Tuesday, April 21, 2020

ఆనంద రహస్యం

ఆనంద రహస్యం

👌 కొన్ని పనులు మనకు పుట్టుకతో వస్తాయి. కొన్ని మనం నేర్చుకోవాలి. నేర్చుకోవడంలో ఆనందం ఉందన్న సంగతి మనందరికీ తెలుసు.

సీతాకోకచిలుకకు ఎగరడం మనం నేర్పక్కరలేదు. చేపకు ఈత నేర్పక్కరలేదు. ప్రకృతితో మమేకమై జీవించే జీవులకు నేర్చుకునే బాధ లేదు. అవి సహజంగా వాటికి అబ్బుతాయి.

నేర్చుకోవడమన్నది మనిషికి అవసరం. కుండలు తయారు చేసేవాడు ఎంత నైపుణ్యంగా, శ్రద్ధగా, ఏకాగ్రతతో చేస్తాడో అలా ప్రతి మనిషీ ఏదో ఒకటి నేర్చుకోవడంలో పొందే ఆనందం అనుభవైకవేద్యం. నిజానికి ఆనందాన్నే సృష్టించడం నేర్చుకోవాలి. ఆనందం బజారులో దొరికే వస్తువు కాదు. ఆనందం మనమీద మనం చిలకరించుకునే పన్నీరు కాదు. అదో సుగంధ ద్రవ్యమూ కాదు.

ఆనందం ఇతరులను ఆనందింపజేయడంలో ఉంది. తనను తాను మరచి ఇతరుల సంతోషం గురించి నిత్యం ఆలోచించడంలో నిజమైన ఆనందం ఉంది. ఇదే ఆనందసృష్టికి కీలకం.

ఆనందంగా బతకడం రాకపోతే మనిషికి సాటి జీవులతో కలిసిమెలిసి ఉండే అవకాశం దొరకదు. ఆనందంతోనే అతడు ప్రకృతికి దగ్గర కాగలడు. ఆనందంతోనే తన అంతరంగంలో జ్యోతిస్సీమలను వెలిగించుకోగలడు.
ఆనందం మనిషికి దీపశిఖ సంచారిణి.

ఆనంద రహస్యం తెలుసుకున్నవాడు నిత్యం నవ్వుతూ, చలాకీగా నవ్విస్తూ ఉంటాడు. అందులో సందేహం లేదు. ఆనందాన్ని అపార్థం చేసుకున్నవాడే విషాదం వెంట తిరుగుతాడు.

ఈ విశ్వంలో మనం సరైన సంబంధాలు కొనసాగించాలంటే ఆనందమే పరమావధిగా జీవించాలి. ఎవరు ఎంత బాగా, తొందరగా దాన్ని తమ శరీరాల్లోకి వ్యాపింపజేసుకోగలరో వాళ్లకే ఈ బతుకు ఆహ్వానం పలుకుతుంది. ఆత్మదారి దొరుకుతుంది.

తిరోగామిని చేసే విషాదం మూసిన తలుపు వంటిది. దాన్ని బాదుతూ కూర్చోకూడదు. అది తెరుచుకుందా... అడుగులేని గొయ్యి లాగా జీవితం నరకప్రాయమవుతుంది.

ఆనందం కోసం బతికే మనుషులకు భగవంతుడు తప్పక సహాయం చేస్తాడు. సత్యం రుజువు చేసి, ఎందుకు విషాదంగా ఉండకూడదో అర్జునుడికి తెలియజేసిన శ్రీకృష్ణుడిలా మనకూ సహాయపడతాడు.

ఆనందం మన జన్మహక్కు. ఆనందంగా జీవించడం కోసం బతుకు రహస్యం తెలుసుకోవాలి. లేకపోతే జీవనం మొదటి పొర చూసి, అంతా విషాదమేనన్న భ్రమలోనే ఉంటాం.

నాచును తొలగిస్తే లోపల నిర్మలమైన నీరుంటుంది. తెల్లవారిన వెంటనే సూర్యుడు కనిపించడు. కొంతసేపు ఓపిక పట్టి నిరీక్షిస్తే తూర్పు ఎర్రబారుతుంది. లోకమంతా వెలుగుతో నిండిపోతుంది.

జీవించడం అయిపోయిన తరవాతా ఆనందం కనుగొనలేని మనిషి అసంతృప్తికి చిరునామాగా మిగులుతాడు.

ఆనందంలో పుట్టి, ఆనందంలో బతికి, ఆనందంలోనే లయమవుతున్నాయి జీవులు అంటున్నాయి ఉపనిషత్తులు.

తనతోపాటు నిత్యమూ ఉండే వస్తువుపై ఎరుక కలగడమే ఆనందం. ఆ ఆనందం తనకు సహజమైనది, చైతన్యవంతమైనది. అదే సత్యం కూడా.

దాన్నే ఆధ్యాత్మికవాదులు, వేదాంతులు ‘సచ్చిదానందం’ అని పిలుస్తారు.


అది ఆకాశంలోను, నీటిలోను, అణువణువులోనూ ఉంది. మనిషిలో మహత్తరంగా ఉంది. అటు దృష్టి పెట్టడంతోనే ఊటనీరు ఊరినట్లు హృదయంలో పెల్లుబుకుతుంది.🙏

Source: whatsapp group

No comments:

Post a Comment