Friday, May 1, 2020

బంధాలు - అనుబంధాలు

బంధాలు - అనుబంధాలు

రామకృష్ణ మఠానికి చెందిన ఒక స్వామీజీనీ అమెరికాకు చెందిన ఒక విలేకరి చేసిన ఇంటర్వ్యూ.

విలేకరి: స్వామీజీ! ఇంతకుముందు మీరు ఇచ్చిన ఉపన్యాసంలో "బంధాలు అనుబంధాలు" గురించి వివరించారు. నాకు సరిగా అర్థం కాలేదు మళ్ళీ వివరించగలరా?

దానికి స్వామీజీ నవ్వుతూ ప్రశ్నను దాటవేస్తూ,
విలేకరిని తిరిగి ఇలా ప్రశ్నించారు మీరు న్యూయార్క్ నుంచి వస్తున్నారా?

విలేకరి: అవును.

స్వామీజీ : మీ ఇంటిలో ఎవరుంటారు?
ఈ ప్రశ్న పూర్తిగా వ్యక్తిగతము మరియు అసంబద్ధం కావడంతో విలేకరి స్వామీజీ తన ప్రశ్నను దాటవేస్తున్నారు అనుకున్నారు.
అయినప్పటికీ విలేకరి చెప్పసాగాడు అమ్మ చనిపోయారు, నాన్న అక్కడే ఉంటున్నారు. ఇంకా నాకు ముగ్గురు సోదరులు, ఒక సోదరి ఉన్నారు. అందరికీ వివాహం అయింది.

ముఖంలో చిరునవ్వు చెదిరిపోకుండా స్వామీజీ మళ్లీ ఇలా అడిగారు...

నీవు మీ నాన్నగారితో మాట్లాడుతున్నావా?

విలేకరి ముఖకవళికలు మారటం మొదలైంది.

స్వామీజీ: ఆఖరిసారి ఎప్పుడు మాట్లాడావు?

జేవురించిన ముఖంతో విలేకరి ఇలా చెప్పాడు

సుమారు ఒక నెల అయి ఉండొచ్చు.

స్వామి గారి ప్రశ్నల పరంపర కొనసాగింది.

మీ అన్న చెల్లెళ్ళను ఎంత తరచుగా కలుసుకుంటారు?

ఆఖరిసారిగా కుటుంబమంతా ఎప్పుడు కలిసి ఉన్నారు?

ఆ సమయంలో విలేకరి నుదుట నుంచి చెమట కారడం స్పష్టంగా కనిపించింది.

అక్కడ ఎవరు ఇంటర్వ్యూ చేస్తున్నారో అర్థం కాకుండా ఉంది.

స్వామీజీ నా? లేక విలేకరా?

నాకైతే స్వామీజీ విలేకరిని ఇంటర్వ్యూ చేస్తున్నట్లుగా అనిపించింది.

ఒక నిట్టూర్పుతో విలేకరి చెప్పాడు సుమారు రెండు సంవత్సరాల క్రితం … క్రిస్మస్ సందర్భంలో మేమందరము కలిశాము.

స్వామీజీ : మీరందరూ కలిసి ఎన్ని రోజులు ఉన్నారు?

నుదుటన స్వేదబిందువులు తుడుచుకుంటూ విలేకరి అన్నాడు మూడురోజులు.

స్వామీజీ : ఎంతకాలం మీ నాన్నగారితో గడిపావు?

ఆయన పక్కనే ఎంతకాలం కూర్చున్నావు?

ముఖం కందగడ్డలా మారిన విలేకరి కాగితంపై పిచ్చిగీతలు గీయడం మొదలుపెట్టాడు.

స్వామీజీ : నీవు ఎప్పుడైనా మీ నాన్నగారితో కలిసి భోజనం చేసావా? ఆయన ఎలా ఉన్నారని ఎప్పుడైనా అడిగావా?

మీ తల్లి చనిపోయిన తర్వాత ఆయన రోజులు ఎలా గడుపుతున్నారో అడిగావా?

విలేకరి కంటినుంచి కన్నీరు కారటం స్పష్టంగా కనిపించింది.

అప్పుడు స్వామీజీ విలేకరి చేతిని ప్రేమతో అందుకని ఇలా అన్నారు బాధపడకు నాన్నా! నిన్ను తెలియకుండా బాధించి ఉంటే క్షమించు.

కానీ నీవడిగిన
బంధం అనుబంధాలకు సమాధానం ఇదే. మీ నాన్నగారితో నీకు బంధం ఉంది. కానీ అనుబంధం లేదు.

అనుబంధం అంటే హృదయానికి హృదయం కలిసిపోవడం.
కలిసిఉండడం.
కలిసిభోజనం చేయడం.
ఒకరిపై ఒకరు ప్రేమ చూపించడం,
స్పర్శించటం,
చేతులు కలపడం,
కళ్ళలోకి సూటిగా చూడగలగటం,
కలిసి సమయాన్ని గడపడం.

మీ సోదరులందరితో కూడా నీకు బంధం ఉంది. కానీ అనుబంధం లేదు.

ఆ విలేకరి కన్నీళ్ళు తుడుచుకుంటూ స్వామీజీతో అన్నాడు

"బంధం- అనుబంధాల" గురించి ఇంత అద్భుతమైన బోధన చేసినందుకు ధన్యవాదాలు.

ఇదీ నేటి వాస్తవికత.
సమాజంలో గానీ, ఇంటిలోగానీ అందరికీ బోలెడు బంధాలు ఉన్నాయి. కానీ అనుబంధాలు కనుమరుగయ్యాయి.
ఎవరితో ఎవరికీ సంబంధం లేకుండా, ఎవరి ప్రపంచంలో వారు జీవిస్తున్నారు. మనం కూడా బంధాలకు కాకుండా అనుబంధాలకు ప్రాముఖ్యతను ఇద్దాం! పరస్పర ఆప్యాయతలతో కలిసి మెలిసి ఉందాం!
✍️🙏
Source-Sekarana

No comments:

Post a Comment