిన దశరథ మహారాజును సంతానలేమి ఎంతో బాధపెట్టింది. ఎన్నో వ్రతాలు, యజ్ఞాలు చేశాడు. చివరకు నలుగురు కుమారులను కన్నాడు. పెద్దవాడైన రాముడే అతడి సర్వస్వం. రాముడే ఊపిరిగా దశరథుడు బతుకుతున్న తరుణంలో- యాగ సంరక్షణ కోసం అతణ్ని తనతో పంపమని విశ్వామిత్రుడు కోరాడు. దశరథుడు వణికిపోయాడు. మూర్ఛిల్లాడు. వలవలా ఏడ్చాడు. విశ్వామిత్రుడు కోపోద్రిక్తుడయ్యాడు. వసిష్ఠుడు నచ్చజెప్పడంతో కుమారుణ్ని పంపడానికి దశరథుడు అంగీకరించాడు. విశ్వామిత్రుడి గొప్పతనం, రాముడి జన్మరహస్యం తెలిసీ దశరథుడు వెనకాడాడంటే- అతడిలోని పుత్రప్రేమ అనే పేగుబంధమే అందుకు కారణం. చివరికి ఆ పేగుబంధమే ఆయన ప్రాణాలు తీసింది- రాముడు అరణ్యవాసానికి వెళ్లగా!

విశ్వామిత్రుడికి తపోభంగం చేసి గర్భవతియైన మేనక ఆడశిశువును కని కాననంలో విడిచి వెళ్ళింది. కణ్వుడి పెంపకంలో ఆమె శకుంతలగా మారింది. కణ్వుడు లేని సమయాన దుష్యంతుణ్ని వలచింది. గాంధర్వమాడింది. కణ్వుడు తరవాత అంతా తెలుసుకుని ఆమెను అత్తవారింటికి సాగనంపుతూ కూతుర్ని విడువలేక ఆక్రోశించాడు. పెంచిన తండ్రికే ఇంత బాధగా ఉంటే, కన్న తల్లిదండ్రులెంత కలత చెందుతారో అనుకుంటాడు.

శకుంతల అత్తవారింటికేగుతూ ఉద్యానవనంలో తాను నీళ్ళు పోసి పెంచిన మొక్కలను, తన చుట్టూ గంతులేసి తిరిగిన జింకలను, పక్షులను తాకుతూ, వాటి బాగోగుల్ని ముని కుమారులకు అప్పగించడం మమతానుబంధానికి ఉదాహరణ!

లోకాపవాద భీతి కారణాన రాముడు తన శీలాన్ని శంకించినా- సీత, జూదక్రీడ కారణాన ధర్మరాజు వల్ల ద్రౌపది, సత్యవాక్పరిపాలన కోసం హరిశ్చంద్రుడు తనను దాసిగా విక్రయించినా చంద్రమతి... సహనశీలతతో భరించడం నాటి వివాహ బంధానికి చక్కని తార్కాణాలు!

శ్రీకృష్ణ కుచేలురు దర్భల కోసం వెళ్లి పెను తుపానులో చిక్కుకోగా, వారిని వెతుక్కుంటూ చీకట్లో గురువుగారైన సాందీపుడు వెళ్ళడం గురుశిష్య బంధానికి మచ్చుతునక! అలనాడు చిన్నతనంలో కలిసిమెలిసి తిరిగినది గుర్తుగా శ్రీకృష్ణుడంతటివాడు పేదరికంలో వచ్చిన కుచేలుణ్ని ఆత్మీయతతో అక్కున చేర్చుకోవడం, అష్టైశ్వర్యాలూ ప్రసాదించడం మైత్రీబంధానికి నిదర్శనం!

ఎక్కడ నుంచి వచ్చామో, ఎక్కడికి వెళ్తామో తెలియకపోయినా చావు పుట్టుకల మధ్యకాలంలో జరిగిన ప్రయాణాలు, యాత్రలు, ఆకస్మిక కలయికలతో ఎందరెందరితోనో బంధాలు ఏర్పడతాయి. గాలిపటాల్లా కొన్ని మధ్యలోనే తెగిపోతాయి. ప్రవాహ ఉద్ధృతిలో ఎక్కడి నుంచో కొట్టుకొచ్చి, కలుసుకుని మళ్ళీ వేరైన ఎండుకట్టెల్లా మానవ సంబంధాలు కలిసి విడిపోవటం సహజం!

ఈ బంధాలు ఎక్కువైనా, తక్కువైనా మనిషి సహనం కోల్పోతాడు. ప్రేమ ఎక్కువైనప్పుడు దశరథుడు కైకేయికి వరాలు గుప్పించాడు. ఆమెతో కూరిమి చెడినప్పుడు చీదరించుకున్నాడు. ఈ బంధాల వల్లనే ఈర్ష్య, అసూయ, క్రోధం, ద్వేషాలు అధికమవుతాయి. వీటన్నింటికీ అతీతమైన వైరాగ్యంతో మనసు పెనవేసుకోగలిగితే తక్కిన ఐహిక బంధాలన్నీ తామరాకులపై నీటి బుడగలే అవుతాయి!

No comments:

Post a Comment