Monday, April 6, 2020

నానాటి బదుకు నాటకము (తాళ్ళపాక అన్నమాచార్యులు)

నానాటి బదుకు నాటకము:-
( తాళ్ళపాక అన్నమాచార్యులు)

నానాటి బదుకు నాటకము
కానక కన్నది కైవల్యము

పుట్టుటయు నిజము ... పోవుటయు నిజము
నట్టనడి మీ పని నాటకము
ఎట్ట ఎదుట గలది ప్రపంచము
కట్ట కడపటిది కైవల్యము

కుడిచేదన్నము ... కోక చుట్టెడిది
నడుమంత్రపు పని నాటకము
వొడిగట్టుకొనిన ఉభయ కర్మముల
గడి దాటినప్పుడే కైవల్యము

తెగదు పాపము ... తీరదు పుణ్యము
నగి నగి కాలము నాటకము
ఎగువలో శ్రీ వేంకటేశ్వరుడేలిక
గగనము మీదిది కైవల్యము


శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల వారు రెండు విషయాలను మనకు విన్నవించారు. ఒకటేమో నాటకం, రెండవదేమో కైవల్యం.

నానాటి అంటే నాలుగు రోజుల ఈ బతుకు... బాల్యము, యవ్వనము, ప్రౌఢత్వం, వృద్ధాప్యము... ఈ దేహ స్థితులు ప్రతి జన్మలోనూ మనకు ఉంటాయి. ఆ తర్వాత శరీరాన్ని వదిలి పెట్టెయ్యాలి. శరీరాన్ని వదిలి పెట్టకముందే మనం శరీరం కాదు ఆత్మ పదార్ధం అని గ్రహించాలి. ' కానక' అంటే చర్మచక్షువులతో కనకుండా! ' కన్నది' అంటే దివ్యచక్షువుతో మూడవకన్నుతో చూసిందే కైవల్యం అనగా చిట్ట చివరి స్థితి అని వివరిస్తున్నారు శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల వారు.

ఈ పుట్టుక, చావు మధ్యలో ఉన్న పనే నాటకం. 'తల్లిగానో, తండ్రిగానో, భర్తగానో, భార్యగానో, కొడుకుగానో, కూతురుగానో నాటకాలు వేస్తాము', అయితే అదే సత్యమనుకున్నామా దు:ఖంలో పడతాం. మనం ఈ శరీరాన్ని వదిలి పెట్టేసిన తర్వాత వేరే ప్రపంచానికి వెళ్తాం ...సత్యలోక ప్రపంచానికి ! ఆత్మలోక ప్రపంచానికి ... అదే కైవల్యం అంటున్నారు శ్రీ తాళ్ళపాక వారు..

రోజంతా కూడానూ మనం కేవలం అన్నము, బట్టల కోసమే శ్రమిస్తున్నాము! ఎంత మాత్రం 'ఆత్మ ప్రాధాన్యత' లేదు...అన్నానికీ, బట్టకూ! ఏదో శరీరం నిలకడ కోసం కొద్దిగా తింటే సరిపోతుంది. శరీరాన్ని రక్షించుకునేందుకు కొద్దిగా బట్ట చుట్టుకుంటే సరిపోతుంది. దీనికి ఇంతగా పరితపించనేల? నాటకాన్ని నాటకంగానే స్వీకరిద్దాం అని అంటున్నారు అన్నమాచార్యుల వారు. ఉభయ కర్మములు అనగా మంచి, చెడు. ఈ ఉభయ కర్మలు కూడా సమూలంగా నశించాలి! చెడు ఒక బంధం. మంచి కూడా మరొక బంధమే. ఈ రెండూ నశించినప్పుడే కైవల్యం.

పుణ్యం అన్నది తీరేది కాదు. పాపం కూడా తీరేది కాదు. కనుక ఈ రెండింటి నుండి బయటికి రావాలి అనగా పుణ్య భావన నుండి, పాప భావన నుండి బయటికి రావాలి. నువ్వు శరీరమే కాదు, ఆత్మ పదార్థం అని తెలుసుకుంటే రెండింటి నుంచి బయటికి రావచ్చు అని శ్రీ తాళ్ళపాక వారు సెలవిస్తున్నారు. ' ఎగువ' అంటే ఆరు చక్రాల పైన ... సహస్రారంలో అన్నమాట. సహస్రార స్థితిలో ఉన్నవారినే యోగీశ్వరులు అని పిలుస్తారు. వారు మాత్రమే కైవల్య స్థితిని చేరినవారు

నాలుగు రోజుల ఈ శరీర యాత్ర ఓ నాటకం. అయితే ఆత్మయాత్ర అన్నది మటుకు శాశ్వతమైనది. అది మూణ్ణాళ్ళ ముచ్చట కాదు! అది శాశ్వతమైన లీలా యాత్ర! శరీరగతమైన ఈ మూణ్ణాళ్ళ ముచ్చటను ససేమిరా దు:ఖభరితం చేసుకోకుండా, ముచ్చటగా జీవించాలి! అందుకు నాటకాన్ని విధిగా నాటకంగానే స్వీకరించాలి!!

No comments:

Post a Comment