Friday, May 1, 2020

నమ్మకాల గోడలు కూలి

నమ్మకాల గోడలు కూలి


తల్లికి పిల్ల మీద
పిల్లకు తల్లి మీద
భార్యకు భర్త మీద
భర్తకు భార్య మీద
ప్రియుడికి ప్రియురాలి మీద
ప్రియురాలికి ప్రియుడి మీద
ఎవరి మీద ఎవరికీ
నమ్మకం లేకుండా పోతోంది
ఏ ఇద్దరి వ్యక్తుల మధ్యయినా
నమ్మకమనే వంతెన
నిలువునా కుప్ప కూలిపోతోంది

మన భుజాల మీద
ఎప్పటికీ వాలని
పిట్టవుతుంది నమ్మకం
మన చీకటి దారుల్లో
ఎన్నటికీ వెలగని
దీపమవుతుంది నమ్మకం
అనేకానేక అపనమ్మకాల
విచ్చుకత్తుల మధ్య
నమ్మకం నమ్మకంగా
హత్యగావించబడుతుంది

ఎవర్ని నమ్మాలో
ఎవర్ని నమ్మకూడదో తెలియని
ఒకానొక సందిగ్ధ సమయం
బతుకు మెడ మీద
కత్తిలా వేలాడుతోంది

మాట్లాడే మాటలో అనుమానం
చూసే చూపులో అనుమానం
కలిసి నడిచే నడకలో అనుమానం
హాయిగా నవ్వే నవ్వులో అనుమానం

పూల పరిమళంపై అపనమ్మకం
పున్నమి వెన్నెలపై అపనమ్మకం
పిల్లల చిరునవ్వుల్లోనూ అపనమ్మకం
పల్లెల పచ్చదనంలోనూ అపనమ్మకం
అనుమానం అపనమ్మకం పెనవేసుకున్న
ముళ్ల తోటలవుతున్నారు మనుషులు

సాయం చేసే చేతులకూ
అపనమ్మకాల సంకెళ్లు పడుతున్నాయి
చల్లని చూపుల్ని కురిపించే కళ్లకూ
అనుమానపు పూసులు కడుతున్నాయి

అడుగడుగునా అభద్రత
విషవలయంగా విస్తరించిన చోట
ఏ ఇద్దరి వ్యక్తుల నడుమైనా స్వార్థం
విష సర్పంలా బుసకొడుతున్న వేళ
మనుషులంతా మానవసంబంధాల్లో
ఒంటరి దీవులై మసలుతున్నారు
జీవన మైదాలనిండా
నమ్మకాల గోడలు‌ కూలిన
శిధిల భవనాలై మిగిలిపోతున్నారు!

No comments:

Post a Comment